Saturday, April 20, 2024

వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరసగా మూడో సారి వారణాసినుంచి బరిలో దిగనున్నారు. శనివారం ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్‌డే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.ప్రధాని మోడీ నేతృత్వంలో ఇప్పటికన్నా భారీ మెజారిటీలో మూడో సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి)16 రాష్ట్రాల్లోని అభ్యర్థులపై ఇటీవల సుదీర్ఘంగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ జాబితా విడుదలయింది.

ఈ జాబితాలోఅమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 34 మంది కేంద్రమంత్రుల పేర్లను ప్రకటించారు. ఇందులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చోటు కల్పించారు. తొలి జాబితాలో 28 మంది మహిళలున్నారు. యువతకు 47, ఎస్‌సిలకు 27, ఎస్‌టిలకు 16 స్థానాలు కేటాయించినట్లు తావ్‌డే తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఒబిసిలకు చోటు కల్పించారు. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా యుపిలో 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ 20,మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15,కేరళ 12, తెలంగాణ 9,జార్ఖండ్ 11,చత్తీస్‌గఢ్ 12, ఢిల్లీ5, జమ్మూ, కశ్మీర్ 2,ఉత్తరాఖండ్ 3,అరుణాచల్‌ప్రదేశ్ 2,గోవా, త్రిపుర,అండమాన్ నికోబార్, డయ్యూ డామన్‌నుంచి ఒక్కో అభ్యర్థిని ప్రకటించారు.

పోటీలో ఉన్న కేంద్రమంత్రులు
గుజరాత్‌లోని గాంధీనగర్‌నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యుపిలోని లక్నోనుంచి, స్మృతి ఇరానీ అమేథీ స్థానంనుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు.ఢిల్లీలో నాలుగు చోట్ల అభ్యర్థులు రమేశ్ బిధూరి, పర్వేశ్ వర్మ, మీనాక్షీ లేఖి, హర్షవర్ధన్‌లను తొలగించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు. అలాగే భోపాల్‌లో ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను కూడా తప్పించారు. న్యూఢిల్లీ స్థానంనుంచి మాజీ కేంద్రమంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సురి స్వరాజ్‌కు తొలిసారి అవకాశం కల్పించారు. కమల్‌జీత్ షెరావత్ పశ్చిమ ఢిల్లీనుంచి, చాందినీ చౌక్‌నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, ఎంఎల్‌ఎ రాంవీర్ సింగ్ బిధూరి దక్షిణ ఢిల్లీనుంచి పోటీ చేస్తారు. ఈశాన్య ఢిల్లీనుంచి మనోజ్ తివారీకి తిరిగి అవకాశం కల్పించారు. కాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశనుంచి బరిలోకి దిగనున్నారు.లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా రాజస్థాన్‌లోని కోటనుంచి తిరిగి పోటీ చేస్తారు. కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణనుంచి,అర్జున్ మేఘ్వాల్ బికనూర్‌నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్‌పూర్‌నుంచి పోటీ చేస్తారు. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గుజరాత్‌లోని పోరుబందర్‌నుంచి లోక్‌సభ బరిలో నిలవనున్నారు.

అలాగే మరో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్( ప్రస్తుతం రాజ్యసభ)తిరువనంతపురంనుంచి పోటీ చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ నుంచి శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక కిరెన్ రిజిజు అరుణాచల్‌ప్రదేశ్ వెస్ట్‌స్థానంనుంచి పోటీ చేస్తారు.అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్‌కు దిబ్రూగఢ్‌నుంచి అవకాశం కల్పించారు. ఇక సినీనటి హేమామాలిని యుపిలోని మథురనుంచి, మలయాళ సినీనటుడు సురేశ్ గోపి కేరళలోని త్రిసూర్‌నుంచి పోటీ చేస్తారు. ఆశ్చర్యకరంగా యుపిలోని తేనినుంచి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాకు మరోసారి అవకాశం కల్పించారు. ఆయన తనయుడు ఆశిష్ మిశ్రా 2021లో లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి వాహనంతో దూసుకెళ్లి పలువురు మృతికి కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటన చర్చనీయాంశంగా మారడమే కాదు, తీవ్ర నిరసనలకు దారి తీయడం విదితమే. ప్రస్తుతం అజయ్ మిశ్రా జైలులో ఉన్నారు. వచ్చేవారం బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కానుంది. ఆసమావేశంలో మరిన్ని పేర్లపై స్పష్టత రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News