Home జాతీయ వార్తలు పుణె నర్సుతో సంభాషించిన ప్రధాని మోడీ

పుణె నర్సుతో సంభాషించిన ప్రధాని మోడీ

PM Modi

 

కరోనా రోగులకు అందుతున్న సేవలపై ఫోన్‌లో ఆరా
వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలకు ప్రశంసలు

ముంబయి : పుణెకు చెందిన ఓ నర్సుకు ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. సాక్షాత్తూ దేశ ప్రధాని మోడీ ఆమెతో ఫోన్‌లో సంభాషించారు. పుణె మున్సిపాలిటీకి చెందిన నాయుడు ఆసుపత్రిలో ఛాయ జగ్‌తప్ నర్సుగా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆమెకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. కోవిడ్-19 చికిత్సల విషయంపై ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడినట్టు పుణె మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఆరోగ్యాధికారి ఒకరు ధ్రువీకరించారు. జగ్‌తప్, మోడీ మధ్య జరిగిన ఆడియో సంభాషణ నర్సింగ్ సేవలందిస్తున్న వేలాది మందికి స్ఫూర్తిగానూ, మిగతా సిబ్బందికి ప్రేరణగానూ నిలిచిందని చెప్పారు. మరాఠీలో ఇరువురి నడుమ సంభాషణ జరిగింది. జగ్‌తప్ క్షేమసమాచారాలను మోడీ అడిగి తెలుసుకున్నారు.

రోగులకు అంకితభావంతో సేవలందించే విషయంలో తన గురించి, తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించలేదా అని అడిగిన్పపుడు ‘కుటుంబ ఆందోళనలు సహజమే. అయితే పని చేయడం మా ధర్మం. ఈ పరిస్థితుల్లో పేషెంట్లకు మేము సేవలందించాలి. తగిన జాగ్రత్తలు మాత్రం పాటిస్తున్నాం’ అని ఆమె సమాధానమిచ్చింది. పేషెంట్ల భయాలను ఎలా తొలగిస్తున్నారని మోడీ మరో ప్రశ్న అడిగినప్పుడు ‘వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. భయపడవద్దని చెబుతున్నాం. ఏమీ కాదని, వైద్యపరీక్షల్లో నెగిటివ్ వస్తుందని భరోసా కలిగిస్తున్నాం. పాజిటివ్ పేషెంట్లల్లో కూడా నైతిక స్థైర్యం పెంచేందుకు సిబ్బంది కృషి చేస్తోంది’ అని జగ్‌తప్ మోడీకి తెలిపారు.

ఏడుగురు కోవిడ్-19 పేషెంట్లను పూర్తిగా స్వస్థత చేకూరిన తర్వాత డిశ్చార్చ్ చేసినట్టు కూడా ఆమె వివరించారు. జగ్‌తప్ అంకితభావానికి, ఆమె అందిస్తున్న సేవలకి మోడీ ప్రశంసలు కురిపించారు. ‘తపస్విలా లక్షలాది మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లు దేశవ్యాప్తంగా రోగులకు సేవలందిస్తున్నారు. మీ అనుభవాలు తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మోడీ ప్రశంసించారు. జగ్‌తప్ సైతం ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ, నర్సుగా తన వృత్తి మాత్రమే తాను చేస్తున్నామని, మీరు దేశం కోసం ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తున్నారని, మీకు ప్రత్యేక కృతజ్ఞతని ఆమె పేర్కొన్నారు.

PM Modi speack with Pune nurse, thanks her for efforts