Home జాతీయ వార్తలు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం : చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం : చంద్రబాబు

NCB-3

అమరావతి : పోలవరం ప్రాజెక్టును 2019లోగా పూర్తి చేస్తామని ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎపిలో మొత్తం 52 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎపికి కేంద్రం చేసిన అన్యాయంపై పోరాడాల్సింది పోయి, తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తరువాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పడంతోనే తాము ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించిన క్రమంలోనే ఎపికి ప్రత్యేక హోదా అడుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎపి ప్రజల ప్రయోజనాల కోసం తాము ఎన్‌డిఎ నుంచి వైదొలిగామన్నారు.

కేంద్రంపై అవిశ్వాసం పెట్టామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే, వైసిపి, జనసేనలు కేంద్రాన్ని వదిలేసి తమను ఆడిపోసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అక్రమాస్తుల కేసులో ఎ2గా ఉన్న విజయసాయి రెడ్డి తనపై కేసులు పెట్టిస్తామని, అందుకోసం ప్రధాని మోడీ చుట్టూ ఎన్ని సార్లైనా తిరుగుతామని చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బిజెపి నేతలు అవినీతిపరులకు కొమ్ము కాస్తూ తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొందని ఆయన వైసిపి, బిజెపి , ఇతర ప్రతిపక్ష నేతలకు సూచించారు. కాగ్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరిపించాలా అని ఆయన ప్రశ్నించారు. మోడీ సర్కార్‌పై కాగ్ అనేక నివేదికలు ఇచ్చిందని, వాటిపైనా సిబిఐ కేసులు వేస్తారా అని ఆయన నిలదీశారు. పోలవరం పునరావాసంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆధార రహిత, అవగాహన రహిత ఆరోపణలు చేశారని బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

Polavaram Project Will Be Completed by 2019