Home వరంగల్ పోడు, సాగు, కౌలు రైతులకు తీరని అన్యాయం

పోడు, సాగు, కౌలు రైతులకు తీరని అన్యాయం

Police arrested kodandaram in Warangal

మన తెలంగాణ/ ఎల్కతుర్తి : ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఇది ఆరంభం మాత్రమేనని, ఆగేది కాదని జనసమితి పార్టీ అధినేత ప్రొఫేసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని, తగిన న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, ప్రజాఫ్రంట్, జనసమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా భద్రాద్రి నుంచి కరీంనగర్ వరకు సడక్ బంద్ పేరుతో నిర్వహించే జాతీయ రహదారి దిగ్భంధన కార్యక్రమానికి కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫేసర్ కోదండరామ్ ప్రభుత్వ పథకాలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం ప్రచారాలకు కోసం చేస్తున్న ఆర్భాటానికి చేసిన ఖర్చుతో 2లక్షల12వేల ఎకరాలకు డబ్బులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటే పోడు రైతులకు ఉపయోగపడేవని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక ఏమిటంటే ఇందులో రూ. 70లక్షలు తీసుకున్న రైతులు ఉన్నారని, రూ. 50లక్షలు, రూ. 25లక్షలు తీసుకున్న రైతులతో పాటు రూ. 100 తీసుకున్న రైతులు వందల మంది ఉన్నారని చెప్పారు. హేమాహేమీలైన రామలింగరాజు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, క్రికెటర్ సచిన్‌టెండూల్కర్ లాంటి వారు ఉండడం ఈ పథకం ప్రత్యేకతన్నారు. నిజంగా రైతుబంధు పథకం భూమి దున్నుకునే రైతులకు మాత్రమే ఇవ్వాలన్నారు. తుమ్మలు మొలిచిన భూములకు, నాలా కింద మార్చిన లే అవుట్ భూములకు, ఇంకా మెదక్ జిల్లాలో సోలార్ ప్లాంటు పెట్టిన భూమికి సైతం పైసలు వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదో సమస్యతో పట్టా తీసుకోని వారికి, చిన్న రైతులకు తరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి న్యాయం చేస్తారా? చేయరా? అని తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. అటవీ భూములు దున్నుకుంటున్న రైతులకు, కౌలు చేసుకుంటున్న రైతులకు ఈ పథకం వర్తించదా అని, వీరికి న్యాయం చేయరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజమైన రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సడక్‌బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే ఖమ్మం భద్రాద్రి నుంచి కరీంనగర్ వరకు జాతీయ రహదారి దిగ్భంధనాన్ని చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఆందోళన ఈ రోజుతో ఆగిపోయేది కాదని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రికార్డుల ప్రక్షాళనతో పట్టాలు ఇచ్చామంటున్నారు కానీ రికార్డుల ప్రక్షాళలన పేరుతో ఉన్న భూములను ఊడగొడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డుల్లో చిన్న చిన్న తప్పులు దొర్లాయని సీఎం చెబుతున్నాడని, కానీ ఏకంగా హక్కుదారు భూములను ఇతరుల పేర్ల మీదకు నమోదు చేసేంతగా పెద్ద తప్పులున్నాయని వెల్లడించారు. ఈ రైతుబంధు పైసలేందోగానీ భూ రికార్డుల కోసం పెట్టిన ఖర్చులో పావలా వంతు కూడా రావడం లేదని రైతులు మొత్తుకుంటున్నారని తెలిపారు. రికార్డుల సవరింపులో రైతులు చేసుకున్న దరఖాస్తులను వారంలోగా సరి చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఖరీఫ్ సమయం ఆసన్నమైందని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందించాలని కోరారు. అవినీతికి పాల్పడకుండా, రైతుల వద్ద లంచాలు తీసుకోకుండా, ఇలాంటి ఫిర్యాదులు వినిపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెట్టిన ఖర్చుకంటే రూ. 1వెయ్యి తక్కువగా మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తోందని, దీని ద్వారా రైతులు అన్యాయానికి గురవుతున్నారన్నారు.

