Home కలం విమోచనావాద కవిత్వానికి ఆదికావ్యం మెద

విమోచనావాద కవిత్వానికి ఆదికావ్యం మెద

Poems

Poems are speech from the soul, embodied emotions; poems are modes of resistance,ways to get around our relentless, high-pressure insistence that everything have a clear meaning and use. Poems are intellectual challenges; each one should look new. Poems are what poets must write: each one should sound authentic,like real speech.’ John Ashbery

ప్రతి తరంలో కవిత్వపు చుట్టుకొలతల్ని మార్చే కొన్ని మహత్వపూరిత కలాలు ఉంటవి. ప్రతి యుగంలో కావ్య ఫలాపేక్షకు అతీంద్రియ గోచరత్వాన్ని ప్రత్యామ్నాయం చేసే చేతనోద్రేక మూర్తిమత్వ దివ్యకంఠాలు కొన్ని మనం పుట్టిపెరిగిన పరిసరాల్లోంచే సంభాషిస్తవి. అది వస్తువు తీరులో కావచ్చు, రూపానికి పట్టే నగిషీ లో కావచ్చు-తమ పూర్వకవులను మించి , సమకాలికులను దాటుకొని సరికొత్త అభివ్యక్తిని అలరారిస్తూ ’వ్యాసోచ్చిష్టం జగత్సర్వం’ అన్నంత కీర్తి వంతంగా నిలిచే కవిత్వాన్ని వెలువరిస్తూ ఆ కలాలు ,ఆ కంఠాలు విమర్శకుల చేత పాఠకుల చేత నీరాజనాలు అందుకుంటవి. ఈ వ్యాఖ్యకు ఎంతమాత్రం అతీతం కాని, వచన కవితా ప్రక్రియను స్థానీయసౌందర్యం తావు నుంచి విస్ఫురిత విప్లవాగ్నిగా సంధించి వినిపిస్తున్న బహుజన కవి మునాసు వెంకట్.

ఈయన తన కొత్త ఆంథాలజీ ’మెద’ పేరుతో తెచ్చిండు. తొంబైల అనంతరం తెలుగు సాహిత్యంలో వెలుగు చూసిన కొత్త గొంతులకూ ఉద్యమాలకూ ప్రాచుర్యం కల్పించిన ’ మట్టిముద్రణలు ఆలగడప-మిర్యాల గూడెం ’ ఈ సంపుటిని అచ్చు వేసింది. సంపుటి చివర్న కవికి అత్యంత ఇష్టమైన ’నీలి’ దీర్ఘ కవితతో కలిపి ’మెద’లో మొత్తం యాభై ఒక్క విశిష్ట కవితలున్నై.కవి inventiveness ను crystal-gazing చేస్తూ సుప్రసిద్ధ విమర్శకులు అంబటి సురేంద్ర రాజు రాసిన ఇంట్రో పాఠకుడు దారి తప్పుతున్నప్పుడల్లా జాగృతం చేస్తుంటది.ఎందుకంటే aesthete గా మునాసు వెంకట్ ది indefinite articulation.

