Home ఎడిటోరియల్ ‘క్వాడ్’తో జాగ్రత్త!

‘క్వాడ్’తో జాగ్రత్త!

PM Modi’s US visit: First meeting with Biden Quad talks

ఆరు మాసాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ యాత్ర చేపట్టారు. ఏడేళ్ల హయాంలో బహుశా ఆయన తిరగని దేశం లేదని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఆయన విదేశీ యాత్రల జోరుకి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు అమెరికా వెళ్లి వాషింగ్టన్‌లో చాలా కీలకమైన సన్నివేశాల్లో ఆయన పాల్గొననున్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి ఏర్పడిన చతుర్భుజ కూటమి క్వాడ్ ముఖాముఖీకి ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు. ఇంతకు ముందు కేవలం పరోక్ష భేటీకే హాజరైన మోడీ ఈసారి క్వాడ్ నాలుగు దేశాల చర్చల్లో స్వయంగా పాల్గొంటారు. అలాగే వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమవుతారు. గత జనవరిలో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన్ను ప్రధాని మోడీ ముఖస్థంగా కలుసుకోబోవడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, జపాన్ అధినేతలతోనూ విడివిడిగా సమావేశమవుతారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించనున్నారు. ఈ అన్నింటిలోనూ విశేష ప్రాధాన్యం గలది క్వాడ్ శిఖరాగ్ర సమావేశం.

దేశాల మధ్య భద్రతా పరమైన అంశాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలను సైతం కాపాడడానికి ఉద్దేశించిన క్వాడ్ ఆశయాల్లో ఇండో పసిఫిక్ (దక్షిణ చైనా) సముద్ర మార్గాన్ని ఎవ్వరి పెత్తనం లేకుండా స్వతంత్రంగా ఉంచడానికి కృషి చేయాలన్నది ప్రధానమైనది. ఈ సముద్ర ప్రాంతం మీద ఎదురులేని ప్రాబల్యం కోసం చైనా ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. దానిని సమష్టిగా అడ్డుకోడానికి ఉద్దేశించిందే ఈ నియమం. అయితే క్వాడ్‌లోని మిగతా దేశాల కంటే భారత దేశానికి ఇది ఎక్కువ ఇరకాటమైన అంశం. ఒక్క ఇండియాకు తప్ప మిగతా మూడు దేశాలకూ చైనాతో సరిహద్దులు లేవు. జపాన్ మాత్రం సెంకాకు దీవుల విషయంలో చైనాతో విభేదిస్తున్నది. ఈ దీవుల రక్షణ అంశం జపాన్ అమెరికా ఒప్పందంలో భాగంగా ఉంది గనుక ఆపత్కాలంలో జపాన్‌కు అమెరికా సాయం అందుబాటులో ఉంటుంది. చైనాతో భారత దేశానికి 3488 కి.మీ సుదీర్ఘమైన భూ సరిహద్దు ఉంది. దీని వాస్తవ స్థితి విషయంలో వివాదం ఇంకా కొనసాగుతున్నది. శాశ్వతమైన, స్థిరమైన సరిహద్దుగా బదులు దీనిని వాస్తవాధీన రేఖగానే వ్యవహరిస్తున్నారు. 1962 నాటి యుద్ధం తర్వాత ఇటీవలి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ సరిహద్దుల్లో మొదటిసారిగా గత ఏడాది చైనా అతిక్రమణకు పాల్పడింది.

50,000 మంది సైనికులతో వాస్తవాధీన రేఖను ఉల్లంఘించడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా లడఖ్ వద్ద రెండు దేశాల సైన్యాల మధ్య రక్తసిక్త ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మన యోధులు 20 మంది దుర్మరణం పాలయ్యారు. చైనా వైపు కూడా గణనీయంగా ప్రాణ నష్టం జరిగిందని భావిస్తున్నారు.ఈ ఘర్షణల్లో తన సైనికులు నలుగురు మాత్రమే మరణించినట్టు చైనా చెప్పుకున్నది. 40 మంది చైనా సైనికులు చనిపోయినట్టు రష్యా వార్తా సంస్థ ఒకటి చెప్పిన సమాచారం వాస్తవం కాదని చైనా ఖండించింది. చైనా అబద్ధాలు చెబుతుందని, 1962 యుద్ధ సమయంలో కూడా మృతుల సంఖ్యను చెప్పకుండా దాచిందని మన కేంద్ర మంత్రి విశ్రాంత సైనిక జనరల్ వికె సింగ్ అన్నారు. ఈ ఘర్షణల తర్వాత రెండు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. ఉభయ సైన్యాలు తమ పూర్వపు స్థితికి ఉపసంహరించుకొనే ప్రక్రియ సాగుతున్నది. చైనాతో చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరుతున్నది. ఇటువంటి దశలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో (దక్షిణ చైనా సముద్రం) చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోడానికి, దాని బెల్ట్ అండ్ రోడ్ విస్తరణ పథకాన్ని కానివ్వకుండా చేయడానికి వగైరా లక్షాలతో కూడిన ముఖ్యంగా అమెరికాను మించి పోయే రీతిలో బలపడడానికి, ప్రపంచాధిపత్యం చేజిక్కించుకోడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను దెబ్బ తీయడం కోసం పని చేయదలచుకున్న క్వాడ్‌లో చురుకుగా పాల్గొనడం భారత్‌కు హితవు కాదనే అభిప్రాయం కూడా వెల్లడవుతున్నది.

అమెరికాతో స్నేహం ఎప్పుడూ ఏకపక్షంగానే ఉంటుందని, దానిని అది తన ప్రయోజనాలకే వాడుకుంటుందనే అభిప్రాయం కొట్టి పారేయదగినది కాదు. అటు పాకిస్తాన్‌తో కూడా మంచి సంబంధాలు గల అమెరికాతో బేషరతుగా పెనవేసుకోడం మనకు ప్రయోజనకరం కాదు. కాని చైనాతో తలెత్తే అమిత్ర సందర్భాల్లో మనకు గట్టి తోడు ఉండాలనే తాపత్రయం ప్రధాని మోడీని క్వాడ్‌లో నిమగ్నం అయ్యేలా చేస్తుండవచ్చు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలు మన భద్రతకు అపూర్వమైన ముప్పును సూచిస్తున్నాయి. బహుశా దానిని దృష్టిలో పెట్టుకొని కూడా అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టి అణచివేయడానికి తప్పని సరి అవసరంగా మనం క్వాడ్‌ను ఆశ్రయిస్తూ ఉండవచ్చు.