Home తాజా వార్తలు ముందుచూపు వైద్యం

ముందుచూపు వైద్యం

వైద్యరంగంలో భవిష్యత్తులో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు విజనరీతో ఆలోచించాలి

 దేశంలో వైద్యసదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది

 ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలి

 రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం

 వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం
 ఐసిఎంఆర్, కేంద్ర బృందాల సలహాలను పాటిస్తున్నాం
ప్రధాని నరేంద్ర మోడీ వీడియోకాన్ఫరెన్స్‌లో సిఎం కెసిఆర్ కీలక సూచనలు
PM Modi Video Conference with CM KCRమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివరించారు. కరోనా పాజిటివ్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నా మన్నారు. దీనిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సిఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరి రేటు 71శాతంగా, మరణాల రేటు 0.7శాతంగా ఉందన్నారు. కరోనా బాధితులకు అవసరమైన వైద్యంతో పాటు పడకలు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచామన్నారు. ఐసిఎంఆర్, నీతిఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామని ప్రధానికి వివరించారు. ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నదని సిఎం వివరించారు. కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కేంద్రానికి ఆయన పలు సూచనలు చేశారు. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసిందన్నారు. కరోనా అనుభవాలు మనకు ఎంతో పాఠం నేర్పించాయన్నారు. గతంలో మనకు కరోనాలాంటి అనుభవం లేదని, అందుకే ఇప్పుడు సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసే ఈ ప్రణాళిక అమలు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. కరోనా వైరస్‌లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా తట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులను నియమించడంతో పాటు, వైద్య కళాశాలల ఏర్పాటుపై ఆలోచించాలి. వైద్య రంగం బలోపేతానికి కేంద్రం చొరవ తీసుకోవాలని సిఎం కెసిఆర్ కోరారు.

వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలన్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలని ప్రధానికి సూచించారు. గతంలో కూడా అనేక వైరస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయని.. భవిష్యత్తులో కరోనా వైరస్ లాంటివి మరిన్ని వచ్చే అవకాశముందన్నారు. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలన్నారు. ఐఎంఎ లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయమని.. ఇది దేశానికి మంచి చేసే చర్య అని సిఎం కెసిఆర్ అన్నారు. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలని…. దీనికోసం మీరు (ప్రధాన మంత్రి) స్వయంగా చొరవ తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్రం కలిసికట్టుగా పని చేసి, దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది” అని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, వైద్య శాఖ విభాగాధిపతులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడారు.

PM Modi Video Conference with CM KCR