Saturday, April 20, 2024

11 తర్వాతే తుది నిర్ణయం

- Advertisement -
- Advertisement -

PM Modi

 

జీవితాలిక కరోనాకు ముందు… కరోనా తర్వాత

ప్రజల ప్రాణ రక్షణకు లాక్‌డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు కూడా నాతో అనలేదు. మరోసారి ముఖ్యమంత్రులతో మాట్లాడుతా. ప్రస్తుతానికయితే లాక్‌డౌన్‌ను ఒకేసారి పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులు లేవు. సామాజిక దూరాన్ని పాటించడానికి నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఎన్నో అనూహ్యమైన చర్యలు కూడా తీసుకోవలసి ఉంటుంది. కోవిడ్19 తర్వాత జీవితం మునుపటిలా ఉండకపోవచ్చు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాతగా మారుతుంది. వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది.
– వీడియో కాన్ఫరెన్స్‌లో
విపక్ష నేతలతో ప్రధానిమోడీ

లాక్‌డౌన్ కొనసాగించండి

ప్రధాని మోడీకి విపక్షాల ముక్తకంఠం

పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనులు ఆపాలని పలువురి సూచన

ఏ ఒక్కరూ లాక్‌డౌన్ ఎత్తేయాలని కోరలేదు, ప్రతి రోజూ నిపుణులతో మాట్లాడుతున్నా, ఎల్లుండి రాష్ట్రాల సిఎంలతో మరోసారి చర్చలు : మోడీ

క్లిష్ట సమయంలో దేశ రాజకీయ నాయకత్వం ఒక తాటిపై నిలిచింది

కరోనా కట్టడికి కేంద్రం చర్యలను అంతా సమర్థించారు : ప్రహ్లాద్ జోషి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను మరి కొన్ని రోజులు పొడిగించడానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుధవారం అఖిల పక్ష నేతలతో జరిపిన వీడియో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రులతో తరచూ మాట్లాడుతూనే ఉన్నానని, లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ఏ ఒక్క సిఎం కూడా తనతో అనలేదని ఆ సమావేశంలో ప్రధాని చెప్పడం లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందనడానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా లాక్‌డౌన్‌తో పాటుగా కరోనాకు సంబంధించిన పలు అంశాలను చర్చించడానికి ప్రధాని మోడీ ఈ నెల11న(శనివారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడుతారని అధికార వర్గాలు తెలిపాయి.

కరోనా విజ౧ంభణ కారణంగా మార్చి 25 న దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను మరి కొన్ని రోజులు పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా నిపుణులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్రప్రభుత్వాలు, నిపుణులు చేసిన అభ్యర్థనలన్నిటినీ కేంద్రం పరిశీలిస్తోందని, ముఖ్యమంత్రులతో మరోసారి ప్రధాని చర్చించిన తర్వాత లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా లాక్‌డౌన్ తర్వాత ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడడం ఇది రెండో సారి.

పూర్తిగా ఎత్తేయడం కుదరక పోవచ్చు
కాగా, ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌పై చర్చించడానికి ప్రధాని బుధవారం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ లాక్‌డౌన్‌పై పలు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘ ప్రజల ప్రాణ రక్షణకు లాక్‌డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు కూడా నాతో అనలేదు. మరోసారి ముఖ్యమంత్రులతో మాట్లాడుతా. ప్రస్తుతానికయితే లాక్‌డౌన్‌ను ఒకేసారి పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులు లేవు. సామాజిక దూరాన్ని పాటించడానికి నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఎన్నో అనూహ్యమైన చర్యలు కూడా తీసుకోవలసి ఉంటుంది’ అని ప్రధాని విపక్ష నేతలతో అన్నారు.

