Saturday, April 20, 2024

స్వావలంబన మార్పు కోసం బడ్జెట్

- Advertisement -
- Advertisement -
PM Modi says Budget for making India self-reliant
ఆత్మ నిర్భర్ అర్థ వ్యవస్థ సదస్సులో మోడీ వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావం తరువాత ప్రపంచం శిఖరాగ్రస్థాయిలో మార్సులను సంతరించుకుంటోందని, ఈ దిశలో స్వావలంబన భారత్‌గా దేశం అత్యంత వేగంగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. బిజేపి నిర్వహించిన “ఆత్మనిర్భర్‌అర్థ వ్యవస్థ” సదస్సులో మోడీ మాట్లాడుతూ బడ్జెట్‌లో రూపొందించిన ముఖ్యమైన పథకాలను ప్రస్తావించారు. సరిహద్దు గ్రామాల్లో కనీస సదుపాయాలను మెరుగుపర్చడానికి 5 జి టెక్నాలజీని అమలు చేయడం, వ్యవసాయాభివృద్ధి పథకాలు, తదితర అంశాలను పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు పటిష్టంగా ఉన్నందున యావత్ దేశం సరైన పథంలో ముందుకు సాగుతోందని వివరించారు. 2013 14 లో ప్రభుత్వ పెట్టుబడి కేవలం రూ. 1.87 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది బడ్జెట్‌లో తాము రూ.7.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడిని పెంచామని, యూపిఎ ప్రభుత్వం నాటి కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువని మోడీ వివరించారు.

వర్చువల్ విధానంలో ప్రధాని చేసిన ఈ ప్రసంగాన్ని దేశం లోని ముఖ్యమంత్రులు, బిజెపి పార్టీ కార్యకర్తలు తిలకించారు. కేంద్ర ప్రభుత్వ సమర్ధవంతమైన విధానాల ఫలితంగా ఏడేళ్ల నాడు జిడిపి రూ.1.10 లక్షల కోట్లు నుంచి ఇప్పుడు రూ. 2.30 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. అలాగే 2013 14 లో ఎగుమతులు రూ.2.50 లక్షల కోట్ల వరకు ఉండగా, ఇప్పుడు రెట్టింపై రూ.4.70 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. అదే విధంగా విదేశీ మారక ద్రవ్యం ( ఫారెక్స్) 275 బిలియన్ డాలర్ల నుంచి 630 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. పేదలు, మధ్యతరగతి, యువకులకు కనీస మౌలిక సదుపాయాలు పెంపొందించడమే తమ ప్రభుత్వ లక్షంగా బడ్జెట్‌పై దృష్టి కేంద్రీకరించినట్టు తెలిపారు. పేద ప్రజలకు 80 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.48,000 కోట్లు కేటాయించామని , దీనివల్ల పేదలు లక్షాధికారులు అవుతారని చెప్పారు. గత ఏడేళ్లలో మూడు కోట్ల మందికి పక్కా ఇళ్లు అందించామని, వారిని లక్షాధికారులుగా తయారు చేయగలిగామని పేర్కొన్నారు.

ఎవరైతే మురికివాడల్లో ఉంటున్నారో వారు స్వంతంగా ఇళ్లు పొందగలిగారని వివరించారు. పిల్లలు చదువుకోడానికి చోటుండేలా ఈ ఇళ్ల పరిమాణాన్ని, ధరను పెంచామని, వీటిలో చాలా ఇళ్లు మహిళల పేరును కేటాయించడమైందని, మహిళలను ఇంటి యజమానులుగా మార్చ గలిగామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బడ్జెట్ లోని ప్రధాన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బిజెపి కార్యకర్తలు కీలక పాత్ర వహించాలని సూచించారు. రూ. 44,000 కోట్లతో కెన్‌బెట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టు వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా విస్తరించే బుందేల్‌ఖండ్ రీజియన్ ఎంతో మార్పు చెందుతుందని, బుందేల్ ఖండ్‌లో పొలాలు సస్యశ్యామలం అవుతాయని, పొలాలకు సాగునీరు లభించడమే కాక, ఇళ్లకు మంచినీరు సరఫరా అవుతుందని వివరించారు. “పర్వతమాల” ద్వారా ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లోని సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు విస్తరిస్తాయని చెప్పారు.

సరిహద్దు గ్రామాల్లోని యువకులు ఆర్మీ దళాల్లో చేరడానికి సహాయపడేలా వారికి నేషనల్ కేడెట్ కార్ప్ శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తుతూ , వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో రికార్డు స్థాయిలో ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ చేపట్టిందని ఉదహరించారు. రక్షణ రంగంలో తమ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా ’ విధానాన్ని ప్రోత్సహిస్తుందని, మూలధన వ్యయంలో 68 శాతం స్వదేశీ పరిశ్రమకు కేటాయించడమైందని చెప్పారు. గంగానదీతీర ప్రాంతంలో 2500 కిమీ పొడవునా సహజ వ్యవసాయ కారిడార్‌ను ఏర్పాటు చేయడమౌతుందని తెలిపారు. త్వరలో ప్రతిగ్రామం ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని పొందగలుగుతుందని, కొత్తతరం 5 జి టెక్నాలజీ అందుబాటు లోకి వస్తుందని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News