Saturday, June 21, 2025

సమాజ సర్వతోముఖాభివృద్ధికి కవులు, రచయితలు, కళాకారులు కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

మూలాలను అన్వేషిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది
సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉంది
ప్రజల ఆలోచనల విధానాల్లో మార్పులు తేవడానికి మీ కలాలకు పదును పెట్టండి
ప్రభుత్వ పథకాలు- సమాజాభివృద్ధి, సాంస్కృతిక అంశాలపై జరిగిన సదస్సులో మంత్రి జూపల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ, సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, సామాజిక రుగ్మతలను రూపుమాపినప్పుడే నవ సమాజం నిర్మితమవుతుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్భోధించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, మేధావులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని బేగంపేట టూరిజం ప్లాజాలో ‘ప్రభుత్వ పథకాలు- సమాజాభివృద్ధి, సాంస్కృతిక’ అంశాలపై సోమవారం నిర్వహించిన సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సంస్కృతి అంటే కేవలం ఆటపాటలు, నాట్యం, సంగీతం, సాహిత్యం, కవిత్వం, భాషకే పరిమితం కాదని, సంస్కృతి అంటే మన అస్తిత్వం, ప్రజల జీవన విధానమని అన్నారు. అయితే ప్రజల జీవన విధానం ద్వంసమైందని, ప్రజల్లో ఆలోచన ధోరణి మారిందని, ప్రజల జీవన విధానం గతి తప్పడం వల్లే అనేక పెడ ధోరణులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లు మారి అనారోగ్యం బారిన పడుతున్నారని, ప్రభుత్వం నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నప్పటికీ గుడ్డెద్దు చేలో పడ్డట్లు కొంత మంది విద్యా, వైద్యం, వేడుకలు -అడంబరాలకు పోయి స్థాయికి మించి ఖర్చులు చేస్తూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కఫ్టపడి సంపాదించిన డబ్బును కార్పోరేట్ స్కూళ్లు, హస్పిటల్ పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడ నమ్మకాలు, సాంఘీక దురాచారాలు, యువతలో పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉంది

మూలాలను అన్వేషిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని చెప్పారు. తెలంగాణ సమాజంలో ఒక సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు, కళాకారులపై ఉందన్నారు. ప్రజల ఆలోచనల విధానాల్లో మార్పులు తీసుకురావడానికి మీ కలాలకు పదును పెట్టాలని, మీ రచనలు, ఆట పాటలు, ప్రదర్శనలతో సమాజాన్ని మేల్కొల్పాలని సూచించారు. మీ వల్ల మంచి ఆలోచన, మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో కూడిన నవ సమాజం నిర్మాణం అవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలపై కమిటీ వేసి కార్యచరణ రూపోందించాలని, దీనికి ప్రొఫెసర్ కోదండరాం సమన్వయ కర్తగా వ్యవహరించాలని కోరారు.

రచయితలు తమ రచనలు రాయాలని, కళాకారులు ఆట పాటలు, వీధి నాటకాలు, నాట్యం వంటి ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేయాలని, అవసరమైతే వీటికి రూ.10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ సదస్సులో ప్రజాస్వామ్య స్పూర్తితో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నర్సింగ రావు సమర్పించిన సాంస్కృతిక విధాన పత్రాన్ని అమలు దిశగా చర్యలు తీసుకోవాలని, అర్హులైన కళాకారులకు సాంస్కృతిక కళా సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జానపద కళాకారుల పారితోషికాన్ని పెంచాలని, అర్హులైన వృద్ద కళాకారులకు పింఛన్ వర్తింపజేయాలని, జీవిత, ఆరోగ్య బీమా కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని సూచించారు. దీనిపై మంత్రి స్పందిస్తు అర్హులైన కళాకారులకు సాంస్కృతిక కళా సారధిలో ఉద్యోగ అవకాశాలు, అందులో ప్రస్తుతం పని చేస్తున్న కళాకారుల పారితోషికం పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.

విద్యా కరికులంలో నాటకం, సంగీతం, నృత్యం చేర్చాలి

విద్యా కరికులంలో నాటకం, సంగీతం, నృత్యం వంటి వాటిని చేర్చాలని, జానపద, గిరిజన కళా రూపాలను భవిష్యత్ తరాలకు అందిచేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరారు. సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఆడియో విజువల్స్ ను రూపొందించి, గతంలో మాదిరిగా థియేటర్లలో న్యూస్ రీల్స్ ప్రదర్శించాలన్నారు. చెడు వ్యసనాల బారి నుంచి యువతను కాపాడేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ద్వారా సందేశాలు ఇప్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ సాంస్కృతిక కళా సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజాల, పర్యాటక, సాంస్కృతిక స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, డైరెక్టరు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నర్సింహారెడ్డి, విద్యా శాఖ కమిషనర్ దేవసేన, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివ కుమార్ కవులు రచయితలు- ప్రజా కవి అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, ఉస్తాద్ డా. చౌదరపల్లి రవి కుమార్ (ఒగ్గు డోలు), ఆకుల సదానందం (థియేటర్), వంగ శ్రీనివాస్ ( ఫోక్), గాయకుడు ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్, దరువు అంజన్న, దరువు ఎల్లన్న, కళాకారుడు చక్రాల రఘు, పొట్లపల్లి శ్రీనివాస రావు, డా. ఖాజా పాషా ( థియేటర్ అండ్ సినిమా) మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఎం. సరిత, భూపతి వెంకటేశ్వర్లు, ఆర్టిస్ట్ పల్లె నర్సింహ, సాంస్కృతిక కళా సారథి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News