Home జాతీయ వార్తలు విద్యుత్ ఉత్పాదకతలో స్వావలంబన సాధిద్దాం

విద్యుత్ ఉత్పాదకతలో స్వావలంబన సాధిద్దాం

PM Modi inaugurates 750 MW Rewa solar project

 

సౌర విద్యుత్‌లో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నాం
ఆసియాలోనే అతి పెద్ద సోలార్ ప్రాజెక్టుకు ప్రధాని ప్రారంభం
మధ్యప్రదేశ్‌లోని రేవలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు

రేవ(మధ్యప్రదేశ్): పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో భారతదేశం ప్రపంచ మార్కెట్‌లో ప్రధాన ఆకర్షణగా ఆవిర్భవించిందని, విద్యుత్‌లో స్వయం సమృద్ధిని సాధించడం కేంద్రం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో ఒక కీలక అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవలో శుక్రవారం 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని ప్రారంభిస్తూ పరిశుద్ధ, చవకైన విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని ప్రధాన కేంద్రంగా మధ్యప్రదేశ్ ఆవిర్భవించనున్నదని చెప్పారు. సౌర విద్యుత్ కచ్ఛితమైనది, స్వచ్ఛమైనది, సురక్షితమైనదని ప్రధాని అభివర్ణించారు. ప్రపంచంలోని ఐదు అగ్ర సౌర విద్యుత్ ఉత్పత్పిదారులలో ఇప్పుడు భారత్ ఒకటిగా నిలిచిందని మోడీ అన్నారు.

రేవలోని సౌర విద్యుత్ కేంద్రం కేవలం మధ్యప్రదేశ్‌కే కాక ఢిల్లీ మెట్రోకు కూడా విద్యుత్ సరఫరా చేస్తుందని ప్రధాని చెప్పారు. రేవ అల్ట్రా మెగా సోలార్(ఆర్‌యుఎంఎస్) ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు. రాష్ట్రం వెలుపల విద్యుత్‌ను పొందనున్న వినియోగదారులలో ఢిల్లీ మెట్రో ఒకటి. విద్యుత్‌లో స్వావలంబన సాధించడం ఆత్మనిర్భర్ భారత్‌లో అంతర్భాగమని ప్రధాని అన్నారు. ఈ ఆశయాన్ని సాధించడంలో సౌర ఇంధనం ఒక అంతర్భాగం పాత్రను పోషిస్తుందని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణా లేక ఆర్థిక అభివృద్ధిని సాధించడమా అన్న విషయంలో యావత్ ప్రపంచం సందిగ్ధంలో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పర్యావరణం, ఆర్థికం అన్నవి వేర్వేరు కావని, అవి రెండూ పరస్పర సహకారంతో సాగేవని ప్రపంచానికి భారత్ చూపించిందని ప్రధాని పేర్కొన్నారు.

స్వచ్ఛ భారత్, పేదలకు వంటగ్యాసు కనెక్షన్లు(ఉజ్వల పథకం కింద), సిఎన్‌జి, విద్యుత్ ఆధారిత రవాణా తదితర అంశాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా భారత్ దీన్ని నిరూపించిందని ఆయన చెప్పారు. 21వ శతాబ్దంలో సౌర విద్యుత్ ప్రధాన భూమిక పోషించనున్నట్లు ఆయన వెల్లడించారు. తన వాదనను విశదీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉండడం వల్ల దీంట్లో కచ్ఛితత్వం ఉంటుందని, పర్యావరణాన్ని కలుషితం చేయకపోవడం వల్ల ఇది ఎంతో పరిశుద్ధమైనదని, స్వీయ ఆధారితమైనది, మన అవసరాలను తీర్చేది కావడం వల్ల ఇది ఎంతో సురక్షితమైనదని ప్రధాని వివరించారు.

తన ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ ప్రచారాన్ని ప్రస్తావిస్తూ మన దేశం కూడా దిగుమతులపై ఆధారపడకుండా సోలార్ ప్యానెళ్లను, బ్యాటరీలను, ఇతర పరికరాలను ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఇటువంటి సోలార్ పవర్ ప్లాంట్లను షాజాపూర్, నీముచ్, ఛత్తర్‌పూర్‌లో కూడా ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయని, ఓంకారేశ్వర్(ఖండ్వా జిల్లాలోని పుణ్య క్షేత్రం)లో విద్యుత్ స్టోరేజ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నామని ప్రధాని వెల్లడించారు.