Home ఎడిటోరియల్ ఐదు ట్రిలియన్ల కల ఫలిస్తుందా?

ఐదు ట్రిలియన్ల కల ఫలిస్తుందా?

Economic Survey

 

ప్రధాని ఆశిస్తున్నట్లు 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ దశకు చేరుకోవాలంటే వార్షిక వృద్ధి రేటు 11.5 శాతంగా ఉండాలి అని చెబుతున్నారు. అంటే వృద్ధి రేటు దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువగా ఉండాలి అన్నమాట. ఏ మేరకు సాధిస్తారు ? ఆర్థిక మంత్రిత్వ శాఖలో, రిజర్వు బ్యాంకులో కీలకమైన వ్యక్తులు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం లేదని అంటూ తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోవడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన ఉన్నవారు లేరని ప్రముఖ ఆర్థిక వేత్త అయిన బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసింది.

ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్‌ను వచ్చే ఐదేళ్లల్లో అభివృద్ధి కావించే లక్ష్యాన్ని ప్రధాని దేశం ముందు ఉంచారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఈ మహత్తర లక్ష్యాన్ని వెల్లడించారు. జపాన్‌లో జరిగిన జి-20 అధినేతల సమావేశంలో సహితం ప్రధాని ఈ వృద్ధి లక్ష్యాన్ని ప్రస్తావించారు. ఇది కష్టసాధ్యమైనదే అయినా అసాధ్యం కాదని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో ఇది ఒక విధంగా కష్టంగానే కనిపిస్తున్నది. ఐదేళ్లల్లో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చేయడంతో పాటు, ఆ తర్వాత 8 ఏళ్ళల్లో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రధాని పేర్కొంటున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మన వృద్ధి రేటు 3 శాతం పరిధిలోనే ఉంటూ వస్తున్నది. అయితే ఆర్ధిక సంస్కరణల ఫలితంగా వేగంగా పెరుగుతూ వచ్చింది. యుపిఎ హయాంలో రెండంకెల వృద్ధి రేటు సాధించాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ప్రధాని మోడీ సహితం అటువంటి లక్ష్యం ముందుంచుకున్నా ఒక విధంగా ముందుకు వెళ్లలేక పోతున్నారు. వృద్ధికి దోహదపడే కీలకమైన అంశాలు తిరోగమనంలో ఉండటమే ఈ సందర్భంగా ఆందోళన కలిగిస్తున్నది.

ముఖ్యంగా ఒకప్పుడు అత్యంత వృద్ధి కనబరచిన సేవల రంగం సహితం తిరోగమనం పడుతుండగా, ఉత్పత్తి రంగంలో ఎంత ప్రయత్నించినా వృద్ధి సాధించలేక పోతున్నాము. ఎటువంటి వృద్ధి అయినా దేశ ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఉండాలి. పేద ప్రజల వికాసం కోసం ఈ ప్రభుత్వం అనేక భారీ కార్యక్రమాలు చేపట్టినా అవి వారి జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురాలేకపోయాయి. ముఖ్యంగా ఉద్యోగ కల్పనలో ఈ ప్రభుత్వ పని తీరు అత్యంత నిరుత్సాహం కలిగిస్తున్నది. గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఉద్యోగ కల్పనలో దేశం వెనుకడుగు వేస్తున్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బార్ల్లా తలుపులు తెరుస్తున్నా ఆశించిన రీతిలో పెట్టుబడులు రావడం లేదు. ఒక వంక ప్రభుత్వం వైపు నుండి పెట్టుబడులు మందగిస్తుండగా, ప్రైవేట్ రంగం నుండి మరింత దారుణంగా ఉంటూ వస్తున్నది. దేశంలో రూ 6.50 లక్షలకు పైగా వ్యయం కాగల ప్రాజెక్ట్‌లు పెట్టుబడుల సమస్యతో ముందుకు వెళ్లలేక పోతున్నాయి. వాటిలో సగానికి పైగా ప్రభుత్వ పెట్టుబడుల కొరతతో ఆగిపోతున్నవే కావడం గమనార్హం.

బ్యాంకింగేతర ఆర్థిక సహాయ సంస్థల నుండి రుణా లు తీసుకోవడం తగ్గిపోతున్నది. మరోవంక బ్యాంకింగ్ రంగం నుండి సహితం రుణాలు తగ్గిపోతున్నాయి. దానితో దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ద్రవ్య కొరత ఏర్పడుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా దిక్కుతోచని స్థితిలో నిలబడవలసి వస్తున్నది. ఒక వంక రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు దారుణంగా ఉంటుండగా, వాటిపై రుణ భారం పెరిగి పోతుండగా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు సహితం ఆశాజనకంగా లేవు. అందుకనే రిజర్వు బ్యాంకు నుండి రిజర్వు నిధులలో రూ. 3 లక్షల కోట్లకు పైగా తీసుకోవడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. కీలకమైన మౌలిక రంగాల నుండి ప్రభుత్వం బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయలేక పోతున్నది. బిఎస్ ఎన్‌ఎల్ దుస్థితి ఈ సందర్భంగా గమనార్హం. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందుగానే తిరిగి అధికారంలోకి రాగానే ప్రతి రంగంలో వంద రోజుల అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడానికి రంగం సిద్ధం చేయడానికి ప్రధాన మంత్రి కార్యాలయం కసరత్తు ప్రారంభించింది.

