Home ఎడిటోరియల్ మోడీ కేదార్‌నాథ్ ముచ్చట

మోడీ కేదార్‌నాథ్ ముచ్చట

kedarnath

ప్రధాని నరేంద్ర మోడీకి 2015 వరదలు అనుకోని వరంలా దొరికాయి. దేశాన్ని మూటగట్టి ఆయన చేతుల్లో పెట్టడానికి మీడియా ఎలాగూ కాచుకుని కూచుంది అప్పుడు. ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఒక రాంబో, ఒక రక్షకుడు ఆయనే అని చాటి చెప్పేసింది, అంతా ఆయన రక్షణకోసం పోటీపడ్డారు. అలా కేదార్‌నాథ్ ఎత్తుల నుంచి జాతి పతనం ప్రారంభమైంది. మొన్న ప్రధాని కేదార్‌నాథ్‌లో చెప్పిన మాటలను మీడియా ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసింది. కేదార్‌నాథ్ మందిర పునర్నిర్మాణానికి తాను సహాయపడతానని చెప్పినా అప్పటి ప్రభుత్వం అడ్డుకుందని ఆయన మొన్న కేదార్‌నాథ్‌లో వాపోయాడు. జూన్ 2013లో వచ్చిన వరదలకు ఆలయం దెబ్బతిన్నది. దాని రిపేర్లకు ఈయన సహాయం చేస్తానంటే అప్పటి ప్రభుత్వం కాలడ్డం పెట్టిందంట. కాని ఇప్పుడు పునర్నిర్మాణం చేయించే ఉద్దేశ్యం సంకల్పాలు ఏమైనా ఉన్నాయా? ఏది ఏమైనా సుప్రీంకోర్టు కాస్త కల్పించుకుని ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో ఏదో ఒక మతానికి సంబంధించిన ఆలయాన్ని, మందిరాన్ని పవిత్ర ప్రదేశాన్ని నిర్మించే హక్కు ఆయనకు లేదని చెబితే బాగుండును. ఇటీవల సుప్రీంకోర్టు ఈ విషయమై చెప్పింది కూడా. గుజరాత్‌లో 2002 అల్లర్లు, విధ్వంసాల్లో నాశనమైన మసీదులను, దర్గాలను, రోజాలను, ఖాన్ ఖాలను ఇలాంటి మతసంబంధమైన ప్రదేశాలను ప్రభుత్వ ఖర్చుతో బాగు చేయించడం కుదరదని ప్రభుత్వానికి పరిపాలన అంటే ఏమిటో చెప్పింది. ఇప్పుడు కూడా కోర్టు కాస్త కల్పించుకుని ప్రభుత్వం ఏం చేయాలో చెబితే బాగుండును. కోర్టు సరయిన సమయంలో సరయిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. కాని అంతకన్నా ముందు మోడీ గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ”కేదార్‌నాథ్ పునర్నిర్మాణం జరిపించాలన్న నా ఆలోచన అప్పటి ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రికి చెప్పాను. ఆయన కూడా సూచనాప్రాయంగా ఒప్పుకున్నారు. నేను ఉత్సాహంగా మీడియాకి ఈ విషయం చెప్పాను. టివి చానళ్ళు వార్తను ప్రసారం చేయగానే న్యూఢిల్లీలో తుఫాను చెలరేగింది (అప్పుడు యుపిఎ ప్రభుత్వం ఉంది) వాళ్ళకు ఈ పరిణామం మింగుడు పడలేదు. గుజరాత్ ముఖ్యమంత్రి ఇప్పుడు కేదార్‌నాథ్‌లో కూడా బలపడతాడనుకున్నారు. అందువల్ల ఆయన సహాయాన్ని ఒప్పుకోవద్దని రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. నేను నిరాశగా గుజరాత్ వెళ్ళిపోయాను. కాని బాబా (శివుడు) ఈ పునర్నిర్మాణ బాధ్యత తన కుమారుడిపైనే పెట్టాలనుకున్నాడు.“ మరి మూడేళ్ళ నుంచి ఏం చేస్తున్నట్లూ ఈ ప్రియపుత్రుడు?
