Home తాజా వార్తలు కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ ఉద్రిక్తత… నేతల అరెస్ట్‌లు

కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ ఉద్రిక్తత… నేతల అరెస్ట్‌లు

Police arrest Congress leaders at Raj Bhavan

 

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో పెగాసిస్ వ్యవహారంపై ఎఐసిసి పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యాన ఇందిరా పార్కు వద్ద ఆందోళన, ధర్నా అనంతరం కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించడంతో కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ కార్యక్రమం గురువారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌కు చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు, మరోవైపు వర్షం అయినా కూడా భారీగా చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు చలో రాజ్‌భవన్ సందర్భంగా ఇందిరాపార్కు, రాజ్‌భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.

తొలుతగా ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎంఎల్‌ఎ సీతక్క, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, ఫిరోజ్‌ఖాన్, డిసిసి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశ ద్రోహులపై ప్రయోగించాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చివరికి ఎన్నికల కమిషన్ అధికారులను కూడా వదలడం లేదంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రవాదులపై మాత్రం ఉపయోగించాలన్నది పెగాసిస్ సంస్థ మూల సిద్ధాంతమని భట్టి తెలిపారు. బిజెపి చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారని.. స్వేచ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తుందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

స్వాతంత్య్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసమని, ఇప్పుడు ఆ స్వేచ్ఛనే హరించి వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని భట్టి ఆరోపించారు. కెనడా దేశానికి చెందిన ఓ సంస్థ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నిరూపించిందని ఆయన గుర్తు చేశారు. టెర్రరిస్టులను అంతమొందించాల్సింది పోయి.. ప్రతిపక్షాలను బిజెపి ప్రభుత్వం అంతమొందిస్తుందంటూ భట్టి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేకుండా చేసి నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ దేశానికి స్వేచ్ఛ తీసుకువచ్చింది కాంగ్రెస్, బిజెపి ఆ స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆందోళన చేస్తున్నామని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుందని భట్టి స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత గీతారెడ్డి అన్నారు.

ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్న ఆమె.. ప్రతిపక్షాల నోరు నొక్కేస్తుందని ఆరోపించారు. స్వేచ్ఛలేని నిఘా రాజ్యం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఫోన్లను పెగాసిస్ సంస్థ తన కంట్రోల్‌లోకి తీసుకుందని ప్రైవసీ యాక్ట్ ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. భయంతోనే ప్రధాని మోదీ.. ప్రతిపక్షాలు, జడ్జీలు, మీడియా పోన్‌లను ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని టిపిసిసి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. తెలంగాణ నిఘా విభాగం కూడా తమ ఫోన్‌లను ట్యాప్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామన్నా పోలీసులు అరెస్టు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్‌భవన్ ముట్టడి కాదు.. గవర్నర్ ముట్టడి చేపడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు. దేశంలో మోదీ ప్రభుత్వం ఫోన్ టాపింగ్ చేస్తూ దేశ ద్రోహంకు పాల్పడుతున్నారని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. బిజెపి పాలనలో అనేక మంది కవులు, మేధావులు చంపబడ్డారని ఎంఎల్‌ఎ సీతక్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో హక్కులకు భంగం కలిగిస్తున్నాయని తెలిపారు. దొంగ చాటు కుట్రలను అడ్డుకోవాలన్నారు. సమాచారాన్ని మొత్తం విదేశాల చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. దేశ భద్రతకు మోడీ, అమిత్‌షా ముప్పు తెస్తున్నారని ఆరోపించారు. దొంగతనం చేసి దొంగ మాటలు చెబుతున్నారని, దొంగ పనులు చేసి రాముడిని దేవుళ్ళ పేర్లను చెప్పుకోవడం సిగ్గుచేటని సీతక్క విమర్శించారు.

కొనసాగిన అరెస్ట్‌ల పర్వం
చలో రాజ్‌భవన్ సందర్భంగా అరెస్ట్‌ల పర్వం కొనసాగింది. ఇందిరా పార్కు వద్ద ధర్నా అనంతరం చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్, నూతి శ్రీకాంత్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి నగరంలోని పలు స్టేషన్లకు తరలించారు.

రాజ్ భవన్‌ను ముట్టడించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
హైదరాబాద్ యూత్ అధ్యక్షులు మోతె రోహిత్ నేతృత్వంలో రాజ్‌భవన్ వద్ద జెండాలు ఎగురవేసి నేతలు నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ.. రాజ్‌భవన్‌లోకి దూసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వెంటపడి అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు తీవ్ర గాయాలు
రాజ్‌భవన్ మార్చ్ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అతి ఉత్సాహంతో వెంకట్ బల్మూర్‌ని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో అతడి పక్కటెముకలకు తీవ్ర గాయమవడంతో హుటాహుటిన సంఘటనాస్థలం నుండి ఆబిడ్స్ ఆదిత్యా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా పక్కటెముక ఫ్రాక్చర్ అయినట్లుగా డాక్టర్లు తెలపడంతో ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం యశోదా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అత్యుత్సాహంతో వెంకట్ తీవ్ర గాయాలపాలవ్యడంతో ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

పెగాసిస్ వ్యవహారంలో దోషులు బయటపడే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు కొనసాగిస్తాం: టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి
చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. పెగాసిస్ స్పైవేర్ నిఘాపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణ జరిపించాలని, న్యాయవిచారణ పూర్తయ్యే వరకు హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని రేవంత్ అన్నారు. పెగాసిస్ వ్యవహారంలో ప్రధాని కార్యాలయం పాత్రపై విచారణ చేయాలని రేవంత్ అన్నారు. పెగాసిస్ వ్యవహారంలో దోషులు బయటపడే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు కొనసాగిస్తామన్నారు. రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి రేవంత్ అభినందనలు తెలిపారు.

Police arrest Congress leaders at Raj Bhavan