Home జాతీయ వార్తలు తీరు మారకపోతే మార్పు అనివార్యం

తీరు మారకపోతే మార్పు అనివార్యం

PM Narendra Modi class for BJP MPs
బిజెపి ఎంపీలకు ప్రధాని మోడీ క్లాసు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఎంపీల గైర్హాజరుపై ప్రధాని నరేంద్ర మోడీ వారికి గట్టిగా క్లాసు తీసుకున్నారు. ఎంపీలు తమ తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో అందుకు తగ్గ మార్పులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఇక్కడి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. పార్లమెంట్ సముదాయం వెలుపల మొదటిసారి జరిగిన ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులకు వెల్లడిస్తూ ఎంపీలు సంబంధిత నియోజకవర్గాలలో క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రధాని ఆదేశించినట్లు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు క్రమం తప్పకుండా హాజరుకావాలని, పిల్లలకు కూడా చేసిన తప్పును పదేపదే ఎత్తిచూపితే వారు ఆ తప్పును మళ్లీ చేయరని ప్రధాని వ్యాఖ్యానించినట్లు ఆయన చెప్పారు.

ఎంపీలు తమ తీరు మార్చకోవాలని, లేకపోతే కాలమే మార్పు తీసుకువస్తుందని మోడీ హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. బిజెపి ఎంపీలు అధిక సంఖ్యలో పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు కావడంపై ప్రధాని మోడీ గతంలో పలుసార్లు ప్రస్తావించి వారిని మందలించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఎంపీలు తమ నియోజకవర్గాలకు చెందిన పార్టీ జిల్లా అధ్యక్షులు, మండలాల అధ్యక్షులను టీకి పిలిచి వారితో సమావేశం కావాలని సూచించారు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షులతో డిసెంబర్ 14న సమావేశం అవుతారని ఆయన చెప్పారు.