Home ఎడిటోరియల్ మెరుగైన సైనిక వ్యవస్థ

మెరుగైన సైనిక వ్యవస్థ

sampadakiyam సిబ్బంది పరంగానూ, ఆయుధాల రీత్యానూ సర్వసమగ్రతను సాధించుకోడం ద్వారానే ఏ దేశమైనా తన సైన్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతుంది. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సైనిక వ్యవస్థ కలిగిన భారత దేశం ఈ విషయంలో నిరంతరం అప్రమత్తంగానే ఉన్నది. పొరుగున చైనా, పాకిస్థాన్ వంటి దేశాలను కలిగి ఉన్న ఇండియా సైనికంగా సర్వసన్నద్ధంగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సరిహద్దుల్లో కార్గిల్ వంటి ప్రదేశాలను కలిగి ఉన్న మనం ఈ విషయంలో ఎంత మాత్రం అశ్రద్ధ వహించడానికి వీల్లేదు. భారత సైన్యాన్ని ఒకే ఛత్రం కిందకు తీసుకు రాదలచి రక్షణ దళాలకు సంయుక్త అధిపతిని నియమించదలచినట్టు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రకటన ఈ నేపథ్యంలో కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

ప్రస్తుతం సైనిక, వైమానిక, నౌకా దళాలుగా ఉన్న సైన్యానికి ఉమ్మడి దళపతిని నియమించడం వల్ల ఈ మూడు విభాగాల మధ్య మరింత సమన్వయం నెలకొనగలదని ఆశిస్తున్నట్టు బోధపడుతున్నది. ఈ ప్రతిపాదన వాస్తవానికి 19 ఏళ్ల క్రితం 1999లో ముందుకు వచ్చింది. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో నెలకొల్పిన కె సుబ్రహ్మణ్యం కమిటీ దీనిని ప్రతిపాదించింది. అప్పటి నుంచి అది కార్యరూపం ధరించకుండా కాగితాలకే పరిమితమై ఉంది. ప్రాంతీయ కమాండ్‌లను నెలకొల్పడం ద్వారా సైన్యాన్ని పునర్నిర్మించడం లక్షంగా ఇది జరుగుతుంది. సైన్యం, వైమానిక, నావికా దళాలు మూడింటా అన్ని వ్యవస్థలూ ఒకే అధికారి అదుపాజ్ఞల్లోకి వస్తాయి. ఈ కమాండింగ్ అధికారి ఈ మూడు విభాగాల్లోని ఏదో ఒక దానికి చెంది ఉంటారు. ఒకే వ్యవస్థ లేదా విధానం ఒకే రూపంలో మూడు చోట్లా ఉండే పరిస్థితిని తొలగించడానికి ఇది దోహదపడుతుంది.

దీని వల్ల సైన్యం సామర్థం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 66 దేశాల్లో ఈ ఉమ్మడి దళపతి విధానం అమలులో ఉంది. సైన్యం వద్ద గాని వైమానిక నౌకా దళాల వద్ద గాని ఉండే వేర్వేరు క్షిపణులు కొత్త వ్యవస్థలో ఒకే చోట ఉంటాయి. ఇందువల్ల నిధుల వ్యయంలో పొదుపు సాధ్యమవుతుంది. ఇలా సైన్యంలో ఏరియా లేదా థియేటర్‌ల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కనీసం నాలుగు లేదా ఐదేళ్లు పడుతుందంటున్నారు. అమెరికాలో సైనిక వ్యవస్థ మొత్తం ఆరు థియేటర్లుగా విభజించబడి ఉంటుంది. ప్రపంచాన్ని ఈ ఆరు కమాండ్ల కింద విభజించి అప్పగిస్తారు. భారత సైన్యం పని విధానం మొన్నటి పుల్వామా ఉగ్రదాడి అనంతరం పరిణామాల్లో పాకిస్థాన్‌లోని బాలాకోట్ పై దాడి సమయంలో ఆత్మరక్షణ నుంచి ఎదురు దాడి పద్ధతిలోకి మారింది.

సైన్యం ఎదురు దాడి ద్వారా తనను తాను రక్షించుకొనే వైఖరిని చేపట్టింది. అంటే శత్రువు మన పై దాడికి సమకట్టడానికి ముందే విరుచుకుపడడం ద్వారా నిలువరించడానికి ప్రాధాన్యం ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధాని మోడీ హయాంలో సైన్యాన్ని ఆత్మరక్షణ కోసం ఎదురు దాడిని ఆశ్రయించే రీతిలో సంసిద్ధం చేయదలిచినట్టు బోధపడుతున్నది. శత్రువు కదలికలను ముందుగానే పసికట్టడం ద్వారా దీనిని సాధించదలచుకున్నట్టు భావించాలి. ఇందుకోసం ఉమ్మడి దళపతి కమాండ్ కింద సైన్యాన్ని పునర్వవస్థీకరించదలచినట్లు అవగతమవుతున్నది. మొత్తంగా అన్ని వ్యవస్థలను కేంద్రీకరణ వైపు నడిపించడం ప్రధానోద్దేశంగా కనిపిస్తున్నది. దీనివల్ల వికేంద్రీకృత, ప్రజాస్వామిక వ్యవస్థలకు బదులు కేంద్రీకృత ధోరణులు నెలకొనే అవకాశం కలుగుతుంది. సైన్యం మరింత బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది. ఒకే జాతి, ఒకే రాజ్యాం గం, ఒకే ఎన్నిక వంటి ఆలోచనలో భాగంగానే ఒకే అధిపతి గల సైనిక వ్యవస్థను ఉద్దేశిస్తున్నట్టు అర్థం చేసుకోవలసి ఉంది.

ఉదాహరణకు సమాచార హక్కు కమిషనర్ల వ్యవస్థలో అంతవరకు ఉన్న వికేంద్రీకృత స్థితిని తొలగించి కేంద్రం చెప్పుచేతల్లోకి వ్యవహారాన్ని తీసుకువచ్చి రాష్ట్రాల సమాచార హక్కు కమిషనర్ల నియామకాన్ని కూడా కేంద్రమే చేపట్టేలా చేసినట్టు నిర్ణయాధికారాన్ని కేంద్రీకరించడం జరిగింది. సైనిక వ్యవస్థలో ఈ కేంద్రీకృత స్థితి మొత్తం సైన్యం సామర్ధాన్ని పెంచడానికి అవకాశం కలుగుతుంది. దేశాన్ని సైనికంగా మరింత బలోపేతం చేసి త్రివిధ దళాలపైన ఒకే ఉమ్మడి కమాండ్‌ను నెలకొల్పడం ప్రధాన లక్షంగా కొత్త వ్యవస్థ రూపు దిద్దుకోనున్నట్టు బోధపడుతున్నది. సరిహద్దుల్లో సవాళ్లు పెరిగినప్పుడు ఈ కొత్త వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి సైన్యం మీద అపూర్వమైన అదుపాజ్ఞనలను ఇస్తుంది. ఆ మేరకది బలవత్తరమైన కమాండ్‌ను కంట్రోల్‌ను కలిగించి కొత్త పరిస్థితులకు అనువైన స్థితిని కలిగిస్తుందని ఆశించవచ్చు.

PM Modi announces creation of Chief of Defence Staff