Home జాతీయ వార్తలు శాఖల సంచలిత పిఎం గతిశక్తి

శాఖల సంచలిత పిఎం గతిశక్తి

PM Modi inaugurates exhibition complex
రూ 100 లక్షల కోట్ల కార్యక్రమం
ప్రగతి మైదాన్‌లో ప్రధాని ప్రారంభం
పెట్టుబడుల ఆకర్షణకు మార్గం
శాఖల సమన్వయం అనుసంధానం

న్యూఢిల్లీ : దేశంలోని దాదాపు 16 అత్యంత కీలక మంత్రిత్వశాఖల సమన్వయంతో రూ 100 లక్షల కోట్ల బృహత్తర ప్రధాన మంత్రి (పిఎం) గతిశక్తి జాతీయ మార్గదర్శక పథక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. బహుళ స్థాయి అనుసంధానం ప్రధానోద్దేశంగా , భారీ స్థాయి విదేశీ పెట్టుబడుల సమీకరణం కీలకంగా ఈ శతలక్ష కోట్ల కార్యక్రమాన్ని నేషనల్ మాస్టర్ ప్లాన్‌గా తీసుకువస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇక్కడి ప్రగతి మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ దీనిని ఆవిష్కరించారు. ఆత్మనిర్బర్ భారత్‌కు ఇది ఆయువుపట్టు అన్నారు. ఇది అత్యంత భారీ స్థాయి నిర్మాణాత్మక కార్యక్రమం అని, పలు రీతులలో మౌలిక వ్యవస్థల అనుసంధానం జరిగి, దేశ మౌలిక వసతుల ముఖచిత్రమే ఈ మాస్టర్‌ప్లాన్‌తో సమూలంగా మారిపోతుందని అన్నారు.

ఈ పథకం లక్షం దేశంలో భారీ స్థాయిలో మల్టీ మోడల్ కనెక్టివిటీని కల్పించడం అని, ఇటువంటి ఆదర్శప్రాయపు బహుముఖ వ్యవస్థతో విరివిగా విదేశీ పెట్టుబడులకు తగు మార్గం ఏర్పడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుసంధాన ప్రక్రియలో అత్యంత కీలక రీతిలో వ్యయభారం తగ్గుతుంది. రవాణా సామర్థం ఇనుమడిస్తుంది. దీనితో ఇప్పటివరకూ ఉన్న పనుల జాప్యత నివారణకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఏళ్ల తరబడి పనులు జరుగుతున్నాయనే బోర్డులే కన్పించేవని, ఇకపై ఈ నిర్మాణాత్మక ప్లాన్‌తో పనులు శరవేగంగా సాగుతాయని తెలిపారు. పేరుకు తగ్గట్లుగానే గతి శక్తితో వివిధ రంగాలలో నిర్మాణపనులలో వేగం సంచలితం అవుతుందని, దీని ఫలితాలు రాబోయే ఏళ్లలో కన్పిస్తాయని స్పష్టం చేశారు.

ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటం అనేది అత్యంత బాధాకరం, దీని వల్ల దేశ ప్రగతి కుంటుపడుతూ వచ్చింది. ప్రాజెక్టుల వ్యయ అంచనాలు తలకిందులు అయ్యేవి. కేవలం ఆర్బాటంగా ప్రాజెక్టులను ఆరంభించడానికి ముందు వాటిని వేగవంతం చేసేందుకు సముచిత బహుళ స్థాయి సమన్వయభరిత అనుసంధాన ప్రక్రియ అవసరం. ఈ కోణంలో మౌలిక వసతుల నిర్మాణం వేగవంతం అవుతుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ భారీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు. దేశ ప్రగతికి వ్యూహరచనలు ప్రణాళికలు అయితే, ప్రణాళికలకు చోదకశక్తిగా ఇటువంటి భారీ స్థాయి గతిశక్తి కార్యక్రమం మారుతుందని చెప్పారు. ప్రాజెక్టులకు మరింత వెన్నుదన్నులు, మరింతగా వేగం కల్పించేందుకు గతిశక్తి ప్రధానం అవుతుందన్నారు. ఒక ప్రాజెక్టుకు పలు విభాగాల నిర్మాణ దక్షత అవసరం . వివిధ విభాగాలను ఒకే వేదిక కిందికి తీసుకురావడం, పనుల పూర్తికి మౌలిక సమస్యలు లేకుండా చేయడం ప్రధాన అంశం అని ప్రధాని తెలిపారు.

