Home తాజా వార్తలు కరోనా నివారణకు పక్కా చర్యలు : కెసిఆర్

కరోనా నివారణకు పక్కా చర్యలు : కెసిఆర్

PM Modi Video Conference On Corona With CMsహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి పక్కా చర్యలు తీసుకుంటున్నట్టు సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్రమోడీకి తెలిపారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ పది రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా పరిస్థితిపై సిఎం కెసిఆర్ మోడీకి వివరించారు. కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, దేశంలో వైద్య సదుపాలు పెంచాల్సిన అవసరం ఉందని కెసిఆర్ స్పష్టం చేశారు. వైద్య రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. గతంలో కరోనా వంటి  విపత్తు రాలేదని, కరోనా ప్రభావం ఎంతకాలం ఉంటుందో తెలియదని కెసిఆర్ చెప్పారు. భవిష్యత్ లో కరోనా వంటి మహమ్మారీలను ఎదుర్కొనేందుకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకరావాలని ఆయన మోడీని కోరారు. ఆయా రాష్ట్రాల్లో విరివిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని,   ఐఎంఎ లాంటి సంస్థలను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని కెసిఆర్ పేర్కొన్నారు. విపత్తులు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే విధంగా వైద్య రంగం తయారు కావాలని కెసిఆర్ ఆకాంక్షించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.

వైద్యం విషయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలని ఆయన చెప్పారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 71 శాతంగా ఉందని, మరణాల రేటు 0.7శాతం ఉందని కెసిఆర్ ప్రధాని మోడీకి వివరించారు. కరోనా పరీక్షలను గణనీయంగా పెంచామని, కరోనా వచ్చిన ప్రతిఒక్కరికి చికిత్స అందిస్తున్నామని, అవసరమైన బెడ్లను, మందులు, వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.  ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామని, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారని సిఎం పేర్కొన్నారు.  ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, వైద్య శాఖ విభాగాధిపతులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, కరుణాకర్ రెడ్డి తదితరులతో పాటు  ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్  తదితర రాష్ట్రాల సిఎంలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  పాల్గొన్నారు.