Home జాతీయ వార్తలు పక్కా స్కెచ్‌తో ఎటిఎంల నుంచి లక్షలు కొట్టేశారు!

పక్కా స్కెచ్‌తో ఎటిఎంల నుంచి లక్షలు కొట్టేశారు!

బెంగళూరు: పక్కా ప్లాన్‌తో ఎటిఎం మిషన్ల నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన ఇద్దరు దొంగలను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరిని హర్యానాకు చెందిన షహీద్(23), షహజహద్(28)గా గుర్తించారు. బెంగళూరులో పనిచేస్తున్న ఈ ఇద్దరూ పగడ్బందీ పథకంతో బెంగళూరులోని అనేక ఎటిఎం కేంద్రాల నుంచి లక్షలాది రూపాయలు తస్కరించారు. ఇంతవరకూ ఎవరూ కనిపెట్టని కొత్త తరహాలో వీరిద్దరూ ఎటిఎంల నుంచి డబ్బు లాగేస్తారు. అదెలాగంటే&మొదట సెక్యురిటీ గార్డు లేని ఎటిఎం సెంటర్‌ను ఎంచుకుంటారు. అది కూడా జనసమ్మర్ధం తక్కువగా ఉండే ప్రాంతాన్నే చూసుకుంటారు. ఆ తర్వాత ఎటిఎంవైపు చూసే సిసిటివి కెమెరాను పక్కకు తిప్పుతారు. ఎటిఎం మిషన్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి ఒరిజినల్ ఎటిఎం కార్డునే ఉపయోగిస్తారు. ఎటిఎం మిషన్ డబ్బును విడుదల చేసే సమయంలో ఇద్దరిలో ఒకడు నోట్లను బయటకు రానివ్వకుండా పట్టుకుంటాడు. దీంతో మిషన్‌లో ఎర్రర్ అనే మెసేజ్ వస్తుంది.

ఈ సమయంలోనే ఇంకొకడు ఎటిఎంకు కరెంట్ సరఫరాను స్విచాన్ చేస్తాడు. వెంటనే నోట్లను పట్టుకున్న వ్యక్తి వాటిని మిషన్ నుంచి బయటకు లాగేస్తాడు. డబ్బును బయటకు విడుదల చేసే సమయంలో ఎటిఎం మిషన్‌కు కరెంట్ కట్ కావడంతో ఆ కార్డుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో డబ్బు డెబిట్ అయినట్లు చూపించదు. ఇంత పగడ్బందీగా సాగుతున్న వీరి చోరీల పరంపరకు శనివారం పోలీసులు అడ్డుకట్టవేశారు. అసలు ఇది బయట పడడం కూడా విచిత్రంగా జరిగింది. ఎటిఎం సెంటర్‌ను సందర్శించిన ఒక బ్యాంకు మేనేజర్ సిసిటివి కెమెరా పక్కకు తిరిగి ఉండడాన్ని చూసి అనుమానించారు. వెంటనే పోలీసుల సాయంతో ఆ ఎటిఎం ఉన్న పరిసరాలలో నిఘా ఏర్పాటు చేశారు. అదే తరహాలో ఎటిఎం సెంటర్ నుంచి డబ్బు దొంగిలించడానికి వచ్చిన ఆ ఇద్దరినీ పోలీసులు వలవేసి పట్టుకున్నారు. వీరిద్దరూ ఒక్క బెంగళూరు నగరంలోనే కాక దేశవ్యాప్తంగా ఈ తరహా చోరీలతో కొన్ని లక్షల రూపాయలు కొట్టేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనేక బ్యాంకులను ఈ ఇద్దరూ మోసం చేసి లక్షలాది రూపాయలు చౌర్యం చేశారని సిఐ మొహమ్మద్ ముకర్రం తెలిపారు.

Police arrest two for stealing cash from ATM