మన దేశచరిత్ర , చరిత్రరచన గురించి ఒక అవగాహనకు రాకుండా విమోచనా వాదం (abolitionism),విమోచనా వాద కవిత్వం అర్థం కాదు.ఇందుకు ప్రముఖ సబాల్ట్రన్ అధ్యయన వేత్త రణజిత్ గుహ అభిప్రాయం ‘The historiography of Indian nationalism has for a long time been dominated by elitism –colonialist elitism and bourgeois -nationalist elitism.‘ను అంగీకరించి తీరాలె. ఎందుకంటే ఇది విమోచనావాదులకు శిరోధార్యమైన అభిప్రాయం.నిఘంటు పరిభాషలో శ్రేష్ట వర్గంగా
పిలువబడే Elites అధికార సంపన్నులు(Power Elites)గా రూపాంతరం చెంది భూమి,పరిశ్రమలు,విద్య, సంస్కృతి వంటి సమస్త రంగాలను ఏలుతూ క్రింది వర్గాల నొసళ్లకు భావబానిసత్వాన్ని అంటగట్టి
రాజ్యం చేస్తున్న తీరుపై నిర్నగా తిరుగుబాటుగా వస్తున్నదే విమోచనా వాదం.క్రిందటి శతాబ్దాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అబాలిషనిజం అనంతరం వచ్చిన చట్టాల మూలంగా ఆ సమాజంలో వచ్చిన మార్పులను మనం గమనంలోకి తీసుకోవాలి.బానిసత్వం అభినవ రూపందాల్చిన మన సమాజంలో విమోచనావాదుల అవసరం నిత్యమై ఉంది. తొంబైల అనంతరం అరలు అరలుగా వచ్చిన అడుగు వర్గం కవుల కవిత్వం సుస్థిర పడిన ఈ Power Elites చేసే రాజకీయాలముందు నిష్క్రియగా వీగిపోయిందనే చెప్పాలి.అందుకనే ప్రాంతీయ స్పృహ నుండి ప్రాదుర్భవించి సబాల్ట్రన్ రచయితలు
విమోచనా వాదంలోకి నూతన చైతన్యంతో మారవలసి వుంది.
ఈ సంచరణకు కావలసిన మొత్తం తాత్విక భూమికను మునాసు వెంకట్ తన ’ మెద ’ కవిత్వం ద్వారా Re-enforce చేస్తున్నడు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో
మహాప్రస్థానం కావ్యాన్ని అభ్యుదయ కవిత్వానికి
మేనిఫెస్టోగా చెప్పుకుంటున్నట్టు మునాసు వెంకట్ ’మెద’ను ఆధునికానంతరవాదాల సమాహారమైన విమోచనావాద(abolitionist poetry) కవిత్వానికి ఆది కావ్యంగా పరిగణించవచ్చు. ఇందుకు సాక్షీభూతమైనదే ఈ anecdote.
‘తాతలకాన్నించి తండ్లాటలో
తవ్వ గొలిచింది తలరాతలనే‘
(ముందు గాలనే చెబుతున్నాం,పుట:15) కు
సారభూతమైన ’మెద’లోని కవితలన్నీ.తెలంగాణ గ్రామాల్లో ఏ తలుపు తట్టినా నీటిగోసే వినిపడినట్టు ,మెద లోని ఏ కవితను పట్టుకున్నా వలస దుఃఖం కథాచక్రమై కోరస్ అడుగుతది.చదివిన మనం తట్టుకోలేని సంవేదనకు గురవుతం.కారణం ఇక్కడి ప్రతిదీ పరాయి పాలవడం, ఇక్కడి మనుషులు పరాయీకరణకు గురికావడం.ఈ పరాయీకరణ నుండి మన ఊర్లను,వృత్తులను, విముక్తం చేసే పనిలో ప్రపంచం మీదకు అదే పనిగా కవితల్లో వెనుకటి బావులు చెలకలు వాగువంకల ఉనికి నింపి ఊరు జాడలను ఊడలమర్రి నీడను ఉద్యమీకరించడం మునాసు వెంకట్ కవిత్వ నిర్మాణరీతి.జీవన గమనంలో ఎదురీతనుండి పిండుకున్న ఫిలసాఫికల్ సెన్సిబిలిటీతో
‘అంతా వెళ్ళిపోయాక / రేలపూలు రాలిపోతుంటే
ఒక్కన్నే ఉన్నా గీ రాత్రి / ఈదురు గాలి సన్నటి జల్లు
ఇగంలో మునిగి శిగంఊగుతున్నా’
(పరవశం-పుట 80 ) పాటు మునాసు వెంకట్ కవిత్వంలో పొలిటికల్ సెన్సిబిలిటీ కూడా ఆద్యంతం తొణికిసలాడుతూ వుంటది.నీటి కటకటతో జల విలాపం ఆలపిస్తున్న నల్లగొండ ప్రజల గోసకు ’అవిటి పొద్దు’కవిత మహదోపమానం.
‘రాజ్యాలు రాల్లేసి పోతుంటే /కండ్లల్లో నీళ్లు పైకొచ్చె’
పుట:19
‘నీళ్ళుంటే నడిసొచ్చినట్టుండేది / గిప్పుడు ఈదలేక చస్తున్నం‘
పుట:21
అనే వాక్యాలు దోసిట్లో ఉన్నప్పుడు గత పాలకుల మీద పెను కోపం ఉప్పొంగే మానసికావేశ దశ నుంచి మనలను ఆపడం ఎవరి తరమూ కాదు.
ప్రామాణిక తెలుగులో ’వనభోజనాలు’ కార్యక్రమాన్ని తెలంగాణల ’చెట్లకిందికి ఎల్నెం’ అంటరు. ఈ సందర్భాన్ని తలచుకున్నప్పుడల్లా మామూలు మనుషులనే అనుభూతులు జడివానలా తడిపేస్తవి.ఇంక కవుల సంగతి ఏంజెప్తం?
‘తల-కోటి స్వప్నాలు పండు / వెయ్యి తోవల కూడలి
శ్రావణమాసంలో / ఓ తొవెంటా….
ఆ మూడు రాళ్ల పొయ్యి / జ్ఞాపకాల మైలురాళ్ళు
ఫలాలకు మించిన పరవశం / ఆ చెట్లు ఎప్పటికి ఆరిపోని
అగరవత్తులు’ అంటున్న చోటు నుండి మనసు కదలనీయదు పాదాన్ని.ఆ తలపుల్లో క్షణాలన్నీ నిజంగానే మొక్కలుగా పెరిగి చెట్లైతై.సమ్మోహన పరిచే నాస్టాల్జియాతో మనందరికీ చెట్ల కింద కవిత్వం విస్తరి పరుస్తడు వెంకట్. ఒకప్పటి కవుల్లో దేశభక్తి అతిశయం.ఈ తరం కవుల్లో మాతృ భక్తి సమధికం.తన తల్లి సాలమ్మశ్రమశీలాన్ని గురించి వివరించే గొప్ప వృత్తి జీవన కవిత ’అంతా అమ్మే’ .
”పతానం పెట్టె పక్కన పెట్టి
చాపల తట్టనెత్తికెత్తుకొని
ఇంటిని మోస్తున్న ఆడ ఏసు” అని క్యాజువల్ గా అనలేదు. వెంకట్ ది gratitude mindset.ఇది కాస్తా creative mindset గా మారి తల్లికి అవతారపురుషత్వాన్ని అన్వయించడం ద్వారా కృతజ్ఞత చాటుకున్నడు కవి.మదర్ కాంటెకట్స్ లో ఓ మంచి కవిత రాసుకోవడాన్ని మించి కవికి కావాల్సిన సంపన్నత ఏముంటది.అంబటి సురేంద్ర రాజు చెప్పినట్టు కవితలన్నీ దృశ్య శ్రవణ సమ్మిశ్రమమై-
‘రేకలుబారకముందె / దారి మీద దరికోసం
గోసిపెట్టి /కాశపోసుకుంది దినం
(మెద:121)’