కథలు అల్లడంలో ఎంత గొప్ప ప్రావీణ్యం? ఇక్కడ అసలు చెబుతున్న కథేంటంటే, ఈయన గారు మహాదేవుడు శివుడికి చాలా సన్నిహితంగా ఉన్న పుత్రరత్నం. శివుడు భోళా శంకరుడు. దేవదానవులెవరికైనా సహాయపడే వాడు. కాబట్టి శంకరుడు ఎవరైనా తన బిడ్డగా చెప్పుకుంటే ఆయనకేం కోపం రాదు. ఒక చోట గంగానదీమ తల్లికి బిడ్డనని చెప్పుకుని మరో చోటికి వచ్చి భోళాశంకరుడి బిడ్డనని చెప్పుకున్నా ఆయనేం అనుకోడు. కాని ఇక్కడ మహాదేవుడితో మన సారుకు ఎంత సాన్నిహిత్యం ఉందన్నది కాదు ప్రశ్న. అసలు ప్రశ్న ఏమంటే కథలు ఎంత చక్కగా అల్లేస్తున్నారో గమనించడం. మీడియా కూడా ఆయన గారి మాటల్నీ, ఆయన బాధని, ఆయన ఆవేదనని మరి కాస్త కన్నీళ్ళు కార్చేసి ప్రజలకు చేరవేసింది. కాని ఇదే మీడియా 2013లో చేసిన రిపోర్టింగ్ ఏమిటో కూడా చూడ్డం అవసరం.
అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా గర్వంగా ప్రచురించిన వార్త, నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ వచ్చి 15000 మంది గుజరాతీలను కాపాడారు. వాళ్ళందరినీ విమానాల్లో గుజారాత్ పంపించారని అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేజి టైమ్స్ ఆఫ్ ఇండయా సైటులో కనబడదు, కాని ఈ పేపరులో అలాగే ఉంది. ఆనంద్ సూందాస్ అనే జర్నలిస్టు రిపోర్టు అది. అందులో ఏముందంటే: అన్నింటికి మించి, కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన దాదాపు 15000 మంది యాత్రికులను ఆయన గుజరాత్ తరలించగలిగారు. శుక్రవారం పొద్దుట విమానంలో వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి అర్థరాత్రి ఒంటి గంట వరకు మీటింగులు నిర్వహించారు. ఆయనతో పాటు క్రాక్ రెస్క్యూ టీము వచ్చింది. ఈ టీములో 5గురు ఐఎయస్ అధికారులు, ఒక ఐపియస్ అధికారి, ఒక ఐఎఫ్‌యస్ అధికారి, ఇద్దరు గుజరాత్ ఆడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు. ఇద్దరు డిఎస్‌పిలు, ఐదుగురు పోలీసు ఇనస్పెక్టర్లు కూడా ఉన్నారు. అక్కడ చిక్కుకుపోయిన గుజరాతీలను తరలించే పథకాలను అతి సూక్ష్మస్థాయిలో చర్చించారు. ఒక బిజేపి నాయకుడి ప్రకారం ఈ సమావేశాలు రాత్రి ఒంటి గంట వరకు కొనసాగాయి.
బిజెపి నాయకుడు అనిల్ బాలూనీ మాట్లాడుతూ మోడీ ఇక్కడ చేసింది అద్భుతం. ఎవరికైనా ఇది ఇష్టం లేకపోతే మేంమేం చేయగలం? అన్నాడు.“ఇది అప్పటి వార్త. ఈ వార్త వచ్చిన తర్వాత మోడీ గారి ఘనకార్యాన్ని ప్రశ్నించిన మొట్టమొదటి నాయకుడు బిహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. వెంటనే అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి గారు సమాధానమిస్తూ, బిహారు ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడ చిక్కుకున్న బిహారీలను రక్షించవచ్చు కదా అని ప్రశ్నించారు. దానికి నితీష్ కుమార్ జవాబిస్తూ తాను రాంబో కాదని అన్నారు. రాంబో అన్న పదాన్నే అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా మోడీని వర్ణించడానికి వాడింది. అంతేకాదు, ఉత్తరాఖండ్ వరదల్లో ఉన్నప్పుడు ఒక్కరోజులో 15000 మందిని రక్షించడం అన్నది అసాధ్యమని కూడా నితీష్ కుమార్ ప్రకటించారు.
