Saturday, April 20, 2024

రండి.. నేడు దీపాలు వెలిగించండి

- Advertisement -
- Advertisement -

PM modi

 

వాజపేయి కవితను
ట్వీట్ చేసిన ప్రధాని

న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు, లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మోడీ మరో ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో ‘రండి, దీపాలు వెలిగించండి’ అంటూ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చెప్పిన కవితను ప్రధాని ట్విట్టర్‌లో జతచేశారు. ‘ఆవో ఫిర్ సే దియా జలాయే’అన్న వాజపేయి రాసిన కవిత ఎంతో ప్రసిద్ధి పొందింది. తాజాగా మోడీ ఉంచిన వీడియోలో ఆయన ఒక వేదికపైనుంచి ఈ కవితను ఆలపిస్తున్నట్లుగా ఉంది.

లైట్లు బంద్ చేయండి..అంతే
పవర్‌గ్రిడ్‌లకు ముప్పులేదు
ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు కేవలం ఇళ్లల్లోని లైట్లు స్విచ్ఛాఫ్ చేయాలని కేంద్రం తెలిపింది. కరోనాపై పోరుకు సంఘీభావంగా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రజలంతా తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు బంద్ చేయాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ప్రధాని ఇచ్చిన పిలుపు ఇళ్లలోని విద్యుత్ దీపాలకే వర్తిస్తుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ శనివారం వివరణ వెలువరించింది. దీనికి సంబంధించి ఒక మార్గదర్శకాన్ని జారీ చేసింది. లైట్లు తీసివేయడం వల్ల పవర్ గ్రిడ్‌లలో అస్థిరతత నెలకొంటుందనే వాదనను విద్యుత్‌శాఖ తోసిపుచ్చింది. పవర్ గ్రిడ్‌లు దెబ్బతినే పరిస్థితి ఏదీ రాదని స్పష్టం చేశారు. ఉన్నట్లుండి విద్యుత్ వినియోగంలో తేడాలతో ఉత్పన్నం అయ్యే స్థితిని పూర్తి స్థాయిలో ఎదుర్కొంటామని తెలిపారు. భారతీయ ఎలక్ట్రిసిటి గ్రిడ్ సమర్థవంతమైనదని, అన్ని ఆటుపోట్లను తట్టుకుంటుందని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుందని వివరించారు.

విద్యుత్ దీపాల ఆర్పివేతపై ఎటువంటి ఆందోళనకు తావుండరాదని తెలిపారు. ఒకేసారి లైట్లు ఆర్పివేస్తే పవర్‌గ్రిడ్‌లు కుప్పకూలుతాయని, తరువాత విద్యుత్ కటకట పరిస్థితి ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని విద్యుత్ శాఖ హితవు పలికింది. విద్యుత్ దీపాల బంద్ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు కేంద్రం సూచనలు వెలువరించింది. శాంతిభద్రతలకు ఇబ్బంది కల్గించే ఎటువంటి ఇతరత్రా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించుకోవల్సి ఉంటుంది.

బల్బులే… ఫ్రిజ్‌లు, టీవీలు, ఫాన్లు, ఎసిలు కాదు
ఆదివారం రాత్రి మొత్తం విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రిత్వశాఖ తెలిపింది. బల్బులు ఆఫ్ చేయడం కూడా స్వచ్ఛందమే అని, ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, ఎసిలు నిలిపివేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా వీధి లైట్లను ఆఫ్ చేయకూడదని సూచించారు. లైట్లు మాత్రమే ఆర్పివేయాలని, ఈ తొమ్మిది నిమిషాలలో కొవ్వొత్తులు వెలిగించాలని, ఈ విధంగా కరోనాపై పోరుకు జాతి సంఘీభావం చాటుకుందామని తెలిపారు. ఇక నిత్యావసర సేవలు అందించే ఆసుపత్రులు, కార్యాలయాలు, పోలీసు స్టేష న్లు, ఫ్యాక్టరీలు, మున్సిపల్ సేవల కేంద్రాలు వంటివాటిలో విద్యుత్ దీపాలను తీసివేయాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని వీధులలని ఎలక్ట్రిక్ లైట్ల స్విచ్ఛాప్ జరగకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉందని స్పష్టం చేశారు. ఈ శుక్రవారం ప్రధాని మోడీ ఒక వీడియో సందేశం వెలువరించారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఆదివారం రాత్రి లైట్లు తీసివేసి, ప్రమిదలు లేదా కొవ్వొత్తులు వెలిగించాలని, లేదా టార్చ్‌లైట్లు, ఇవేవీ లేకుంటే సెల్‌ఫోన్ల ఫ్లాష్‌లైట్లను ప్రదర్శించాలని, ఈ విధంగా ప్రజల సంఘీభావాన్ని చాటుకోవాలని పిలుపు నిచ్చారు. 5వ తేదీ రాత్రి 9 గంటలు… తొమ్మిది నిమిషాలను గుర్తుంచుకుని కర్తవ్యం పాటించాలని కోరారు.

మరో జాగ్రత్త … శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించవద్దు

కరోనా తరుణంలో అంతా చేతులకు శానిటైజర్ రాసుకుంటున్నారు. శానిటైజర్‌లో ఆల్కహాల్ శాతం ఉండటం వల్ల, దీపాలు వెలిగించేటప్పుడు మండేస్వభావపు ఆల్కహాల్‌తో చేతులు, ముఖం కాలే ప్రమా దం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ద్రావకాన్ని రాసుకున్న చేతులతో ప్రమిదలను, కొవ్వొత్తులను వెలిగించరాదని నిపుణులు సూచిస్తున్నారు.

PM modi said to people Lights off for solidarity
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News