‘ఏరేసిన నేలమీద / పారేసినట్టె పుట్టితిమి
ఊపిరి ఊదిందెవరో దేవా! / అలిపిరే మిగిలింది(దుగిట్ల:69)’

‘తండలు తండలు / జొన్న కంకులు జండాలెగురేసిన
తండోపతండాలు / అక్షరాలు పొదిగిన కిరీటమచ్చట
యుద్ధపద్యమెరిగిన / పద్మనాయకుల నేలన
నా మాయి ముంత /స్వర్గాన్ని కరిగించి తాపడం పెట్టిన
తలమది (రాచకొండ:77)’

‘తుమ్మకాయ కాటిక మధ్య / రెండు ఎన్నెల సెరువులు
తలుపుసాటుకు /పాయలు గట్టుకొని పారుతున్న యి
(పొన్న పువ్వు:57)
‘మొరం కింద సీకటి వాగు / సీకటి వాగులో దూపగొన్న నేను
వొంటరి కొలుపులో / కండ్లు జీడిగింజలై పగులుతుంటె
మళ్ళీ నాత్రి ఏటి సప్పుడు
(నాత్రి:47)’
‘సొంగ నోట్లో పెట్టింది / స్వర్గం ముట్టిచ్చేది
వశం కాని దాన్ని / తెల్లారి నశ్శం చేసేది’
(కామంచి:123)
‘తోవెంట తోవెంట / కాలాన్ని నమిలి నమిలి
కాలిన సింతగింజల్ని / మర్సిపోయింది సంచిల’
(శెక్కుడు సంచి:73)
‘సాలెమ్మటి సాలెమ్మటి / విత్తనాలేసి
ఇంటి ఆడబిడ్డలు / పోతు పోతు
ఆత్మల్ని అంటుగట్టిపోయేది
(నెనర్లు నెమరుకొస్తుంటే:138)’ లాంటి ఇమేజరీతో ఉద్యుక్త ద్రావిడావర్తమయ్యే ఇతివృత్తగాఢతతో పాటు ఒక యోధున్ని తలుచుకుంటే:104,
బొమ్మకట్టింది పాత చింతనే
97,వొంపుల తాడు:107, జివ్వ: 58, దమ్మన గొయ్య:129,నీలి:141 కవితల వైశిష్ట్యాన్ని చెప్పుకోవాల్సినపుడు ‘ The art of art ,the glory of expression and the sunshine of the light of letters, is simplicity ‘ అనే వాల్ట్ విట్మమన్ మహాశయుడి ఉల్లేఖనానికి నిదర్శనంగా తన కవితా నిర్మాణ చాతుర్యాన్ని నిలుపుకుంటడు ఎం.వెంకట్.నాట్య కారుడి ప్రతి కదలికలో ఓ ముద్ర దృశ్యమానమైనట్టు ఎం వెంకట్ కవిత్వంలో వస్తువైక్య భావైక్య లోకనిరుక్తులు కావ్యభాషగా అలవోకగా రూపుకడతవి.