మోడీ రాంబోలా జనాన్ని అంటే గుజరాతీలను రక్షించారని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆ వార్తను అప్పట్లోనే టెలిగ్రాఫ్‌కు చెందిన సుజన్ దత్తవంటి జర్నలిస్టులు హాస్యాస్పదంగా కొట్టిపారేశారు. సుజన్ దత్త ఈ విషయమై రాస్తూ రాంబో అభిమానులు ఆయన భారతసైన్యం సిగ్గుపడేలా చేశారన్నాడు. ఆయన ఏం రాశాడంటే మోడీ ఆర్మీ ప్రధానకార్యాలయంలో అధికారి అది చూసి నిర్ఘాంతపోయాడు“ ఇదీ. నోరిప్పితే భారతసైన్యం, భారతసైన్యం అంటూ పలవరించే వారి పరిస్థితి. హిందూ పత్రిక ఈ వార్త విషయంలో క్లారిటీ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో అనిల్ సూందాస్ ఇచ్చిన వార్తకు ఆధారం బిజెపి నాయకుడు అనిల్ బాలూని చెప్పిన మాటలు మాత్రమే. ఈ వార్త ఎంతవరకు నిజం అన్నది ఎవరూ నిర్ధారించుకోలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపుకే చెందిన ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఆ వార్తలో వాస్తవాల గురించి రాసింది. మోడీ గారి హిమాలయ మిరకిల్ పేరుతో అభీక్ బర్మన్ రాసిన వ్యాసమది. అందులో ఏం రాశాడంటే: ”ఆ వార్త ప్రకారం, మోడీ 80 ఇన్నోవా కారులతో ఈ ఘనకార్యం సాధించారు. కాని రోడ్లపై కొండచరియలు విరిగి పడి, రోడ్లు కొట్టుకుపోయిన వరదపరిస్థితుల్లో ఈ ఇన్నోవా కార్లు కేదారనాథ్ వరకు ఎలా చేరుకున్నాయన్నది మొదటి ప్రశ్న. ఎందుకంటే చాలా రోడ్లు ధ్వంసమైపోయాయి.సరే, మోడీ గారి ఇన్నోవా కార్లకు రెక్కలున్నాయని, లేదా హెలికాప్టరు లాంటి రోటర్లున్నాయని ఎలాగో చేరుకున్నాయని భావించినా, ఇన్నోవా కారులో డ్రయివరుతో సహా ఏడుగురు ప్రయాణించవచ్చు. అత్యవసర పరిస్థితి కాబట్టి 9 మంది ప్రయాణించారనుకున్నప్పటికీ 80 ఇన్నోవాల్లో కేదార్‌నాథ్ నుంచి క్రింద డెహ్రాడూన్ వరకు ఒక ట్రిప్పులో మొత్తం 720 మంది మాత్రమే రాగలరు. అంటే 15000 మందిని డెహ్రాడూన్ తీసుకురావాలంటే ఈ 80 ఇన్నోవా కార్లు 21 ట్రిప్పులు చేయాలి.
డెహ్రాడూన్, కేదార్‌నాథ్ ల మధ్య దూరం 221 కి.మీ. ప్రతి ఇన్నోవా 21 ట్రిప్పులంటే దాదాపు 9300 కి.మీ.లు ప్రయాణించాలి. కొండప్రాంతాల్లో ఎక్కువ స్పీడు వెళ్ళలేవు. కనీసం 40 కి.మీ.ల స్పీడులో ప్రయాణం చేశారనుకున్నా ఈ మొత్తం ఇవాక్యుయేషన్ పూర్తవ్వడానికి 233 గంటలు పడతాయి. అది కూడా కనీసం తినడానికి, నిద్రపోవడానికి, కాలకృత్యాలకు కూడా ఆగకుండా ఏకధాటిగా డ్రయివింగ్ చేస్తే. ఇదంతా దేనికంటే కేదర్‌నాథ్‌లో చిక్కుకున్న గుజరాతీలను గుర్తించి వారిని కాపాడ్డానికి. గుజరాతీలు కానివాళ్ళను వారి మానాన వారిని వదిలేయడానికి. అది కూడా మనుషులను ఎక్కించుకోవడం, దించడం యాంత్రికంగా జరిగి, మహాధైర్యసాహసాలతో రక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళు ఎక్కడా ఎలాంటి పొరబాటు లేకుండా చేస్తే 233 గంటల్లో పని పూర్తవుతుంది. అంటే దాదాపు పదిరోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి చేయాల్సిన పని. కాని మోడీజీ ఒక్క రోజులో పూర్తి చేసేశారు. నిజం చెప్పాలంటే ఒక్క రోజు కూడా ఆయనకు పట్టలేదు. మీడియా అస్సలు ఊపిరి తీసుకునే చాన్సివ్వకుండా రిపోర్టు చేసింది. శుక్రవారం ఆయన వెళ్ళాడు. శనివారం నాటికి 25 లగ్జరీ బస్సులు కొందరు గుజరాతీలను ఢిల్లీ చేర్చేశాయి. మరోవిషయమేమంటే, నాలుగు బోయింగ్ విమానాలు కూడా ఎక్కడో అంతుబట్టని ప్రదేశంలో అలా పడి ఉన్నాయంట.“ఇదీ సంగతి. మోడీ 24 హెలీకాప్టర్లు ఇస్తానంటే అప్పుడక్కడ ఉన్న కాంగ్రేసు ప్రభుత్వం తీసుకోలేదని ఆయన అభిమానులు ఇల్లెక్కి గోల చేశారు. తర్వాత హిందూస్తాన్ టైమ్స్ పత్రిక అసలు నిజం రాసింది. గుజరాత్ ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా స్వయంగా గుజరాత్ ప్రభుత్వం హెలికాప్టర్లు ఇస్తామని చెప్పలేదని అన్నాడు. కాని అప్పటికే కట్టుకథ దాని పని చేయడం ప్రారంభించేసింది. మన దేశంలో పుకార్లు, కట్టుకథలు చాలా గొప్పగా పనిచేస్తాయి. మనది హనుమంతుడి దేశం కదా. అప్పుడు హనుమంతుడు చేసిన పని నేటి ఆధునిక రామభక్తుడు ఎందుకు చేయలేడు?
