Thursday, April 25, 2024

3 రాష్ట్రాలకు కేంద్ర నిపుణుల బృందాలు

- Advertisement -
- Advertisement -

PM Modi Chairs High-level Meet to Review Covid-19 Situation

 

మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్‌లకు నిపుణుల బృందాలు
ప్రజా చైతన్యానికి ప్రచార కార్యక్రమాలు
ఉన్నతస్థాయి సమీక్షలో ప్రధాని ఆదేశం

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం తీరుపై సమీక్షించేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు ప్రధాని పలు సూచనలు చేశారు. కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌తోపాటు కొవిడ్19 ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని గుర్తించడం, వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ను నిబద్ధతతో, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించినట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. సమీక్ష సందర్భంగా మహరాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు హెల్త్, క్లినికల్ స్పెషలిస్టులతో కూడిన నిపుణుల బృందాలను పంపాలని ప్రధాని ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రజల్లో చైతన్యం కలిగించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

కరోనా కట్టడికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, క్షేత్రస్థాయిలో కంటైన్‌మెంట్లను నిర్వహించడంలో లోపాలే కేసులు పెరగడానికి కారణాలుగా గుర్తించారు. అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం 91.4 శాతం కేసులు, 90.9 శాతం మరణాలు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే. దాంతో, కేసుల తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్,చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కరోనా కట్టడిపై దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. గత రెండు వారాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 57శాతం కేసులు, 47శాతం మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక్క రోజే 49,447 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గతంలో(మొదటి వేవ్‌లో) నమోదైన అత్యధిక కేసులకు రెట్టింపు అన్నది గమనార్హం. రెండు వారాల్లో పంజాబ్‌లో 4.5 శాతం కేసులు, 16.3శాతం మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో చత్తీస్‌గఢ్‌లో 4.3శాతం కేసులు,7 శాతంపైగా మరణాలు నమోదయ్యాయి.

కరోనా కట్టడికి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ‘జన్ భాగీదరీ’, ‘జన్ ఆందోళన్’ పేరుతో ప్రచార కార్యక్రమాల్ని చేపట్టాలని ప్రధాని సూచించారు. ఏప్రిల్ 6నుంచి 14 వరకు ఈ కార్యక్రమాల్ని చేపట్టాలని నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత, పని ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో శానిటేషన్, ఆరోగ్య వసతులు కల్పించడం 100 శాతం అమలు చేయాలని సూచించారు. దేశీయ అవసరాలతోపాటు వసుధైక కుటుంబ భావనకు అనుగుణంగా విదేశాలకు సరఫరా చేయడానికి టీకాల ఉత్పత్తిని పెంచాలని ప్రధాని సూచించారు. అందుకోసం దేశీయ, విదేశీయ కంపెనీలతో చర్చించాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రధాని ముఖ్య కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, వ్యాక్సిన్ సాధికారిక బృందం చైర్‌పర్సన్, ఆరోగ్యశాఖ కార్యదర్శితోపాలు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News