జ్ఞాన శాస్త్రం(Epistemology) లో ప్రతిభ థీరియాటికల్ విజ్ డమ్ అని, ప్రాక్టికల్ విజ్ డమ్ అని రెండు రకాలు.వెంకట్ కవిత్వం ప్రాక్టికల్ విజ్ డమ్ కు సంబంధించినది.సమాజపు పొరల పొరపొచ్చాల్లో,పోరాటల్లో ఆరాటాల్లో సంప్రదాయ రాజకీయ పార్టీ కార్య కర్తగా వెంకట్ చవిచూస్తున్న సంస్థాగత లోటుపాట్లు అసమానతలు కవితలుగా రూపుదిద్దుకున్నవి మెదలో. ప్రాక్టికల్ విజ్ డమ్ లో భాగంగానే వెంకట్ కవిత్వ భాషను చూడాలి. సుప్రసిద్ధ ఆంగ్ల కవి ,స్థానిక భాషాభివ్యక్తి(Colloquial Speech)కి మారు పేరైన రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టు ‘Poetry is when an emotion has found its thought and thought has found words ‘ అనే కవితా నిర్మాణ సూత్రం వెంకట్ కు అక్షరాలా వర్తిస్తది . వెంకట్ స్థానిక భాషావాది.ఈ వాదాన్ని భుజాలకెత్తుకున్నది కేవలం భాషా పరిరక్షణకే అనుకుంటే పొరపాటు.వెంకట్ నికార్సయిన స్థానిక అభివృద్ధి వాది కూడా.

ఇది తన దీర్ఘ కవిత ‘వర్జి‘ లో-
‘కాల్వ జాగేనా గండయ్య / కాల్వెంట కలలెగర
కాలం బిత్తర బోవ / నిర్రనీలిగి నెర్రెలు బాసిన
సెర్లకి / కన్నెర్ర జేయక ముందే
కాల్వ జాగేనా‘ అనే తొలి పంక్తి తెలంగాణకు అందునా నందికొండ పక్కన ఉన్న నల్లగొండ కు నీళ్లు కావాలని ఎలుగెత్తి ప్రకటించడంతోనే స్పష్టమైంది.కవిత్వంలో స్థానీయ చైతన్యం వర్థిల్లాలనేది ఎం.వెకట్ ఎజెండా .స్థానీయ చైతన్యాన్ని పిడికిట ధరించే ఈయన ప్రపంచ కవులను రచయితలను తత్త్వవేత్తలను చదువుతడు.ఒప్పుకుంటడు.తిరస్కారం చెప్తడు.ఆదాన ప్రదానం అవుతడు.

కవుల కవిత్వానికి వేళ్ళు ఆ కవులు పుట్టిపెరిగిన స్థలాల్లో వుంటవి అన్నది సాంఘిక విమర్శకుల అభిమతం.ఈ వేళ్లలోంచి చిగురించి ఆర్జించినవిద్య,పరిచయాలు,పట్టణవాసపు ఛాయలను చీల్చుకొని కవుల కవిత్వం సర్వస్వతంత్రంగా ప్రాకృతిక జీవన మాధుర్యాన్ని ఆస్వాదించగల మార్మికతను, నిరాడంబరతను ప్రవచిస్తుంది.ఈ ప్రకార్యంలో ఎం.వెకట్ తన పూర్వకవులనే కాదు,సమకాలికుల కంటే ముందున్నడు.

