Home జాతీయ వార్తలు ఎంత మంది ఉన్నారన్నది కాదు

ఎంత మంది ఉన్నారన్నది కాదు

Pm-Modi

న్యూఢిల్లీ : సంఖ్యా బలం గురించి పట్టించుకోవద్దని ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ ధైర్యం చెప్పారు. నూతన లోక్‌సభ ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యుల ప్రతి పలుకు ప్రభుత్వానికి అమూల్యమైనదని, వారు ఎంత మంది ఉన్నారనేది కాకుండా వారు చెప్పేదేమిటనేదే తమకు కీలకం అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు చేరువ అయ్యేందుకు మోడీ ఈ విధంగా యత్నించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించాలని, సభ్యులంతా సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశ ప్రయోజనాల కోణంలో ప్రతిపక్షాలు పేర్కొనే ప్రతి అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. ప్రతిపక్షాల వారు ఈసారి సభలో వారి బలం తగ్గిందని దిగులు చెందవద్దని సూచించారు. సభ్యులు పార్లమెంట్‌కు వచ్చినప్పుడు అధికార పక్షానికి చెందిన వారమా; విపక్షానికి చెందిన వారమా? అనేది మర్చిపోవాలని అప్పుడే సభలో స్ఫూర్తిదాయక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వం అయితే నిష్పక్షపాతంగా ఉంటుందని, ఈ స్ఫూర్తితో సాగడం ద్వారానే దేశ ప్రయోజనాల సిద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకైన ప్రతిపక్షం చాలా కీలకం అని, ఇది సంఖ్యాబలంతో నిమిత్తం లేని అంశం అని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు కీలక విషయాలపై మరింత చురుగ్గా మాట్లాడి, సభా కార్యకలాపాలలో సరైన విధంగా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందని పిలుపు నిచ్చారు. ఈ వర్షాకాల పార్లమెంట్ సెషన్ అపూర్వ రీతిలో ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ప్రతిపక్షం చెప్పేది , వారు చెప్పకుండా ఉండేవాటిని కూడా ప్రభుత్వం పట్టించుకుంటుందని అన్నారు. ప్రతిపక్ష మాట ప్రభుత్వానికి కీలకం అవుతుందని, ఇదే సమయంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా స్పందించాల్సి ఉంటుందని అన్నారు. 17వ లోక్‌సభకు పలు ప్రత్యేకతలు ఉన్నాయని, ఈ సభలో ఇంతకు ముందెన్నడూ రీతిలో అత్యధిక సంఖ్యలో మహిళా ఎంపిలు ఉన్నారని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత మంది మహిళలు ఎంపిలుగా ఎన్నిక కావడం అరుదైన విషయం అని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కొత్త సభలో నూతనోత్తేజం, సరికొత్త స్ఫూర్తి నిర్మాణాత్మకం అవుతుందని అన్నారు. తమ ప్రభుత్వ తొలి హయాంలో అందరికి అండగా, అందరి వికాసంతో నినాదంతో ముందుకు సాగిందని , దీని వల్లనే పలు దశాబ్దాల తరువాత తొలిసారిగా ప్రభుత్వం అత్యంత స్పష్టమైన ఆధిక్యతను సంతరించుకుని తిరిగి అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
బెంగాలీ కేంద్ర మంత్రులకు జై శ్రీరాం నినాద స్వాగతం
బెంగాల్‌కు చెందిన కేంద్ర మంత్రులకు లోక్‌సభలో జై శ్రీరాం నినాదాలతో అభినందనల వర్షం వెలువడింది. కేంద్ర మంత్రులు అయిన బాబుల్ సుప్రి యో, దేబశ్రీ చౌదరిలు బెంగాల్‌కు చెందిన వారు. వారు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా బెంగాల్‌కు చెందిన బిజెపి ఎంపిలు జై నినాదాలకు దిగారు. దీనితో కొద్ది సేపు సభలో గందరగోళం నెలకొంది. సభలో బిజెపి సభ్యులు ఈ విధంగా వ్యవహరించడాన్ని పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తప్పు పట్టారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బెంగాల్ నుంచి 18 మంది బిజెపి ఎంపిలు గెలిచారు. గతంలో ఇద్దరు సభ్యుల బలం ఉన్న బిజెపి సంఖ్యాబలం పెరగడంతో బిజెపి శ్రేణుల ఉత్సా హం ఇనుమడించింది. ఈ అంశం లోక్‌సభలో సోమవారం స్పష్టం అయింది.

స్మృతీ ఇరానీకి చప్పట్లే చప్పట్లు
కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్‌ను స్వస్థలి అమేథీలోనే దెబ్బతీసిన స్మృతీ ఇరానీ లోక్‌సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభ్యురాలిగా ప్రమాణానికి ఆమెను పిలువగానే సభలో ఆగకుండా అదే పనిగా హర్షధ్వానాలతో, బల్లలు చరుస్తూ సభ్యుల స్పందన వెలువడింది. ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు ఇతర మంత్రులు , బిజెపి మిత్రపక్షాలకు చెందిన పలువురు సభ్యులు బల్లలు చరుస్తూ తమ ఆనందం వ్యక్తం చేయడం కన్పించింది అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఇరానీ హిందీలో ప్రమాణం చేశారు. తరువాత ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్, సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలను పలకరిస్తూ అభినందించారు. సోనియా గాంధీ ఇందుకు ప్రతిగా ఇరానీకి నమస్కారాలు తెలిపారు. ఈ సమయంలో రాహుల్ సభలో లేరు. ఆ తరువాతనే ఆయన సభలోకి వచ్చారు. వాయనాడ్ ఎంపిగా ప్రమాణం చేశారు.

pm modi speech in parliament today