సరైన గిట్టుబాటు ధర చెల్లించకుంటే రైతుబంధు పథకం ఒక ప్రహసనంగా మారిపోతుందని చెప్పారు. మా గొంతు నొక్నేందుకు ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతోందని, తాము ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం గొంతెత్తుతామని స్పష్టం చేశారు. సడక్‌బంద్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న రైతులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని, భీమదేవరపల్లి, హూజూరాబాద్, హసన్‌పర్తి మండలాల్లో రైతులను రానివ్వకుండా పోలీసులు అరెస్టులు చేశారని, వారిని విడుదల చేయాలని కోరారు. తెలంగాణ సాధన కోసం రోడ్లమీద కూర్చుంటేనే సాధ్యమైందని, ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదకు వస్తే అడుగడుగునా అడ్డు తగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే తమ పోరాటం తీవ్రం కానుందని హెచ్చరించారు.
రైతుబంధు అక్షరాల రాబందుల పథకమే: చాడ వెంకటరెడ్డి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అక్షరాల రాబంధుల పథకంగా మారిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఎల్కతుర్తిలో జరిగిన రహదారి దిగ్భంధన కార్యక్రమానికి హాజరైన చాడ మాట్లాడుతూ ఏకపక్ష, నియంత పరిపారనను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నాడని, ఒక పక్క ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదన్నారు. రైతులకు ఇచ్చిన రూ. 1లక్ష రుణమాఫీ బోగస్, మోసపూరిత పథకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు వడ్డీ అలాగే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళన పేరుతో భూ బకాసురులకు, రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండించాడని ఆరోపించారు. పాసుబుక్కుల్లో 20శాతం మాత్రమే తప్పులు ఉన్నాయని సీఎం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్ని పాసుపుస్తకాల్లో ఏదో ఒక తప్పు కనిపిస్తోందన్నారు. అవన్నీ బోగస్ పాసుపుస్తకాలని, తప్పుల తడక బుక్కులని అభివర్ణించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆదేవన వ్యక్తం చేశారు. వారిని ఆదుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు రూ. 5లక్షల బీమా అంటూ రైతుల చావు కోరుతున్నాడని ఆరోపించారు. ఉన్న రైతులను ఎలా బతికించాలో చూడాలని సూచించారు. రైతుబంధు పథకం మాటల మాంత్రికుని లాగా, గారడీ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేసేందుకు ఎన్నికల జిమ్మికులాగానే ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వం సొమ్మును తన పేరుతో పంచుతూ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. సీఎంకు చేతనైతే ఆల్‌పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించాలని, రైతుబంధు పథకంలో ఎంత మోసం జరుగుతుందో ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. ప్రతిపక్షాలంటే సీఎం కేసీఆర్‌కు గిట్టదని, అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత తనకు ఎదురులేదని, తిరుగులేదని, తానే సర్వస్వం అని అనుకుంటున్నాడన్నారు. కానీ చమలన్నీ కలిసి పాములు సైతం పంచే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి జైళ్లలో పెట్టాడని, సీఎంకు కూడా కంకెళ్లు వేసే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కలిసి రైతులను నిలువునా ముంచుతున్నాయని, మద్యదళారీ దోపిడి విపరీతంగా పెరిగిపోయిందని, రైతులపై జరుగుతున్న దోపిడి అంతం కావాలంటే రైతులంగా సంఘటితం కావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు.
కోదండరామ, చాడల బలవంతపు అరెస్టులు
రోడ్డు దిగ్భంధన కార్యక్రమానికి హాజరైన జనసమితి అధినేత ప్రొఫేసర్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలను పోలీసులు, అదనపు బలగాల సాయంతో తోపులాట మధ్య బలవంతంగా అరెస్టు చేశారు. వీరిని వాహనాల్లో ఎక్కించి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా జనసమితి, సీపీ ఐ నాయకులు వారి వాహనాలకు అడ్డుగా పడుకుని ప్రభుత్వానికి, సీఎంకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక సందర్భంలో లాఠీచార్జి జరుగుతుందేమోనని భయాందోళనలు నెలకొన్నాయి. అడ్డుపడిన వారిని రోడ్డు పక్కకు లాగేసి కోదండరామ్, చాడలను హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా సీపీఐ, సీపీఎం, ప్రజాఫ్రంట్, జనసమితి నాయకులు, కార్యకర్తలను వాహనాల్లో ఎల్కతుర్తి, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ల్‌కు తరలించారు.
జనసమితి నాయకుని ఆత్మహత్యా యత్నం
ఎల్కతుర్తిలోని బస్టాండ్ ప్రాంతంలోగల జాతీయ రహదారిపై జరిగిన సడక్‌బంద్ కార్యక్రమంలో ప్రొఫేసర్ కోదండరామ్‌ను పోలీసులు బలవంతంగా లాగేస్తూ వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెం దిన మోరె గణేష్ అనే కార్యకర్త వెంట తెచ్చుకున్న కిరోసిన్ బాటిల్‌ను ఓపెన్ చేసి తనపైన కుమ్మరించుకున్నాడు. ఈ సమయంలో తోపులాట చోటుచేసుకోడంతో కిరోసిన్ పక్కనున్న అందరిపై పడింది. అంతటి తో ఆగకుండా అగ్గిపుల్లను వెలిగించే ప్రయత్నం చేయడంతో పక్కనున్న వారు అడ్డుకున్నారు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తానికి ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు చేపట్టిన సడక్‌బంద్‌ను అర్థాంతరంగా పోలీసులు భగ్నం చేశారు.