ఇందుకు ‘నేను నాది అనే వైరస్ లేని / దేహమేలేదు
ఆత్మలు లేని అవయవాలు / ఆక్టోపస్ కబలిస్తుంటే తాతలు
తల్లులు తండ్రులు అమ్మమ్మలు / నానమ్మలు మామూలు అత్తలు / అక్కా చెల్లెలు అన్నదమ్ములు
వరుసగా వాడిపోతున్న వనం”
( డాలర్ శరణం గచ్ఛామి-పుట 93) అనే వర్ణన ఒక దృష్టాంతం.వర్తమాన సాహిత్యంలో నూతన ప్రక్రియలెన్నో వస్తున్నప్పటికీ జీవితానుభవం, అనుభూతుల వ్యక్తీకరణకు కవిత్వమే మేలైన సాధనమనే విశ్వాసాన్ని ఈయన కవిత్వం ధ్రువీకరిస్తుంది.

కవిగా ఎం.వెంకట్ బెస్త సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నట్టు కన్పించినా మొత్తంగా తెలంగాణ బవహీనవర్గాల దీనస్వరాన్ని ‘దేవండ్లు’గా కైకడతడు, ’పాతాళ దీపం’ వెలిగిస్తడు,’సింతల కోపు నుంచి మొత్తుకుంటడు. ఏండ్లతరబడి బహుజనులు మోస్తున్న ఆకలిదూపలను,వివక్షను తూర్పారబడుతూ మట్టిపేగుబంధంలో శ్రామిక జీవన తాత్త్వికతను నిక్షిప్తం చేసుకోవడం వలన ’రేల గంధం,మహా సంచారం,మర్రి ఆకాశం,వెన్నెల వేర్లు,పిట్టల తొట్టెల,జప్తు,నీలి కలసి ఒక రస సమీకరణంగా మారడం మూలాన ’మెద’ కవితా సంపుటి క్లాసిక్ (ఉత్కృష్ట రచన)స్థాయికి ఎంతమాత్రం తీసిపోదు.కవులు కళాకారులు ఎందుకు సృజన చేయాలి? తాము సృజన చేయకపోతే ప్రపంచానికి ఏమన్నా నష్టమా? అని కొందరు అనుకోవచ్చు.దీనికి ఒక పాశ్చాత్య పండితుడు చెప్పిన మాటే ‘ The earth without art is eh ‘ సమాధానం. అంటే కళలే లేనట్లైతే ఈ భూమి ఒక బోలు,తాలు,కొరగానిది అని అర్థం.

మరి ఎం.వెంకట్ కవిత్వంలోకి రాకుండా ఉండి ఉంటే గనక దళిత బహుజన వాదాలు బలపడి ఇప్పుడు విమోచనావాదంగా పరిణితి చెందివుండేది కాదు.స్నాతకోత్తర పాండిత్యం నుండి రాసే రచనల కంటే పామరత్వం పల్లీయ పరవశత్వం నుండి రాయడం ద్వారా కూడా దేశి ఒరవడిలో ప్రామాణిక వచన కవిత వెలుగు చూడగలదన్న సృజనతల వాస్తవికత ఇవాళ వాగ్గేయసాహిత్యం సరసన నిలబడి వుండేది కాదు.కవి ఏం రాశిండు?ఎట్లా రాశిండు?ఎందుకు రాశిండు?ఆ రాసిందానికి ప్రాసంగికత ఉన్నదా? అనే దాన్ని బట్టి ఆ కవి స్థాయి,స్థానం నిర్ణయించబడతయి.తెలంగాణ బెస్తకుల జీవనం ఆధారంగా అడుగు వర్గం వర్తమానాన్ని వెంకట్ వినిపిస్తుండు.స్థానీయ కులవృత్తి భాషలో వచన కవితలను మలచిండు. నిచ్చెన మెట్ల సమాజంలో వెనకబడివున్న ఉత్పత్తి కులాల వృత్తికులాల దీనత్వం రూపుమాపబడాలని
’బస్మమైన బసవుల నేలకదా
పోతురాజు సాచ్చిగా సాకలెన్ని బోనాలెన్ని
కనుగుడ్ల ఎనకాల
కాలం పొదిగిన అక్షరాలెన్ని
నడిసి నడిసి పొద్దుగూకిన
దీర్ఘకాలం ఇంకా తెల్లారలేదు
కల్లోలాలు లేని కల్లాలకోసం
నేల కల కంటూనే ఉందిని (పుట:99) అంటూ నిరంతరం సంఘర్షిస్తుండు, మార్పు కోసం తపిస్తుండు. ’మెద’కవితలను ప్రపంచంలో ఏ మూలన ఉన్న తెలుగువాడు చదివినా వాటిల్లోని సత్యాన్ని తత్వాన్ని అంగీకరించి తీర్తడు.వస్తురూపాలరీత్యా, భావజాలం రీత్యా ఇవాళ్టి మన సమాజపు విలోమత్వంతో విభేదిస్తడు.పునాది నుంచి రావాల్సిన మార్పుకు దౌడు తీస్తడు.ఇదే’మెద’కవిత్వానికి ప్రాప్తించే ప్రాసంగికత.