ఎకనమిక్ టైమ్స్‌లో పై వ్యాసం రాసిన బర్మన్ మోడీ గురించి రాస్తూ కట్టుకధలు అల్లే అలవాటు ఆయనకుందని అన్నాడు. ఇంతకు ముందు కూడా మోడీ అలాంటి పనులు చేశారని గుర్తు చేశాడు. ఆయన ఏం రాశాడంటే:”జిఎస్‌పిసి (గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్) భారతదేశంలో అతిపెద్ద సహజవాయు నిక్షేపం కనుగొంది. 20 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్. దాదాపు 50 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ, దీనిని ఆంధ్రప్రదేశ్‌లో కనిపెట్టింది“మోడీ ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమయ్యిందో బర్మన్ ఇలా వివరించారు: ”మోడీ నాయకత్వంలో గుజరాత్ రాష్ట్ర సంస్థ జిఎస్‌పిసి దాదాపు రెండు బిలియన్ డాలర్లను ఈ సహజవాయు నిక్షేపాల కోసం వెచ్చించింది. ఇందులో చాలా మొత్తం రుణంగా తీసుకున్నదే. 20 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ సహజవాయువు దొరికితే ఇంకే అప్పులు ఉండవు కదా. కాని గ్యాస్ దొరకలేదు. జియస్పీసీ దివాలాకు చేరుకుంది.జియస్పీసి నిపుణుల సలహాలు తీసుకోడానికి ఆగలేదు. కేంద్ర సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ ఈ వ్యవహారాన్ని విశ్లేషించి అక్కడ రెండు మిలియన్ల క్యూబిక్ ఫీట్లకు మించి సహజవాయువు లేదని తేల్చి చెప్పింది. మోడీ చెప్పిందాంట్లో ఇది పదోవంతు. అది కూడా సహజవాయువును సేకరించడానికి బొత్తిగా అనువుకాని ప్రాంతాల్లో ఈ నిక్షేపాలున్నాయని చెప్పింది.
కాని, 2012 నాటికి జియస్పీసి పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఇక అప్పులు తీర్చుకోవాలంటే, ప్రభుత్వ సంస్థ బతకాలంటే సిటీలో గ్యాస్ పంపిణీ కూడా మొదలెట్టండని ఈయనగారు సలహా ఇచ్చారు. అత్యంత బాధ్యతారహితంగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన ఈ పని, దానివల్ల గుజరాత్ రాష్ట్ర సంస్థ పతనమైన తీరును నేటి వరకు ఎవరూ ప్రశ్నించలేదు. మోడీ అప్పట్లోనే తాను కాబోయే ప్రధానిగా ప్రచారం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత 2013 ఉత్తరాఖండ్ అనుకోని వరంగా వచ్చాయి. మీడియా అత్యుత్సాహంగా మొత్తం దేశాన్ని మూటగట్టి ఆయన చేతుల్లో పెట్టడానికి కాచుక్కూర్చుంది. ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఒక రాంబోకు దేశాన్ని కట్టబెట్టడానికి సిద్ధమైంది. కేదార్‌నాథ్ ఎత్తుల నుంచే పతనం ప్రారంభమైంది.