Home ఎడిటోరియల్ కేరళకు కేంద్రంతో చిక్కులు

కేరళకు కేంద్రంతో చిక్కులు

PM Narendra Modiసుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే కార్యం నేటి కేరళ వామపక్ష ప్రభుత్వంపై పడింది. తీర్పును ఆహ్వానించిన భాజపా, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో మత సంఘాల ఆందోళనను చూసి మాట మార్చాయి. కోర్టు తీర్పులు దేశ పౌరుల విశ్వాసాలకు లోబడి ఉండాలని ఈ మధ్య భాజపా అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ కూడా సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని కోరుతోంది. కేరళలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో బిజెపి, మతవాద సంస్థల అల్లర్లతో కాంగ్రెస్‌ను జతకడుతోంది. జనవరి 14న కొల్లాంలో 16 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు ప్రారంభానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కేరళ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేరళకు కొన్ని విశిష్టతలున్నాయి. దేశంలోనే తొలిసారిగా అక్కడ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. క మ్యూనిస్టుల కూటమి బలం గా ఉండి రాష్ట్ర పాలనలో భాగమవుతోంది. జనా భా నియంత్రణలోనూ ముందుంది. అక్షరాస్యతలో 94% తో అగ్రస్థానంలో ఉంది. 77 ఏళ్ల సగటు ఆయుర్దాయంతో ఆదర్శంగా నిలుస్తోంది. అల్లర్లు, ఆందోళనలు లేని పచ్చని ప్రశాంత రాజ్యంగా కొనసాగుతోంది.

అయితే స్వతహాగానే కమ్యూనిస్టులంటే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కంటిలో నలుసులే. దేశంలో కమ్యూనిస్టులుండడం ‘బిజెపికే కాదు, కాంగ్రెస్‌కూ ఆది నుండీ అయిష్టమే. తొలి ప్రధాని నెహ్రూ నుండి నేటి ప్రధాని మోడీ వరకు కమ్యూనిస్టులపట్ల కఠోరంగా వ్యవహరిస్తున్నవారే. భాష ఆధారంగా 1956 లో ఏర్పడిన రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. ఆ రాష్ట్రానికి తొలి అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 1957లో జరిగాయి. మొదటి అసెంబ్లీ 5 ఏప్రిల్ 1957లో కొలువు తీరింది. 114 అసెంబ్లీ స్థానాల్లో 60 గెలుచుకొని నలగురు స్వతంత్ర శాసన సభ్యుల మద్దతుతో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం దేశంలో అప్పుడు కాంగ్రెసేతర ప్రభుత్వం అదొక్కటే. ఇఎంఎస్ నంబూద్రిపాద్ తొలి కేరళ ముఖ్యమంత్రి. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా పాలించాలనే సంకల్పం ఆయన్ను కొన్ని నిర్ణయాలకు పురి కొల్పింది. ఆ నిర్ణయాలే ఆయన పాలనకు చరమ గీతం పాడే పరిస్థితి తెచ్చాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు దిగ్గజంగా ఆయన తలపెట్టిన విద్య, భూ సంస్కరణలు అగ్రవర్ణాల, ధనికుల ఆగ్రహానికి కారణమయ్యాయి. క్యాథలిక్ క్రైస్తవుల చేతుల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలపై ఆయన తీసుకొన్న నియంత్రిత నిర్ణయాల వల్ల ఆయా సంస్థల యాజమాన్యం నుండి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దున్నేవాడికే భూమి కట్టబెట్టాలనే దిశగా చేపట్టిన భూ సంస్కరణలు భూస్వామ్య వర్గాల కన్నెర్రకు కారణమైనాయి. క్రైస్తవ మత సంస్థలు, ముస్లిం లీగ్, నాయర్ సేవా సంస్థలు కలగలిసి పెద్ద ఆందోళనను చేపట్టాయి. దీని వెనుక కనబడని కాంగ్రెస్ హస్తముంది.

కమ్యూనిస్టుల పొడ గిట్టని నెహ్రూ గొడవని పెంచి పోషించి 31 జులై 1959 నాడు దేశ అధినేతగా కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. మళ్లీ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. తెలంగాణ విషయంలో కూడా నెహ్రూ చర్యలు అలాగే ఉన్నాయి. 1948 లో జరిగిన సైనిక చర్యలో నిజాం రాజ్యం విలీనం కన్నా కమ్యూనిస్టులపై ఉక్కు పాదం మోపడమే ప్రధాన లక్షంగా కనబడుతోంది. నిజాం, ఆయన వారసులు గౌరవ మర్యాదలందుకోగా, నల్లగొండ, వరంగల్ జిల్లాలలోని కమ్యూనిస్టులు ఊచకోత పాలయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ కేరళ వామపక్ష ప్రజాస్వామ్య కూటమి పాలనను తిప్పలు పెట్టె పనిలోనే ఉన్నారు. ఆగస్టు 2018లో కేరళలో వచ్చిన వరదల సమయంలో కేంద్రం పోషించిన పాత్రలో మానవత్వం కొరవడింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరిన ప్యాకేజీలో నాలుగో వంతు కూడా సమకూర్చలేదు. రూ. 2600 కోట్లు ప్యాకేజీ కేరళ ఆశించగా కేవలం రూ. 600 కోట్ల సహాయం అందింది. అందులోంచి రూ. 34 కోట్లు వైమానిక దళానికి చెల్లించవలసి వచ్చింది. ఇరువై మంది చనిపోగా పది లక్షల మంది నిర్వాసితులు అయిన ఈ వరద తీవ్రతకు రూ. 31000 కోట్ల నష్టం సంభవించిందని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకులు లెక్కకట్టాయి. 14 జిల్లాల రాష్ట్రంలో 11 జిల్లాలు వరద బారిన పడ్డాయి.