ప్రైవేటు లేదా ప్రజల భాగస్వామ్యం ఉండే కార్యక్రమాలను తప్ప ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్ట వలసిన కార్యక్రమాల వైపు దృష్టి సారించలేని పరిస్థితులలో ఉంది. ఉదాహరణకు, రైల్వే రంగంలోని ఉత్పత్తి యూనిట్‌లను ప్రైవేట్‌పరం చేయడానికి సిద్ధపడుతున్నారు. చివరకు ప్రయాణికుల రైల్వేలను ప్రైవేట్ పరం చేయడానికి కూడా కసరత్తు చేస్తున్నారు. తాజాగా మూడు విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించారు. మొదటిసారి మోడీ అధికారంలోకి రాగానే 400 రైల్వే స్టేషన్‌లను ప్రైవేట్ పెట్టుబడులతో ఆధునీకరణ కావించాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఆశించిన రీతిలో ప్రైవేట్ పెట్టుబడులు కూడా రాకపోవడంతో చెప్పుకోదగిన పురోగతి సాధించలేకపోయారు. చివరకు ప్రైవేట్ పెట్టుబడులతోనే ముందుకు వెడుతున్న జాతీయ రహదారులకు సహితం బ్యాంకు రుణాలు తగు రీతిలో లభించడం లేదని మంత్రి నితిన్ గడ్కరీ తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడుల కొరత ఏర్పడడానికి ప్రజల కొనుగోలు శక్తి బాగా సన్నగిల్లడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అందుకనే వ్యాపార, పారిశ్రామిక వృద్ధి కుంటుబడుతున్నది. ప్రజల ఆదాయాలలో వృద్ధి లోపించడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకు దోహదపడే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున కుంటు పడుతూ ఉండటం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. నోట్ల రద్దు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలలో లభించిన అసాధారణ విజయంతో ప్రధాని ఈ కారణాల చేతనే పొంగిపోకుండా రెండో సారి అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని స్వయంగా పర్యవేక్షించడం కోసం రెండు ప్రత్యేక మంత్రివర్గ కమిటీలను తన సారథ్యంలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ కల్పన, పెట్టుబడుల సమీకరణ, గ్రామీణ ఆర్థిక సంక్షోభం వంటి అంశాలపై ప్రధాని స్వయంగా దృష్టి సారించినట్లు స్పష్టం అవుతున్నది.

ఇప్పుడు కేంద్రంలో బలమైన కేంద్రంగా రూపొందిన హోం మంత్రి అమిత్ షా సహితం మంత్రి పదవి చేపట్టగానే మొదటగా తన మంత్రిత్వ శాఖకు సంబంధం లేని ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖల మంత్రులు, అధికారులతో అత్యున్నత సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రధాని ఆశిస్తున్నట్లు 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ దశకు చేరుకోవాలంటే వార్షిక వృద్ధి రేటు 11.5 శాతం గా ఉండాలి అని చెబుతున్నారు. అంటే వృద్ధిరేటు దాదాపు రెట్టింపుక న్నా ఎక్కువగా ఉండాలి అన్నమాట. ఏ మేరకు సాధిస్తారు? ఆర్థిక మంత్రిత్వ శాఖలో, రిజర్వు బ్యాంకులో కీలకమైన వ్యక్తులు స్వతంత్రంగా పని చేసే వాతావరణం లేదని అంటూ తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోవడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన ఉన్నవారు లేరని ప్రముఖ ఆర్ధిక వేత్త అయిన బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసింది. ప్రధాని మోడీ గాని, మొదటి ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గాని ఆర్థిక వ్యవహారాల పట్ల తగు అవగాహన లేని వారేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ పరిస్థితులలో పెద్దగా మార్పు కనబడటం లేదు.

కనీసం ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన గల తన వంటి వారి సలహాలను స్వీకరించే పరిస్థితులలో కూడా ఈ ప్రభుత్వం లేదని అసహనం వ్యక్తం చేశారు. యుపిఎ సమయంలోనే ఆర్థిక రంగంలో మితిమీరిన రాజకీయ జోక్యం, పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ రావడం కారణంగా ప్రస్తుతం ఇటువంటి దారుణ పరిస్థితులు ఆర్ధికరంగంలో వెల్లడి అవుతున్నాయని భావించవలసి వస్తున్నది. అవినీతిని తుదముట్టిస్తాం, నల్లధనాన్ని వెలికి తీస్తామన్న హామీలతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ దిశలో చెప్పుకోదగిన విజయాలు సాధించలేక పోయింది. అవినీతి ఆరోపణలపై ఉద్యోగాల నుంచి తొలగించిన సీనియర్ రెవిన్యూ అధికారులలో కొందరు యుపిఎ హయాంలో అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకు రావడం కోసం తీవ్రంగా కృషి చేసిన నిజాయితీపరులు’ ఉన్నారని స్వామి వంటి వారు పేర్కొనడం గమనార్హం. ప్రధాన మంత్రి మోదీ ఆశిస్తున్న విధంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలి అంటే ఆర్థిక రంగంలో మౌలిక మార్పులకు ప్రభుత్వం సిద్ధపడాలని గ్రహించాలి.

PM says Economic Survey outlines vision for $5 trillion economy