Friday, April 19, 2024

మోడీ – ట్రంప్ సంభాషణ

- Advertisement -
- Advertisement -

PM Modi President Trump conversation

 

భారత, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత, అమెరికాలో నల్లజాతీయుల నిరసనల ఉధృతి నేపథ్యంలో ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం నాడు అరగంట సేపు జరిగిన టెలిఫోన్ సంభాషణ పలు అంచనాలకు దారి తీసింది. అమెరికాలో ఆందోళనల గురించి ఈ సందర్భంలో ట్రంప్‌ను మోడీ అడిగి తెలుసుకోడం విశేషం కాదు. కాని చైనాతో మన సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం గురించి ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగిందన్న వార్త పరిశీలకుల దృష్టిని సహజంగానే ఆకర్షించింది. ఎందుకంటే చైనాతో తాజా ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత మధ్యవర్తిత్వం నెరపడానికి ట్రంప్ ఒకటికి రెండు సార్లు సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఆ అవసరం లేదని భారత, చైనాలు తెగేసి చెప్పేశాయి. సరిహద్దు పేచీని చైనాతో నేరు చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని భారత్ ప్రపంచానికి ఎరుక పర్చింది. ఇప్పుడు ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడితో ఈ అంశాన్ని గురించి మాట్లాడినట్టు ధ్రువపడడం ఆశ్చర్యపోవలసిన విషయమే.

సరిహద్దుల్లో చైనా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అక్కడ దానితో దీటుగానే సైన్యాన్ని సమీకరించడం, మరోవైపు అమెరికా మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించడం ద్వారా భారత్ ఈ విషయంలో ఆచితూచి వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత విజ్ఞతతో వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ ఉన్నట్టుండి చైనాతో సరిహద్దు పరిస్థితిపై ట్రంప్‌తో చర్చించడంలోని ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న తలెత్తింది. ఇది పరోక్షంగా చైనాను హెచ్చరించడానికేనా అనే సందేహానికి తావిచ్చింది. బుధవారం నాడు దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాతో భేటీలో వివరించారు. భారత్‌తో సరిహద్దు పరిస్థితి విషయమై ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మూడో పక్షం మధ్యవర్తిత్వం అక్కర లేదని మరోసారి వెల్లడించారు.

స్వదేశంలో అసాధారణమైన కరోనా సంక్షోభం, నల్ల జాతీయుల ఆందోళనల వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్న ట్రంప్ మోడీతో సంభాషణలో భారత్, చైనా సరిహద్దు వ్యవహారాన్ని గురించి ప్రస్తావించడమేగాక తమ దేశంలో జరిగే జి 7 దేశాల బృందం భేటీకి ఇండియాను ఆహ్వానించడం స్వీయ ప్రయోజనాల కోసం యుక్తియుక్తంగా చేసిన పనే అనిపిస్తున్నది. జూన్‌లో అమెరికాలోని కేంప్ డేవిడ్‌లో ఈ సదస్సు జరిగి ఉండవలసింది. కాని వాయిదా పడింది. జి 7 వేదిక ప్రపంచంలో జరుగుతున్న విషయాలకు సవ్యంగా స్పందించడం లేదని అందుచేతనే ఈ ఏడాది సదస్సును వాయిదా వేస్తున్నానని ఆ సందర్భంలో ట్రంప్ ప్రకటించాడు. గత ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ఈ వేదిక శిఖరాగ్ర భేటీకి ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకోడం ద్వారా జి 7 సభ్యత్వ పరిధిని విస్తరించాలన్నది ట్రంప్ ప్రతిపాదన.

వాస్తవానికి ట్రంప్ హయాంలో అమెరికా వహిస్తున్న బాధ్యతారహితమైన వైఖరి వల్లనే ప్రపంచ సమస్యలను సరైన దృక్పథంతో పట్టించుకోడంలో జి7 విఫలమవుతున్నది. అంతేకాక చైనా కు సభ్యత్వం ఇవ్వకుండా కొనసాగే వేదిక ప్రపంచ సమస్యలకు సమగ్రమైన పరిష్కారం దిశగా అడుగులు వేయజాలదని రష్యా తెగేసి చెప్పింది. ప్రాబల్య పోటీలో చైనాను దెబ్బతీయాలన్న కాంక్ష గాఢంగా ఉన్న ట్రంప్ అందుకు సిద్ధంగా లేడు. పై పెచ్చు చైనాను ఏదో విధంగా చీకాకుకు గురి చేయడం ద్వారా సంతృప్తి చెందే తత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. పదేపదే ప్రధాని మోడీని పొగడడం వెనుక ట్రంప్‌లో కరుడుగట్టుకున్న చైనా వ్యతిరేక ధోరణి ప్రభావం కూడా ఉండి ఉండవచ్చుననే అభిప్రాయాన్ని త్రోసిపుచ్చలేము. చైనాతో పాటు భారత వస్తువుల మీద కూడా సుంకాలను విధించిన ట్రంప్ నాయకత్వంలో జి7 ద్వారా ప్రపంచ సమస్యల పరిష్కారం సుసాధ్యమవుతుందని భావించలేము.

జి7లో ప్రస్తుతం కెనడా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాలున్నాయి. గతంలో సభ్యత్వం కలిగి ఉన్న రష్యాను ఆ తర్వాత క్రిమియాను ఆక్రమించుకున్నదనే కారణం చూపి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం జి 7 ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. అదనంగా నాలుగు దేశాలకు ప్రవేశం లభిస్తే అది జి 11 అవుతుంది. ఈ గ్రూపులో చేరడం వల్ల భారత దేశ అంతర్జాతీయ గుర్తింపు స్థాయి పెరుగుతుందనడానికి సందేహం అక్కర లేదు. అదే సమయంలో పొరుగునున్న చైనాకు మనను మరింత దూరం చేసే పన్నాగంతో ట్రంప్ పావులు కదుపుతుంటే దాని పట్ల జాగ్రత్తగా వ్యవహరించవలసిన బాధ్యత మనపై ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News