Home జాతీయ వార్తలు తెరపైకి మళ్లీ ఏక కాల ఎన్నికలు

తెరపైకి మళ్లీ ఏక కాల ఎన్నికలు

 

19న అన్ని పార్టీల నేతలతో ప్రత్యేక భేటీ, ఒకే దేశం-ఒకే ఎన్నికతో పాటు మరి నాలుగు కీలక అంశాలపై చర్చ :
అఖిల పక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి

పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందించడం, ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు, నవభారత నిర్మాణ సంకల్పం, గాంధీజీ 150వ జయంతి వేడుకలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై పార్టీల నేతలతో భేటీలో ప్రత్యేక దృష్టి

న్యూఢిల్లీ: ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ అంశం, మరో నాలుగు కీలక విషయాలపై చర్చించేందుకు రావాలని అన్ని పార్టీల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీ ల నేతలతో ఈ నెల 19వ తేదీన ప్రత్యేక భేటీ జరుగుతుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాల ఆరంభం నేపథ్యంలో ప్రధాని ఆధ్వర్యంలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగానే ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈసారి లోక్‌సభకు పలువురు కొత్త సభ్యులు వస్తున్నారు. దిగువ సభ తొలి భేటీ నూతనోత్సాహంతో, తాజాదనంతో వినూత్న ఆలోచనలతో ఆరంభం కావాలని ఆశిస్తున్నట్లు ప్రధాని ఆదివారం తెలిపారు. అన్ని పార్టీల నేతలను ప్రత్యేక అఖిలపక్ష భేటీకి ప్రధాని ఆహ్వానించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ తరువాత విలేకరులకు తెలిపారు. ప్రత్యేక అఖిలపక్ష భేటీ అజెండాలోని ఐదు కీలక అంశాలను ఆయన వివరించారు.
ఐదు కీలక అంశాలు ఇవే..
పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్య లు, ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు, 75 ఏళ్ల స్వాత ంత్య్రం సందర్భంగా నవభారత నిర్మాణ సంకల్పం, గాంధీజీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అంశాలతో ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇక రాజకీయ పార్టీలు విభేదాలను పక్కకు పెట్టి వ్యవహరించాలని, సభలు సజావుగా సాగేందుకు సహకరించడం ద్వారా కొత్త ఎంపిలకు సభ పట్ల సరైన భావనను కల్పించాల్సి ఉందని ప్రధాని సూచించినట్లు జోషి తెలిపారు. ప్రజలతో ఎన్నుకోబడి, ప్రజల కోసం చట్టసభలకు సభ్యులు వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలను తీరుస్తున్నామా? అనేది కీలక అంశం అని, దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రధాని కోరినట్లు జోషి వివరించారు. గత లోక్‌సభ చివరి రెండు సంవత్సరాలు ఏ విధంగా వృధా అయ్యాయనే దానిపై దృష్టి సారించుకుని, ఈ విధంగా జరగకుండా చూడాల్సి ఉందని ప్రధాని సూచించారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాల్సి ఉందని తెలిపారు. అన్ని పక్షాలలో సగౌరవ పరస్పర విశ్వాస కల్పన దిశలో ప్రధాని వచ్చే బుధవారం ప్రత్యేక భేటీని ఏర్పాటు చేసినట్లు, ఇందుకు అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానించినట్లు జోషి చెప్పారు. దీని మేరకు లోక్‌సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రాతినిధ్యం ఉన్న పార్టీల నేతలు అంతా ఈ సమావేశానికి హాజరు కావాలి. ఎన్నికల ప్రక్రియ సంక్లిష్ట, వ్యయ భారం తగ్గించేందుకు తీసుకోవల్సిన చర్యలు ప్రత్యేకించి అప్పుడప్పుడు ప్రధాని మోడీ చెపుతూ వస్తున్న జమిలి ఎన్నికల అంశం ఇప్పుడు ఒక దేశం ఒకే ఎన్నికల రూపంలో చర్చకు వస్తుంది. 2022లో భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవం, ఈ ఏడాది గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు కీలక అంశాలుగా ప్రస్తావనకు వస్తాయని పార్లమెంటరీ మంత్రి తెలిపారు.
20న ఎంపిలతో విందు భేటీ..
గురువారం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరితో విందు భేటీ ఉంటుందని మంత్రి జోషి తెలిపారు. ఇందులో సభ్యులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి ఎటువంటి దాపరికం లేకుండా ఇష్టాగోష్టి తరహాలో తెలియచేసుకోవచ్చు. పార్లమెంటేరియన్లందరిలో జ ట్టుతత్వం పెంపొందింపచేసేందుకు ఇటువంటి కీలక ఏర్పాట్లు చేసినట్లు, జాతికి సంబంధించిన కీలక అం శాలపై ముందుగానే ప్రతిపక్షాలకు తెలియచేయడం ద్వారా ఏకాభిప్రాయ సాధనకు, తద్వారా సభల సరైన నిర్వహణకు ప్రధాని మోడీ సంకల్పించినట్లు జోషి చెప్పారు. ఇప్పటి అఖిలపక్ష భేటీలో రైతాంగ దుస్థితి, నిరుద్యోగం, కరువు పరిస్థితులపై సభలో చర్చ జరగాల్సి ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని తెలిపారు. అజెండా ప్రకారం అన్ని కీలక అం శాలపై చర్చ జరుగుతుందని ప్రధాని వారికి హామీ ఇచ్చారని వివరించారు. ఆదివారం నాటి అఖిలపక్ష భేటీకి ప్రధాని మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, బిజెపి రాజ్యసభ పక్ష నేత థావర్ చంద్ గెహ్లౌట్ కేంద్రం తరఫున వచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్ , టిఆర్‌ఎస్ నుంచి కె కేశవరావు,, నామా నాగేశ్వర రావు, వైఎస్‌ఆర్‌సిపి తరఫున విజయసాయి రెడ్డి, టిడిపి నుంచి గల్లా జయదేవ్ మరికొందరు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు.

PM Modi holds first all party meeting after 2019 elections