కోరినంత సహాయం అందించకపోగా, దేశం బయటి నుండి వచ్చే నిధులకు మోడీ ప్రభుత్వం మోకాలడ్డుపెట్టింది. ప్రకృతి వైపరీత్యాల చట్టంలో విదేశీ నిధులను అంగీకరించే అంశం లేదని అనుమతి నిరాకరించింది. కేరళకు చెందిన వారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సుమారు 10 లక్షల మంది ఉంటారు. ఆ సానుభూతితో యుఎఇ ప్రభుత్వం రూ. 700 కోట్ల ఆర్థిక సహాయానికి ముందు కొచ్చింది. అయితే కేంద్రం నిరాకరణతో ఆ సహాయం ఆగిపోయింది. అయితే తమ మంత్రులనే విదేశాలకు పంపి నిధులు సేకరించాలని సిఎం విజయన్ తలచారు. మంత్రుల విదేశీ ప్రయాణాలకు అనుమతులు నిరాకరించి ఆ పనిని కూడా కేంద్రం అడ్డు కట్టవేసింది.

చివరగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రూపంలో శబరిమలై అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశం కేరళ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెడుతోంది. మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర పదవీ విరమణకు ముందు ఇచ్చిన సంచలన తీర్పుల్లో ఇదొకటి. రాజ్యాంగంలో లింగ వివక్ష లేనందున దేవాలయ ప్రవేశానికి లింగ భేదాన్ని పాటించరాదని ఆయనతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. 1965లో కేరళ ప్రభుత్వం తీసుకున్న మహిళా ప్రవేశ వ్యతిరేక నిర్ణయం చట్టపరంగా చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయిదుగురు మహిళా న్యాయవాదులు కేరళ హిందు దేవాలయ ప్రవేశ నియమావళి 1965ను సవాలు చేశారు. కేరళ హైకోర్టు ఇది పూజారులు తీసుకోవలసిన నిర్ణయమని త్రోసి పుచ్చగా వారు సుప్రీం తలుపు తట్టారు.

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే కార్యం నేటి కేరళ వామపక్ష ప్రభుత్వంపై పడింది. తీర్పును ఆహ్వానించిన భాజపా, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో మత సంఘాల ఆందోళనను చూసి మాట మార్చాయి. కోర్టు తీర్పులు దేశ పౌరుల విశ్వాసాలకు లోబడి ఉండాలని ఈ మధ్య భాజపా అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ కూడా సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని కోరుతోంది. కేరళలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో బిజెపి, మతవాద సంస్థల అల్లర్లతో కాంగ్రెస్‌ను జతకడుతోంది.
జనవరి 14న కొల్లాంలో 16 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు ప్రారంభానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కేరళ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని ప్రసంగాన్ని ప్రచురించిన ఓ తెలుగు పత్రిక ఆ వార్తకు ‘సిగ్గులేని వామపక్షం’ అని పేరు పెట్టింది మోడీ మాటగా. కమ్యూనిస్టులు మన సంస్కృతిని గౌరవించరు. ఆధ్యాత్మికతను పట్టించుకోరు, చరిత్రలో అత్యంత సిగ్గుమాలిన ప్రభుత్వంగా లెఫ్ట్ సర్కారు మిగిలిపోతుందని ఆయన తన కమ్యూనిస్టు వ్యతిరేకత వెలగక్కారు.

28 సెప్టెంబర్ 2018న ఇచ్చిన తీర్పును స్వాగతించిన మహిళలు చివరకు జనవరి 2న ఆలయ ప్రవేశం చేయగలిగారు. కనకదుర్గ, బిందు అనే ఈ మహిళలకు ప్రాణహాని ఉన్నందున సరియైన భద్రత కల్పించాలని సుప్రీం రాష్ట్రాన్ని కోరింది. ఆన్‌లైన్‌లో 7564 మంది మహిళలు ఆలయ ప్రవేశానికి అనుమతి కోరగా ఇప్పటికి 51 మంది గుడిలోకి వెళ్లారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. శబరిమలై కేరళలో ఉన్నందువల్ల సుప్రీం తీర్పు అమలు అక్కడి ప్రభుత్వంపై పడింది. పాలనలో వామపక్ష కూటమి ఉన్నందున కేంద్రానికి ప్రధాని మోడీకి ఎంతైనా నోరు పారేసుకునేందుకు అవకాశం చిక్కింది. పరాయి ప్రభుత్వమే అయినా తీర్పును ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. దాని అమలుకు కేంద్రం వైపు నుండి సంపూర్ణ సహకారం ఉండాలి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాలు అయినా, మరే రాజకీయ పార్టీ సర్కారు అయినా పాలించవలసింది దేశ రాజ్యాం గం ననుసరించే అనేది మరవకూడదు. కేంద్రం రాష్ట్రాలకు బలంగా ఉండాలి కాని విరోధిగా మారి విచ్చిన్నకర శక్తులకు దన్నుగా ఉండకూడదు.

బి.నర్సన్
9440128169

PM Narendra Modi Fires on Kerala Government