Home జాతీయ వార్తలు నేడు హ్యాకథాన్ తుది ఘట్టం

నేడు హ్యాకథాన్ తుది ఘట్టం

PM Modi

 

సాయంత్రం జాతికి ప్రధాని సందేశం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 కార్యక్రమంలో పాల్గొంటారు. పలుదఫాలుగా సాగుతూ వస్తున్న ఈ హ్యాకథాన్ చివరి ఘట్టం ( ఫినాలే) సందర్భంగా ప్రధాని జాతి నుద్ధేశించి మాట్లాడుతారు. హ్యాకథాన్ ఫినాలే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. దీనిని ఉద్ధేశించి ప్రధాని శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రసంగం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని పలు ప్రాంతాలలోని విద్యార్థులతో ఆన్‌లైన్‌లో మాట్లాడుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా దేశంలో నూతన విద్యావిధానం గురించి ప్రత్యేకంగా యువతతో విద్యార్థులతో ప్రధాని ముచ్చటిస్తారు. ఇటీవల తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానంపై తమ అభిప్రాయాలను ప్రధాని వారితో పంచుకోనున్నారు.

2017 నుంచి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందింపచేసేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. విద్యార్థులు నిర్వహించాల్సిన పాత్ర విషయంలో ఇప్పుడు పలు మౌలిక మార్పులు వచ్చాయని , వారు నిత్యజీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉందని, కేవలం చదువుకే పరిమితం కాకుండా వారిలో సామాజిక స్పృహ పెంచాలనే లక్షంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ హ్యాకథాన్‌లో రెండు లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇందులో పాల్గొనేందుకు నాలుగున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.

పలు దఫాల తరువాత తుది రౌండ్‌లో లక్ష మంది విద్యార్థులు పాల్గొంటారు. యువతలో ప్రత్యేకించి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందింపచేసేందుకు, ప్రజాసమస్యల పరిష్కార దిశలో వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఏడాది తుది దశలో చివరికి ఎంపికైన పదివేల మంది విద్యార్థులు మొత్తం 243 కీలక సమస్యల పరిష్కార మార్గాల సాధన దిశలో పోటీపడుతారు. 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు, 20 పరిశ్రమలు సంధించిన ప్రశ్నలకు విద్యార్థులు సృజనాత్మక పరిష్కార మార్గాలను తెలియచేసేదిశలో ఇది ఓ అత్యుత్తమ వేదిక కానుంది.

PM to address grand finale of Smart India Hackathon