Home హైదరాబాద్ సాగర్ చుట్టూ విష వలయం

సాగర్ చుట్టూ విష వలయం

  • టన్నుల కొద్ది పేరుకుపోయిన ఘన వ్యర్థాలు
  • క్షీణిస్తున్న ఆక్సిజన్ శాతం
  • నిధులు లేవని చేతులెత్తేసిన హెచ్‌ఎండిఎ
  • భవిష్యత్‌ను హెచ్చరిస్తున్న పిసిబి వర్గాలు

Hussain-Sagar-Poision

సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ జలాలు గరళాన్ని తలపిస్తున్నాయి. జలచరాలు జీవులు బతకడానికి వీళ్లేనంత విషపూరితమయ్యాయి. సాగర జలాలు పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్టుగా పిసిబి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడి నీళ్లల్లో రసాయన ఘాడత ఎక్కువైందని, జీవులు పీల్చుకునేందుకు, బతికేందుకు ఆక్సిజన్ దొరికే పరిస్థితి లేదని అంటున్నారు. జలాశయంలో హానికారక బ్యాక్టీరియా వృద్ధ్ది చెందుతుందని నీటి నాణ్యత దెబ్బతింటోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో తేలింది. రాబోయే వేసవిలో నీటిమట్టాలు మరింత తగ్గి హానికారక రసాయనాల కారణంగా జలాశయం నీటి నుంచి విపరీతమైన దుర్గంధం వెలువడే ప్రమాద పొంచిఉన్నట్లు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘన వ్యర్థాలతో మురుగు…
హుస్సేన్‌సాగర్‌లో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను తొలగించకపోవడం, నాలాల నుంచి వచ్చి చేరుతున్నపారిశ్రామిక వ్యర్థ రసాయనాలతో జలశాయం రోజురోజుకూ మురుగుకూపంగా మారుతోంది. గతేడాది ఆఖరులో కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి నాలల నుంచి భారీగా వరద నీరు చేరింది. ఈ వరదనీటిలో ఫార్మా కంపెనీలు విడుదలచేసిన హానికారక రసాయనాలున్నాయి. జలాశయం అడుగున సుమారు 40 లక్షల టన్నుల ఘన రసాయన వ్యర్థాలు గుట్టలా పోగుపడినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 5లక్షల టన్నులే తొలగించారు. మిగతాది సాగరగర్భంలో పేరుకుపోవడంతో గరళం నుంచి విముక్తి లభించడం లేదని తెలుస్తోంది. గతంలో రూ.370కోట్ల నిధులను మహానగర అభివృద్ధి సంస్ధ(హెచ్‌ఎండీఎ) గతేడాది వేగవంతంగా ఖర్చుచేసింది. తాజాగా నిధులు లేవనే కారణంతో ప్రక్షాళన విషయంలో హెచ్‌ఎండీఎ చేతులెత్తయడంతో చారిత్రక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన అటకెక్కింది.
ఆక్సిజన్ శాతం శూన్యం…
సాగర్‌లో బయో ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) లీటర్ నీటిలో 35 పిపిఎం ఉండాల్సి ఉండగా, తాజాగా 90నుంచి100 పిపిఎంగా నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. నీటిలో ఆక్సిజన్ కరిగే సామర్థ్యం దెబ్బతింటుంది. దీంతో జలచరాలకు ఆక్సిజన్ అందే ఆవకాశమేలేదు. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సిఓడి) లీటర్ నీటిలో 80-100పిపిఎం మించరాదు కానీ, సుమారుగా 130నుంచి 160 పిపిఎం నమోదవుతోంది. అంటే సాగర్ నీటిలో రసాయనిక ఘాడత పెరిగనట్లుగా స్పష్టమవుతోంది. జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోయింది. ఇది లీటర్ నీటిలో సున్నాగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
వ్యాధులు ఖాయం…
జలాశయం నుంచి వెలువడే గాలి కారణంగా శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మురుగు కారణం గా జలాశయంలో డెంగ్యూ, మలేరియాకు కారణమయ్యే దోమల సంతతి వృద్ధి చెందుతోంది. ఈ పరిణామం సమీప ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జలాశయంలో ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గింది. ఈ జలాశయం పరిసరాల్లో ఎక్కువసేపు గడిపితే కళ్లమంటలు, దురద రావడం ఖాయమని అంటున్నారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి…
ప్రభుత్వం చొరవ చూపి హుస్సేన్‌సారగ్ ప్రక్షాళనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. సాగర్‌ను తిలపించేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారని అలాంటి ప్రాంతంపై చిన్నచూపెందుకని ప్రశ్నిస్తున్నారు. త్వరలో నిధులు కేటాయించి ప్రజలకు వ్యాదులు ప్రబలకుండా చూడాలని కోరుతున్నారు.