Home జాతీయ వార్తలు ఉగ్రవాదం, వాతావరణం పెను సవాళ్లు

ఉగ్రవాదం, వాతావరణం పెను సవాళ్లు

 

మహాత్ముని బోధనలే వాటికి పరిష్కారం: మోడీ
దక్షిణ కొరియాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

సియోల్: ఉగ్రవాదం, వాతావరణంలో మార్పులు ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లని, మహాత్మాగాంధీ జీవితంలోకి తొంగి చూస్తే ఆయన చేసిన బోధనలు, చూపిన విలువలు వాటి పరిష్కారానికి తోడ్పడగలవని భారత ప్రధాని నరేంద్రమోడీ గురువారం పేర్కొన్నారు. దక్షిణ కొరియాతో వ్యూహాత్మక సంబంధాలను పటిష్టపరుచుకునే దిశలో రెండు రోజుల పర్యటనకు ఆయన నేడు ఇక్కడికి వచ్చారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్‌తో కలిసి నరేంద్రమోడీ ఇక్కడి యోన్‌సెయి విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘కొరియాలోని మొదటి యూనివర్శిటీలో మహాత్మాగాంధీ విగ్రహం పై భాగాన్ని ఆవిష్కరించడం గొప్ప గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. మహాత్ముని 150వ జయంతి వేడుకల్ని జరుపుకొంటున్న సమయంలో ఈ సందర్భానికి విశేషమైన ప్రత్యేకత ఉంది. మహాతుడు ప్రపంచానికే ప్రవక్త. ఆయన సలహాను పాటిస్తే మనం ముందుకు వెళ్లగలం ’ అన్నారు. హింసామార్గాన్ని ఎంచుకున్న వారిని మార్చేందుకు మహాత్ముడి అహింసామార్గం తోడ్పడుతుందని తోడ్పడుతుందని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. 20వ శతాబ్దంలో మహాత్ముడు మానవాళికి అతి పెద్ద కానుక అనవచ్చని మోడీ అభివర్ణించారు.
కొరియన్లకు గొప్ప కానుక : మూన్
మహాత్మాగాంధీ బోధనలతో తను స్ఫూర్తిని పొందానని, విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం కొరియన్లకు అమూల్యమైన కానుక అని, నేటి నుంచి మహాత్ముడు సామాన్యులకు ప్రజలకు ప్రేరణగా నిలుస్తారని ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ చెప్పారు. 1972లో ఇండియా నుంచి తను దౌత్యవేత్తగా జీవితాన్ని ప్రారంభించానని, మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడినయ్యానని మూన్ తెలిపారు. ‘అతి భయంకరమైన ఏడు పాపాలేమిటి గాంధీజీ చెప్పారు. అవి: 1.సిద్ధాంతంలేని రాజకీయాలు. 2. పనిచేయకుండా సంపద 3. మనసులేని సంతోషం. 4. శీలంలేని విజ్ఞానం. 5. నీతిలేని వ్యాపారం. 6. మానవత్వం లేని విజానం 7. త్యాగంలేని ఆరాధన. ఇవి ఇప్పటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మూన్ తెలిపారు.
15 ఏళ్లలో మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్: మోడీ
రాబోయే 15 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని, ఆ దిశగా ఇండియా అడుగులు వేస్తోందని భారత ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే భారతదేశం అయిదు వేల లక్షల డాలర్ల ఆర్థిక సంపదను కలిగి ఉంటుందని మోడీ తెలిపారు. సియోల్‌లో ప్రవాస భారతీయుల సమావేశంలో గురువారం ఆయన ప్రసంగించారు. భారత దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఇటీవలి సంవత్సరాల్లో తన ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల గురించి మోడీ వివరించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ అతి వేగంగా అభివృద్ధి చెందుతోందని , రాబోయే 15 ఏళ్లలో ప్రపంచంలో మూడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటిగా నిలుస్తుందని నరేంద్రమోడీ చెప్పారు.

PM Modi unveils Gandhi statue in South Korea