Friday, April 26, 2024

సంపాదకీయం: మోడీ చరిత్రాత్మక అడుగు

- Advertisement -
- Advertisement -

Article about Female infant mortality in India

లడఖ్‌లోని లేహ్ వద్ద చైనాతో గల ఉద్రిక్త సరిహద్దులను ఆకస్మికంగా సందర్శించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నూతన చరిత్రను సృష్టించారు. సంక్షుభిత సరిహద్దులను సాహసోపేతంగా కాపాడుతున్న మన సైనికులకు ప్రధాని సందర్శన కొండంత బలాన్నిస్తుంది. దేశ రక్షణ వైపు వారిని మరింతగా కర్తవ్యోన్ముఖులను చేస్తుంది. వాస్తవానికి ఇది ఎవరూ ఊహించని పర్యటన. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాతో గల సరిహద్దుల సందర్శనకు వెళతారని ముందు అనుకున్నారు. సరిహద్దు ఘర్షణ అనంతరం సంభాషణలు సాగుతున్న అత్యంత సున్నితమైన వేళ అలా వెళ్లడం మంచిది కాదని భావించి ఆయన దానిని విరమించుకున్నారని వార్త లు వచ్చాయి. ఇంతలో అకస్మాత్తుగా సైనిక ముఖ్యులను వెంట పెట్టుకొని ప్రధాని మోడీ స్వయంగా లడఖ్ వద్ద సరిహద్దులను సందర్శించి అక్కడి మన ధీర యోధులను ఉద్దేశించి ప్రసంగించడం విస్మయానందాలను కలిగించింది. గత నెలలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలలో గాయపడి చికిత్స పొందుతున్న సైనికులను కూడా పరామర్శించి వారి ధైర్య సాహసాలను ప్రధాని కొనియాడారు. మృతి చెందిన సైనికులకు నివాళులర్పించారు. ఆయన తన ప్రసంగంలో చైనా విస్తరణ వాదాన్ని పరోక్షంగా (చైనా పేరు చెప్పకుండా) ప్రస్తావించి తీవ్రంగా ఖండించారు.

‘విస్తరణవాద శకం అంతరించింది ప్రపంచం అభివృద్ధి బాటలో (వికాసవాద పథం) ముందుకు దూసుకుపోతున్నది. మీరు చూపిన ధైర్య సాహసాలు భారత దేశ బలాన్ని, శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాయని సైనికులతో ప్రధాని అన్నారు. ‘బలహీనులు శాంతిని సాధించలేరు, బల ధైర్యాలతోనే అది సాధ్యం’ అని ప్రధాని పలికిన పలుకులలో మన భూభాగంపై కన్ను వేసే వారికి తగిన బుద్ధి చెప్పడం ద్వారానే మనలను మనం కాపాడుకోగలమన్నది సుస్పష్టం. ఇది చైనాతో ముందు ముందు ఎటువంటి పరిస్థితి తలెత్తినా ధైర్యంగా ఎదుర్కొని దానికి తగిన గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉండాలని మన యోధులకు చెప్పడమే. వేణుగాన లోలుడైన కృష్ణుడిని మనం ఆరాధిస్తాం, సుదర్శన చక్రధారి అయిన శ్రీకృష్ణుడిని కొలుస్తాం అని ప్రధాని అన్నారు. ఆ విధంగా ఇది యుద్ధ సమయం, శత్రువు శిరచ్ఛేదానికి సిద్ధంగా ఉండి తీరాలని పరోక్షంగా సైనికులకు ఎరుకపర్చారు. గత నెల 15వ తేదీన లడఖ్‌లోని గాల్వన్ నదీ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మనం ఒక్క అంగుళం నేలను కూడా కోల్పోలేదని జూన్ 19న అఖిల పక్ష నేతలతో పరోక్ష భేటీ సందర్భంగా ప్రధాని అన్నారు. పలు వైపుల నుంచి వెలువడిన సమాచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. చైనా సైన్యం వాస్తవాధీన రేఖ దాటి మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిందనే అభిప్రాయానికి అది తావిచ్చింది.

ప్రధాని ప్రకటన వివాదాస్పమైందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దానిని తీవ్రంగా ప్రశ్నించింది. చైనా ఆక్రమించుకున్నది దానికి చెందిన భూభాగమేనన్నది ప్రధాని ఉద్దేశమా అనే విమర్శ దూసుకు వచ్చింది. యుద్ధంలో సత్యమే మొట్టమొదట మరణిస్తుంది. చైనా అకారణంగా మన సైన్యం మీదకు వచ్చిందని మనం అంటున్నాం, మన సైన్యమే వాస్తవాధీన రేఖను ఉల్లంఘించే యత్నం చేసిందని చైనా ప్రభుత్వం తన ప్రజలకు చెప్పుకుంటున్నది. వాస్తవాలేమైనప్పటికీ ఈ రక్తసిక్త ఘర్షణ జరిగిన వెంటనే భారత, చైనాల మధ్య శాంతి సంభాషణలు మొదలు కావడం, అవి కొనసాగుతూ ఉండడం హర్షించవలసిన పరిణామం. ఈ సందర్భంలో ప్రధాని మోడీ సరిహద్దులకు వెళ్లడం పట్ల చైనా అభ్యంతరం చెప్పిందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధాని అక్కడకు వెళ్లి సైన్యానికి నైతిక బలాన్ని కలిగిస్తూ వారిని ప్రశంసిస్తూ దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పడం ద్వారా చర్చలలో చైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించేలా చేయడానికేనని అర్థం చేసుకోవాలి. తాడును తెగేదాకా లాగకుండా చేసి దానిని దారికి రప్పించుకోడానికేనని బోధపడుతున్నది.ప్రపంచం దృష్టిలో చైనా బాగా పలచబడిపోయి ఉంది. ఇంతటి బీభత్సాన్ని సృష్టిస్తున్న కరోనా చైనాలోనే బయల్దేరడం అందుకొక కారణం. ఈ వైరస్ సహజంగానే పుట్టిందా, చైనా ప్రయోగశాలల్లో రూపొందిందా అనే అనుమానం అమెరికా, పాశ్చాత్య ప్రపంచంలో అంకురించింది. దానిపై దర్యాప్తు కోరుతున్న దేశాలలో భారత్ కూడా ఉంది. మరో వైపు చైనాతో వాణిజ్య యుద్ధం జరుపుతున్న అమెరికా అవకాశం దొరికితే దానిని మరింత గట్టిగా దెబ్బ తీయాలని చూస్తున్నది.తద్వారా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని ట్రంప్ అనిగాచుకొని ఉన్నాడు. మన భుజం మీద తుపాకీ పెట్టి చైనా మీద పేల్చాలని అతడు చూస్తుంటే దానికి మనం ఉపయోగపడకుండా ఉండడమే విజ్ఞత అవుతుంది. సుదీర్ఘ యుద్ధం ఎవరికీ మంచి చేయదు. కొన్ని ఆర్థిక చర్యలతో ప్రధాని మోడీ ప్రభుత్వం ఇప్పటికే చైనాకు చెమటలు పుట్టిస్తున్నది. మనను సమఉజ్జీగా భావించి చర్చలలో చైనా సహేతుకంగా వ్యవహరించేలా చేయడంలో ప్రధాని సరిహద్దు సందర్శన తోడ్పడాలి.

PM Modi Creates History to visit Ladakh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News