Thursday, April 25, 2024

ఇకపై ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్లూ కొనొచ్చు

- Advertisement -
- Advertisement -
PM Modi launches two RBI schemes
రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్
రెండు ఆర్‌బిఐ పథకాలను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రెండు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పథకాలను ప్రారంభించారు. ఒకటి రిటైల్ డైరెక్ట్ స్కీమ్, రెండోది ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ స్కీమ్‌లను ప్రధాని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ హాజరయ్యారు. ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌లో రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆర్‌బిఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ప్రవేశపెట్టగా, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఈ రెండు పథకాలు దేశంలో పెట్టుబడుల పరిధిని విస్తరింపజేస్తాయని, పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్‌లోకి ప్రవేశించడం సులభతరం చేస్తుందని ప్రధాని అన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ సెక్యూరిటీలకు భద్రతా హామీలు ఉంది, దీంతో చిన్న పెట్టుబడిదారుల పెట్టుబడులపై భద్రతకు హామీ ఇస్తారు. అదే సమయంలో రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అభివృద్ధి పనులకు నిధుల సమీకరణలో దోహదం చేస్తుంది.

ప్రధాని మాట్లాడుతూ, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టేందుకు ఫండ్ మేనేజర్లు అవసరం లేదని, పెట్టుబడిదారులు నేరుగా గిల్ట్ ఖాతాను తెరవవచ్చని అన్నారు. ఈ ఖాతా పొదుపు ఖాతాకు కూడా లింక్ చేస్తారని, అందువల్ల ఇది ప్రజలకు ఎంత తేలికగా ఉంటుందని ఆయన అన్నారు. 2014కి ముందు బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిన్నదని, గత ఏడేళ్లలో ఎన్‌పిఎలను పారదర్శకతతో గుర్తించామని, ప్రభుత్వరంగ బ్యాంకులను పునరుద్ధరించామని ఆయన వివరించారు. బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు సహకార బ్యాంకులను కూడా ఆర్‌బిఐ పరిధిలోకి తీసుకొచ్చామని, ఇది ఈ బ్యాంకుల పాలనను కూడా మెరుగుపరుస్తుందని ప్రధాని వివరించారు. గత ఏడేళ్లలో డిజిటల్ లావాదేవీల విషయంలో భారత్ 19 రెట్లు పెరిగిందని అన్నారు.

రిటైల్ డైరెక్ట్ పథకం

ప్రస్తుతం రిటైల్ పెట్టుబడిదారుడు నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లలో పెట్టుబడి చేయలేరు. బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. ఈ పథకం ద్వారా ఇప్పుడు సాధారణ పెట్టుబడిదారులు కూడా ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. ఈ కొత్త రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టేందుకు ముందుగా గిల్ట్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతాను ఉచితంగానే ఓపెల్ చేయవచ్చు. ఆర్‌బిఐ ఖాతా నిర్వహణ చూసుకుంటుంది, అయితే దీనిని ఆన్‌లైన్‌లో మాత్రమే వినియోగించాలి. ఈ ఖాతా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. ఆర్‌బిఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఈ పథకాన్ని కీలక సంస్కరణగా ఆయన పేర్కొన్నారు.

ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం

ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంతో ఈ ఆర్‌బిఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (ఆర్‌బిఐఒఎస్) ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉండే సంస్థల కస్టమర్ల ఫిర్యాదులకు పరిష్కారం మరింత మెరుగవనుంది. పోర్టల్, ఈ-మెయిల్, చిరునామాతో కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేయాలి. బహుభాషా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది. దీని ద్వారా ఫిర్యాదుల పరిష్కారం, ఫిర్యాదుల నమోదుకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News