కాన్సియస్ గా కవిత్వం రాసే ఏ కవి అయినా అంతే కాన్షియస్ గా కావ్య నామం ఎంచుకుంటడు. మెద రెండక్షరాల పదం. కవితల్లో వాక్యాల చివర్న క్రియా పదాల మోహరింపును తుంచేయడం వెంకట్ అలవాటు.అంటే బ్రీవిటీ కి ప్రాధాన్యత ఇస్తడు.అట్లనే కావ్య నామం విషయంలోనూ గొప్ప సంక్షిప్తత పాటించిండు.కొత్త పిల్లలకు తప్ప ఊర్ల నుంచి వృత్తుల నుంచి వ్యవసాయిక నాగరికత నుంచి వచ్చిన ఎవళ్లకూ
‘చెమటల్ని చేరుకున్న ఋతువులు
కాలం జెండాలు
ఒక్కొక్క ధ్యానపోస కలిసి
తపోమంద
కల్లములో కళ్లు తెలిసిన మెద ‘
(పుట:121)

గురించి చెప్పవలసిన అవసరం లేదు.పంటను కోసి మెద ఏస్తం.మెదను కల్లంలకు మోస్తం.తర్వాత ధాన్యం తీస్తం.విత్తనం ఏసిన కానుంచి ధాన్యం వరకు మొత్తం ప్రక్రియ లో మనుషుల శ్రమ మహోన్నతమైంది.ఇక్కడ మనుషులు అంటే ఎలైట్స్ కాదు,లేబర్. అద్దె పడిన మెద ను బట్టే భూమి తత్త్వం శక్తి తెలుస్తవి (లాండ్ ఎలైట్స్)భూ సంపన్నులకు.మెదను బట్టే తమకు ధర్మంగా రావాల్సినకూలీ పై నమ్మకం ఆశ కలుగుతవి శ్రామికులకు.చెమటతీసి మెద బెడితే కూలీలకు ఇంతకాలంగాదక్కింది ఆకలి అవమానం వెరసి పేదరికం. మెదను పోలిన ఏ ఉత్పాదన అయినా దాని రూపశిల్పికి దక్కేది ఎక్కడైనా ఎండమావే. ఇది గ్లోబల్ పెయిన్.

తమ వర్గాల పేదరికం పోవాలని, అక్షరాలు నేరిస్తే ఉపాధి దొరక్కపోయినా కనీసం చేసుకొని బతకడానికి వృత్తులైనా మిగలాలనేదే మునాసు వెంకన్న దార్శనికత. ఇంచుమించుగా ఈ సంపుటిలోని ప్రతి కవిత శ్రామిక వర్గం బాధలకు సబాల్ట్రన్ జాతుల నిమ్నత్వానికి సంపూర్ణ విమోచన కలగాలన్న కోణాన్నే ఆవిష్కరిస్తుంది. లోకల్ లాంగ్వేజ్ లో గ్లోబల్ విషాదం గొంతు నిండా మారుమ్రోగుతుంది.అందుకే మునాసు వెంకన్న విమోచనా వాద ప్రవక్త.మెద సంపుటి లోని ప్రతి కవిత విమోచనా వాద ప్రవచనం.పఠిద్దాం.కవితో పైనం అవుదాం.పూటికతీస్తే పుత్తడే అని నెనరును నెమరువేస్తున్న భూమి పుత్రుడి పానగల్లు చెరువును వల సంకనేసుకున్న గంగపుత్రలకూ,నాగలి కొరాడేసుకున్న రైతన్నలకూ రాజకీయాలచెర విడిపించి వాగ్దానం చేద్దాం.

Poems are intellectual challenges