పన్ను చెల్లింపుదార్ల డబ్బు గేలి

ఇంతకు ముందటి వరకూ పన్ను చెల్లింపుదార్లు అయిన ప్రజల కష్టార్జిత డబ్బు చివరికి నగుబాటుకు గురయింది. పూర్తి స్థాయి అలసత్వంతో పనులు కుంటుపడ్డాయి. ఏళ్ల తరబడి ఎక్కడేసిన గొంగడి అక్కడే పరిస్థితి ఉండేది. వివిధ విభాగాలు వేర్వేరుగా పనిచేస్తూ చివరికి అసలుపని కుంటుపడే పరిస్థితి ఉంటూ వచ్చింది. ఈ విధంగా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ క్లిష దశ తీరిపోతుందన్నారు. నాణ్యతతోనే సమగ్ర అభివృద్ధికి వీలేర్పడుతుంది. ప్రామాణికత ఉంటేనే ఫలితం బాగుంటుందన్నారు. ఈ దిశలో ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మక నిర్మాణాత్మక వ్యవస్థను సమకూర్చుకుంటుంది. ఇందులో ప్రధానమైన ముందడుగు ఈ గతిశక్తి అని ప్రధాని తెలిపారు. ఇంతకాలం ప్రాజెక్టులు, పనులకు అయ్యే లాజిస్టిక్ వ్యయం దేశ జిడిపిలో దాదాపు 13 శాతం అయ్యేది. దీనికి పనుల పెండింగ్ మరింత పిడుగుపాటు అయ్యేది. అంతేకాకుండా ఎగుమతులలో పోటీతత్వం చచ్చుపడి పొయ్యేదని, కాలానుగుణ మార్పులకు అనుగుణంగా సరుకులు మార్కెట్‌లోకి అడుగుపెట్టే పరిస్థితి ఉండకపొయ్యేదని, ఇది గతపు శాపం దానిని నివారించేందుకు ఈ విధమైన సరైన సమగ్ర వాతావరణ కల్పనకు గతిశక్తిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ప్రపంచ దేశాలకు ఇండియా భారీ పెట్టుబడుల గమ్యం అయ్యేందుకు ఈ పథకం పనికి వస్తుందని తెలిపారు. ఇప్పుడు తమ హయాంలో దేశంలో అత్యంత వేగంగా సాగుతున్న పనులు స్థాయిని బట్టి కూడా చూస్తే గత 70 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఇంతకు ముందెన్నడూ చవిచూడనివి అని ప్రధాని తెలిపారు. ఇందుకు పలు ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. తొలిసారిగా 1987లో అంతరాష్ట్ర సహజవాయువు పైప్‌లైన్ ఏర్పాటు అయింది. తరువాత అప్పటి నుంచి 2014 వరకూ 15000 కిలోమీటర్ల ఎన్‌జి పైప్‌లైన్ మార్గం నిర్మితం అయిందన్నారు. ఇప్పుడు అదనంగా 16000 కిలోమీటర్లపైగా పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోందన్నారు. అంటే 27 ఏళ్లలో జరిగిన పనిలో సగ భాగాన్ని తాము కేవలం అందులో సగం కాలంలోనే పూర్తి చేశామన్నారు. రైలు డబ్లింగ్ పనులు ఇనుమడించాయి. విద్యుద్దీకరణ జరిగింది. గతిశక్తి కీలక ఉద్ధేశం వివిధ విభాగాలకు ఉమ్మడి వేదికను సృష్టించడం, దీనితో మౌలిక వసతుల కల్పన పనులు నిర్మాణాత్మక రీతిలో సకాలంలో అంతకు ముందు పూర్తి అయ్యేందుకు రంగం సిద్ధం చేయడం అని ప్రధాని తెలిపారు. పని సంస్కృతిని నెలకొనేలా చేయడమే కాదు. ఖరారు చేసుకున్న పనులను మరింత వేగవంతం చేసుకోవడం అనేదే ప్రధాన అంశం అని, ఈ విషయం ప్రాతిపదికగానే తమ ప్రభుత్వం లక్ష్యాలతో సాగుతోందన్నారు.