Thursday, March 28, 2024

10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం

- Advertisement -
- Advertisement -

10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
80 శాతం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే
టెస్టింగ్‌లు పెంచి వైరస్‌ను అదుపు చేయండి
ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ పిలుపు

PM Modi Video Conference with CMs over Corona

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని 10 రాష్ట్రాలు కట్టడి చేయగలిగితే కొవిడ్-19పై పోరాటంలో దేశం విజయం సాధించినట్లేనని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా రోగులలో 80 శాతం మంది ఈ 10 రాష్ట్రాలకు చెందినవారేనని కూడా ప్రధాని తెలిపారు. కరోనా వైరస్ సంక్షోభం దేశంలో తలెత్తిన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు ద్వారా భేటీ కావడం ఇది ఏడవ సారి. నేటి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి తరఫున ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ కె సుధాకర్ పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కొత్త మంత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ చెప్పారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని కలుసుకున్న వారందరినీ 72 గంటల్లో గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలి. బీహార్, గుజరాత్, యుపి, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో పరీక్షలను మరింత ఎక్కువగా నిర్వహించాల్సిన అవసరాన్ని చర్చల ద్వారా గుర్తించాం అని మోడీ అన్నారు.

కరోనా వైరస్ సోకిన వ్యక్తిని కలుసుకున్న వారిని 72 గంటల్లో గుర్తించగలిగితే వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారని ఆయన తెలిపారు. కంటైన్‌మెంట్, కాంటాక్ట్ గుర్తింపు, నిఘా పెట్టడం వంటి మూడు సమర్థవంతమైన ఆయుధాలతో కొవిడ్-19ని నియంత్రించవచ్చని తమ అనుభవాలు ఇప్పటివరకు చెబుతున్నాయని కూడా ప్రధాని అన్నారు. ఢిల్లీ, యుపిలోని కొన్ని జిల్లాలలో కరోనా వైరస్ ఉధృతిని తగ్గించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. కాగా, కొవిడ్-19 గుర్తించేందుకు నిర్వహించే ఆర్‌టి-పిసిఆర్ పరీక్షల ఖర్చులో 50 శాతాన్ని కేంద్రం భరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి ఈ సందర్భంగా ప్రధానమంత్రిని కోరారు. అలాగే. అత్యాధునిక వెంటిలేటర్ల సమీకరణకు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందచేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ఉదారంగా ఆర్థిక ప్యాకేజీని రాష్ట్రాలకు ప్రకటించాలని ప్రధానమంత్రిని కోరారు.

PM Modi Video Conference with CMs over Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News