కోవిడ్19 తర్వాత జీవితం మునుపటిలా ఉండకపోవచ్చు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాతగా మారుతుందని వెల్లడించారు. ‘వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది’ అని నేతలతో ప్రధాని పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రధాని మరోసారి రాష్ట్రప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనాపై పోరులో కేంద్రం, రాష్ట్రాలు భుజం, భుజం కలిపి పని చేస్తున్నాయని ఆయన అన్నారు. అంతేకాదు, సమాజంలో కింది స్థాయి వ్యక్తి మొదలుకొని పైస్థాయి వ్యక్తి వరకు అందరూ తమ వంతు కృషి చేస్తున్నారని, 130 కోట్ల మంది ఉన్న దేశంలో ఇది చాలా గొప్ప విషయమని కూడా ప్రధాని అన్నారు. అలాగే సమావేశంలో అందరూ ఒకే విధమైన అభిప్రాయం వ్యక్తం చేయడంపై కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

కాగా వైరస్ కట్టడికి, లాక్‌డౌన్ వల్ల తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను హోం, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదరుశలు సమావేశంలో నేతలకు వివరించారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి(పిపిఇ) కొరత గురించి సమావేశంలో కొందరు నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆపి వేయాలని కూడా కొందరు నేతలు కోరినట్లు సమాచారం. సమావేశంలో రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేతగులాం నబీ ఆజాద్, ఎన్‌సిపి నేత శరద్ పవార్‌తో పాటుగా కె కేశవరావు, నామా నాగేశ్వర రావు, (టిఆర్‌ఎస్), విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడి ్డ(వైఎస్‌ఆర్ కాంగ్రెస్)తో పాటుగా సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పి, ఎల్‌జెపి, డిఎంకె, అకాలీదళ్, జెడియు, బిజూ జనతాదళ్, టిడిపి, తదితర ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు.

ఆ భేటీ తర్వాతే తుది నిర్ణయం ఉండొచ్చు: ఆజాద్
పార్లమెంటులో ప్రతిపక్షాల నేతలతో ప్రధాని జరిపిన సమావేశంలో ఈ క్లిష్ట సమయంలో దేశ రాజకీయ నాయకత్వం అంతా ఒక్కటిగా ఉందనే విషయం స్పష్టంగా కనిపించిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. లాక్‌డౌన్ సహా కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలకు సమావేశంలో దాదాపు అందరూ మద్దతు తెలియజేశారని సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించిన జోషీ చెప్పారు. కాగా పార్లమెంటులో అఖిలపక్ష నేతలతో ప్రధాని నిర్వహించిన వీడియో సమావేశంలో 80 శాతానికి పైగా నేతలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని సూచించారని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్టా లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తనకు సమాచారం వస్తోందని సమావేశంలో ప్రధాని చెప్పారని.. అయితే ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని అన్నారని ఆజాద్ చెప్పారు.

అది నిజం కాదు..
సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రధాని ఖండన
భారత్‌లో కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి గౌరవ సూచకంగా ఈ నెల 12న ప్రజలంతా అయిదు నిమిషాలు నిలబడి సంఘీబావం తెలియజేయాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రధాని ఖండించారు. తనను వివాదాల్లోకి లాగడానికి కొందరు అల్లరి మూకలు చేసిన పనిగా ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. అంతగా తనను గౌరవించాలనుకుంటే, ఈ కష్టకాలంలో ఓ పేద కుటుంబం ఆలనా పాలనా చూసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.అలా చేయడానికి మించిన గౌరవం లేదని ప్రధాని ఓ ట్వీట్‌లో అన్నారు. కరోనా పై పోరులో నిర్విరామంగా శ్రమిస్తున్న ప్రధాని మోడీ గౌరవార్థం ఈ నెల 12న (ఆదివారం) దేశప్రజలందరూ అయిదు నిమిషాలు నిలబడి సంఘీభావం తెలియజేయాలంటూ కొన్ని చోట్ల పోస్టర్లు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ పోస్టర్లు వూరల్‌గా మారడంతో ప్రధాని దీనిపై స్పష్టత ఇచ్చారు.

 

PM Modi meeting with CMs on April 11
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News