Home జాతీయ వార్తలు నా అంతానికి ప్రతి పక్షాల కుట్ర

నా అంతానికి ప్రతి పక్షాల కుట్ర

pm modi

పాట్నా: ‘ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు నేను ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు నన్ను లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి. సరిహద్దుల్లో సైన్యం శత్రువులతో పోరాడుతుంటే, మన దేశంలోనే కొందరు పాకిస్థాన్‌ను సంతోషపెట్టేందుకు ప్రకటనలు చేస్తున్నారు. ఇది నవభారతం. మన జవాన్లను చంపుతుంటే చూస్తూ ఊరుకోదు’ అని ప్రధాని మోడీ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఆదివారం ఇక్కడి గాంధీ మైదాన్‌లో జరిగిన బిజెపి సంకల్ప్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఇటీవల పాకిస్థాన్‌పై భారతదేశం జరిపిన గగనతల పోరాటాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రువులతో మన భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి ఒకవైపు భయంకర పోరాటం జరుపుతుంటే మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వారి సాహసాలను నమ్మడంలేదని, ఉగ్రవాద స్థావరాలపై మన వైమానిక దాడుల తర్వాత వారు సాక్ష్యాలు కావాలని అడుగుతున్నారని మోడీ ఘాటుగా విమర్శించారు. ‘దేశమంతా ఒక్కటిగా నిలిచి మాట్లాడాల్సిన సమయంలో…మన చర్యల్ని ఖండిస్తూ తీర్మానం చేయడానికి 21ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో గుమికూడాయి. సాయుధ దళాలు ప్రదర్శించిన సాహసానికి సాక్ష్యాలు కావాలని డిమాండ్ చేస్తున్నాయి’ అని మోడీ దుమ్మెత్తి పోశారు.
బీహార్‌లో జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడుతూ ప్రధాని… నితీష్‌కుమార్ సుశీల్ కుమార్ మోడీ కలిసికట్టుగా సాధిస్తున్న విజయాల్ని ప్రశంసించారు. సమాజంలోని అన్ని వర్గాలకూ అన్ని సదుపాయాలూ కల్పించడమే ఎన్‌డిఏ ప్రభుత్వం ఆశయమని చెప్పారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇండియాకు హజ్ కోటా పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.‘అంతర్జాతీయంగా పెరిగిన ఇండియా ప్రతిష్ట, కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’ అని మోడీ ప్రశ్నించారు.
బ్యాలెట్‌లో కూడా ఎన్‌డిఏదే విజయం: పాశ్వాన్
బుల్లెట్ పోరాటంలో ప్రభుత్వం గెలిచిందని, లోక్‌సభ ఎన్నికల్లో బ్యాలెట్ పోరాటంలోకూడా ఎన్‌డిఏ నెగ్గుతుందని కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ఆదివారం చెప్పారు. ‘భారతదేశం బుద్ధుడిలా శాంతిని కోరుకుంటుంది. కానీ అవసరమైతే యుద్ధం కూడా చేయగలదు’ అని కేంద్రమంత్రి అన్నారు. ఇక్కడి గాంధీ మైదాన్‌లో జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘బుద్ధుడితోపాటు యుద్ధాన్ని కూడా సై అనే విధానంతో ప్రధానమంత్రి ముందుకు వెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏకు 400 స్థానాలు వస్తాయి. ఒక్క బీహార్ నుంచే 40 సీట్లు వస్తాయి. నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని అవుతారు’ అని పాశ్వాన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన పరిస్థితిని మోడీ చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోడీ కూడా ప్రధాని పాక్‌పై దాడిచేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

pm modi speech at bjp sankalp rally