Home ఎడిటోరియల్ మహిళాలోక విజయం

మహిళాలోక విజయం

Sampadakiyam      ‘దేశం కోసం పని చేయాలనుకునే మన ఆడబిడ్డలకు ఒక బహుమతి రక్షణ దళాలలో చేరడానికి తాత్కాలిక నియామకాల సర్వీస్ కమిషన్ (షార్ట్ సర్వీస్ కమిషన్) ద్వారా ఎంపికైన మహిళా సైనికాధికారులకు శాశ్వత సర్వీసులో ప్రవేశించే అవకాశాన్ని కల్పించదలచానని ఎర్రకోట బురుజుల నుంచి ఈ రోజు ప్రకటిస్తున్నాను’ ఈ పలుకులు ఎవరివో కాదు, ప్రధాని నరేంద్ర మోడీవి. 2018 ఆగస్టు 15న ఢిల్లీ ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్య్ర దిన ప్రసంగంలో ఆయన సగర్వంగా చెప్పిన మాటలివి. ఆ మేరకు మహిళా సైనికాధికారులకు సమగ్రమైన శాశ్వత సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో 10 ఏళ్లుగా పెండింగ్‌లో గల కేసును ఈ సరికే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని ఉండవలసింది.

ముఖ్యంగా ఆ కేసులో సమర్పించిన లింగ వివక్ష దృష్టి తో కూడిన అభిప్రాయ పత్రాన్ని వెనక్కి తీసుకొని ఉండవలసింది. కాని అలా జరగలేదు. అందుచేతనే ఈ అప్పీలు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెబుతూ ‘మీ మూస ఆలోచన ధోరణిని, పితృస్వామ్య దృక్పథాన్ని మార్చుకోండి’ అని కేంద్రానికి మొట్టికాయలు వేయవలసి వచ్చింది. అభిప్రాయ పత్రంలో కేంద్రం చేసిన వ్యాఖ్యలు తరతరాల నాటి పాత, బూజు పట్టిన మగాధిపత్య భావజాలాన్ని ప్రతిబింబిస్తున్నాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని స్పష్టం చేయవలసి వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన మహిళా సైనికాధికారులకు పర్మనెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ 2010 మార్చి 12న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రంలోని అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంది.

అందులో భాగంగా సమర్పించిన అభిప్రాయ పత్రంలో మహిళలు గర్భం ధరించడం, పిల్లల్ని కనడం, కుటుంబాన్ని చూసుకోడం వంటి సైనిక విధులకు పొసగని బాధ్యతలు నిర్వర్తించవలసి ఉన్నందున వారికి శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయడం కుదరదని అభిప్రాయపడింది. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. లింగ తేడాలను చూపి రాజ్యాంగపరమైన సమాన హక్కును మహిళలకు నిరాకరించడం ఎంత మాత్రం తగదని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పురుషులతో కూడిన సైనిక విభాగాలను నడిపే కమాండ్ పదవులకు వారు అనర్హులనడం తప్పు అంటూ న్యాయమూర్తులు చంద్రచూడ్, అజయ్ రస్తోగీలతో కూడిన ధర్మాసనం చీవాట్లు పెట్టినంత పని చేసింది. ఈ తీర్పు చెబుతూ సైన్యానికి మహిళా అధికారులు గొప్ప కీర్తిని తెచ్చారని వారి సేవల చరిత్ర అసాధారణమైనదని లింగ భేదం ప్రాతిపదికగా వారి సామర్థాలను శంకించడం వారిని కించపరచడమే కాకుండా సైన్యంలో సమానులుగా పని చేస్తున్న స్త్రీ పురుష అధికారులందరినీ అవమానించడమేనని, పురుషాధిపత్య వ్యవస్థలో మాదిరిగా మహిళా సైనిక అధికారులను ద్వితీయ శ్రేణి వారుగా పరిగణించడం సరైనది కాదని సవివరంగా ఎరుకపర్చింది.

కేవలం మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించినందుకే కాకుండా లింగ వివక్ష చూపడం మహిళలకు పురుషుల కంటే తక్కువ పరిగణనను కల్పించడం అనే దృష్టి ప్రభుత్వానికి ఉండ తగదని నిర్‌ద్వంద్వంగా చెప్పినందుకు దేశంలోని మహిళా లోకమే కాకుండా ప్రజాస్వామిక, సమ సమాజ వాదులు, ప్రియులందరూ ఈ తీర్పును హర్షించవలసి ఉంది. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్లతో పోరాడుతున్న ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలలోనూ సిరియా, లెబనాన్, ఇథియోపియా, ఇజ్రాయెల్ సైన్యాలలోనూ మహిళా అధికారులు వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనదని సుప్రీంకోర్టు ఉదహరించిన అంశం గమనించదగినది. దేశంలో సంప్రదాయబద్ధంగా ఉన్న వివాహ, కుటుంబ వ్యవస్థల్లో స్త్రీలు ఇంటికే పరిమితమైపోతున్న పద్ధతిని సైన్యంలో కూడా పాటించదలచుకోడం వల్ల రక్షణ దళాల్లో మహిళల పాత్రను అలంకారప్రాయంగానే కొనసాగింపజేసే అసమ విధానం స్థిరపడిపోయింది.

సుప్రీంకోర్టు దీని మీద విద్యుదాఘాతం వంటి తీర్పును ఇచ్చి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మహిళలు అంతరిక్ష యాత్రలు కూడా చేస్తున్న ఈ రోజుల్లో ఇతర అన్ని రంగాల్లోనూ వారికి సమాన అవకాశాలు, గౌరవ మర్యాదలు ఇవ్వడానికి ప్రభుత్వాలే వెనుకాడడం మానవాళి ప్రగతికి ఎంతైనా చేటు కలిగిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ పద్ధతికి తెరపడవలసి ఉంది. ఈ తీర్పు వెలువడిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటన హర్షించదగినది. తీర్పును ప్రభుత్వం అమలు పరుస్తుందని, మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోడీ 2018 ఆగస్టు 15 ప్రసంగంలోనే ప్రకటించారని ఆ వైపుగా చర్యలు తీసుకుంటున్నామని రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటన ఈ విషయంలో కేంద్రం పురోగామి దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నది.

PM opposed permanent commission to women officers