Home జాతీయ వార్తలు భారత్‌భూటాన్ పది ఒప్పందాలు

భారత్‌భూటాన్ పది ఒప్పందాలు

 

PM Modi

 

భూటాన్ అభివృద్ధికి భారత్ సహకారం
రెండు దేశాల ప్రధానుల సంయుక్త ప్రకటన
మోడీ, భూటాన్ ప్రధాని షేరింగ్ విస్తృత చర్చలు
మోడీకి భూటాన్ ప్రధాని రెడ్ కార్పెట్ స్వాగతం
భూటాన్‌లో మోడీ రెండు రోజుల పర్యటన

థింపూ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, భూటాన్ ప్రధానమంత్రి లోటే షేరింగ్ శనివారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి వారు చర్చించారు. రెండు దేశాల సంబంధాలు మరింత పటిష్టం అయ్యేందుకు నూతనోత్తేజాన్ని కల్పించేలా పది అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ‘మా సమావేశం సమగ్రంగా జరిగింది. ఇండియా, భూటాన్‌ల సంబంధాల గురించి చర్చించాం. మన దేశాల మధ్య ఆర్థికంగా, సాంస్కృతికంగా సంబంధాలు మరింత దృఢతరం అయ్యేందుకు ఈ చర్చలవల్ల గొప్ప అవకాశం కలిగింది’ అని మోడీ చెప్పారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి భూటాన్ పర్యటనకు వెళ్లిన మోడీ మంగ్నదేచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. అలాగే జలశక్తి రంగంలో రెండు దేశాలమధ్య అయిదు దశాబ్దాలుగా కొనసాగుతున్న సహకారానికి గుర్తుగా తపాలా బిళ్లల్ని మోడీ ఆవిష్కరించారు.

 

పది ఒప్పందాలు
‘నేను రెండోసారి అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే భూటాన్‌కు రావడం చా లా సంతోషంగా ఉంది’ అన్నారాయన. చరిత్రాత్మకమైన సిమ్‌టోఖా జోంగ్‌లో భూటాన్ ప్రధానమంత్రితో కలిసి ప్రతినిధి వర్గం స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం వెలువడిన సంయుక్త పత్రికా ప్రకటనలో మోడీ ఈ వ్యాఖ్య చేశారు. అంతరిక్ష పరిశోధనలు, విమానయానం, ఐటి, విద్యుత్, విద్య రంగాల్లో 10 అవగాహనా పత్రాలపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి.

సహకారం అందిస్తాం : మోడీ
అంతరిక్ష సాంకేతికతను వాడుకొని భూటాన్ అభివృద్ధి చెందేందుకు తగిన సహకారం అందించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. ‘భూటాన్ అభివృద్ధిలో ఇండియా ప్రధాన భాగస్వామి కావడం మాకున్న హక్కు’ అన్నారు మోడీ.1629లో షబ్‌డ్రంగ్ నామ్‌గ్యాల్ నిర్మించిన చారిత్రక కట్టడం సిమ్‌టోఖా జోంగ్‌లో ఒక వస్తువును కొని నరేంద్రమోడీ భూటాన్‌లో రూపే కార్డును కూడా ప్రారంభించారు. సిమ్‌టోఖా జోంగ్ ఒక సన్యాసాశ్రమంగా, పాలనా కేంద్రంగా పనిచేస్తుంది. భూటాన్‌లో అతి ప్రాచీన కట్టడాల్లో ఇదొకటి. భూటాన్ ప్రధాని షేరింగ్ మాట్లాడుతూ ‘భౌగోళికంగా ఇండియాకు, భూటాన్‌కు మధ్య చాలా తేడా ఉండవచ్చు. కానీ విలువలు, నమ్మకాలు, ప్రేరణలు మాత్రం రెండు దేశాలకూ ఒకటే. మోడీ మొదటి పర్యటనలో చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇండియా, భూటాన్‌లు స్వేచ్ఛాయుతమైన సరిహద్దు కలిగి ఉన్నందువల్ల సన్నిహితం కాలేదు. మనం హృదయాలను ఇచ్చిపుచ్చుకున్నాం… అన్నారు. ఇప్పుడీ పర్యటన ఆ మాటను నిజం చేసింది’ అని చెప్పారు.

విమానాశ్రయంలో ఘనస్వాగతం
అంతకు ముందు…రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి భూటాన్ పారో ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. భూటాన్ ప్రధాని స్వయంగా స్వాగతం పలికారు. అందుకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం నుంచి రాజధాని నగరానికి వెళ్లే మార్గంలో దారిపొడవునా భారత, భూటాన్ పతాకాలు రెపరెపలాడాయి.ప్రజలు దారికిరువైపులా బారులుతీరి నిలబడి స్వాగతం పలికారు. ఆదివారం భారత ప్రధాని ప్రతిష్టాత్మకమైన భూటాన్ రాయల్ యూనివర్శిటీలో విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

PM Modi arrives two days visit in Bhutan