Home జాతీయ వార్తలు ప్రపంచంపై గాంధీ చెదరని సంతకం

ప్రపంచంపై గాంధీ చెదరని సంతకం

Modiసిద్ధాంతాలకు తరగని ఔచిత్యం
దేశాలకు అతీతంగా నేతలకు స్ఫూర్తి
ఐరాస కార్యక్రమంలో ప్రధాని మోడీ

న్యూయార్క్ : సమకాలీన ప్రపంచంలోనూ మహాత్మా గాంధీ ఆలోచనలకు ఔచిత్యత, ఆయనకు సముచిత స్థానం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ తన ఆలోచనలను సభికులతో పంచుకున్నారు. వర్తమాన ప్రపంచంలో గాంధీజీ సిద్ధాంతాల ఔచిత్యం’ ఇతివృత్తంతో జరిగిన ప్రసంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాంధీజీ వ్యక్తిత్వంలో ప్రత్యేకత ఉందని, ఆయనను ఎప్పుడూ కలుసుకోని, పరిచయం లేని వారిని కూడా ఆయన ప్రభావితం చేశారని మోడీ తెలిపారు.

గాంధీ జీవితం పలువురిని ప్రభావితం చేసింది. ఎందరినో మహనీయులుగా మలిచిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కానివ్వండి, నెల్సన్ మండేలా, ఈ విధంగా ఇటువంటి వారు ఎవరైనా కానివ్వండి గాంధీతో ప్రభావితం అయ్యారని విశ్లేషించారు. గాంధీజీ విశ్వాసాలు ఆయన దృక్పథమే వారి సిద్ధాంతాలు, విశ్వాసాలకు ప్రాతిపదికగా నిలిచిందని మోడీ వెల్లడించారు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ తన సిద్ధాంతాలతో ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి గాంధీ అని తెలిపారు.

ప్రజాస్వామ్యానికి ప్రజా బలం…

ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి పరిమిత అర్థం వర్తిస్తోంది. ప్రజలు తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, ఇక ఎన్నికైన ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం ప్రజాస్వామిక ప్రక్రియ అయిందన్నారు. అయితే గాంధీజీ ప్రజాస్వామ్యానికి నిజమైన బలాన్ని తన సందేశంతో పునర్వచించారు. ప్రజలు స్వయం సమృద్ధితో ఉండాలని, పాలకులపై ఆధారపడరాదని బోధించారని గుర్తు చేశారు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉండే సమాజ నిర్మాణానికి గాంధీ ప్రతిన వహించారని తెలిపారు.

ఆయన ప్రజలు తమంతతాముగా మార్పులు తీసుకువచ్చేలా చేశారని కొనియాడారు. ఈ విధంగా ప్రజలలోని అంతర్లీన శక్తిని ఆయన తట్టిలేపారని చెప్పారు. గాంధీకి దేశ స్వాతంత్య్రోద్యమ బాధ్యత చేపట్టకపోయి ఉంటే కూడా ఆయన ఊరుకునే వారు కాదని, స్వాతంత్య్ర మౌలిఖతను స్వయం సమృద్ధిని నిలబెట్టేందుకు ముందుకు సాగి ఉండే వారని తెలిపారు. గాంధీ భారతీయుడే కావచ్చు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆయన ప్రభావం ఉందని, ఇందుకు ఇక్కడ ప్రపంచ దేశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం తార్కాణం అని తెలిపారు.

ఐదేళ్లలో గాంధీ స్ఫూర్తితో పనిచేశాం…

తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా వంటి వాటికి గాంధీ ఆలోచనలే ప్రేరణ అని ప్రధాని మోడీ తెలిపారు. ప్రభుత్వం వీటిని ప్రారంభించిందని, అయితే ప్రజలే వీటిని నడిపిస్తున్నారని తెలిపారు. ఇతరులను ఏ విధంగా ఆకట్టుకోవాలనేదే మనం ఆలోచిస్తుంటామని, అయితే గాంధీ ఇతరులను ఏ విధంగా ప్రేరేపించాలనేది నేర్పారన్నారు. కృషి లేని సంపద, స్పృహలేని ఆనందం, గుణం లేని జ్ఞానం, విలువల్లేని వ్యాపారం, మానవత లేని శాస్త్ర విజ్ఞానం, త్యాగం లేని మతం వంటివి మనిషి దృష్టిని మరల్చివేస్తుంటాయని, వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారని గుర్తు చేశారు. ఇతరులను ఆకట్టుకునే తపనల ప్రపంచం మనది, స్ఫూర్తిని రేకెత్తించే దృక్పథం ఆయనది అన్నారు.

మానవత ఉన్నంత కాలం గాంధీజీ సిద్ధాంతాలకు ఔచిత్యత ఉండనే ఉంటుందన్నారు. గాంధీజీ 150వ జయంతి నేపథ్యంలో ఆయన విశిష్టతపై ఐరాస ఆధ్వర్యంలో ఏర్పాటయిన కార్యక్రమంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్, దక్షణ కొరియా అధ్యక్షులు మూన్ జె ఇన్, సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్, జమైకా ప్రధాని ఆండ్రూ మైకెల్ హోల్నెస్, న్యూజిలాండ్ ప్రధాని జకిండా అర్డెర్న్ వంటి పలువురు ప్రపంచదేశాధినేతలు పాల్గొన్నారు.

గాంధీ ప్రత్యేక స్టాంప్ ఆవిష్కరణ…

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఐరాస రూపొందించిన ప్రత్యేక స్టాంప్‌ను ప్రధాని మోడీ ఇతర దేశాధినేతల సమక్షంలో ఆవిష్కరించారు. అంతకు ముందు నేతలతో కలిసి ప్రధాని మోడీ గాంధీ సోలార్ పార్క్‌ను ఐరాస ప్రధాన కార్యాయలం వద్ద ప్రారంభించారు. గాంధీకి ప్రస్తుత ప్రపంచంలోనూ చెరిగిపోలేని గుర్తింపు ఉందనే విషయం ఐరాస వేదికతో రుజువయిందని , ఈ విషయాన్ని ప్రధాని మోడీ తమ ప్రసంగంలో తెలియచేశారని పిఎంఒ హిందీలో వరుసగా వెలువరించిన ట్వీట్లలో తెలిపారు.

PM Modi pays tribute to Mahatma Gandhi at UN