Home జాతీయ వార్తలు పోలీసు కుటుంబాలకు విముక్తి

పోలీసు కుటుంబాలకు విముక్తి

కిడ్నాప్‌చేసి విడిచిపెట్టిన  మిలిటెంట్లు
కశ్మీర్‌లో ఉగ్రవాదుల కొత్త పంథా

Terrorist

శ్రీనగర్: కాశ్మీర్‌లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన 11 మంది పోలీసుల కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి విడిచి పెట్టారు. తాము అరెస్టు చేసిన దాదాపు డజను మంది ఉగ్రవాదుల బంధువులను పోలీసులు విడిచి పెట్టడంతో మిలిటెంట్లు కూడా పోలీసుల కుటుంబ సభ్యులను విడిచిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమ్మూ, కాశ్మీర్ పోలీసులో పని చేస్త్తున్న వారికి చెందిన బంధువుల్లో కనీసం ఏడుగురిని మిలిటెంట్లు గురువారం రాత్రి షోపియాన్, కుల్గాం, అనంత్‌నాగ్ అవంతిపోరా ప్రాంతాల్లో కిడ్నాప్ చేసినట్లు ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన పోలీసు అధికారులు చెప్పారు.

అంతకు ముందు రోజుసైతం మరో నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. కాగా పోలీసులు విడిచిపెట్టిన వారిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్‌గా చెప్పుకొంటున్న రియాజ్ నైకో తండ్రి అసదుల్లా నైకో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత బుధవారం మిలిటెంట్ల దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందిన తర్వాత పోలీసులు మిలిటెంట్ల బంధువుల ఇళ్లపై దాడి చేసి దాదాపు డజను మందిని అరెస్టు చేశారు.

వీరిలో అసదుల్లా నైకో కూడా ఉన్నారు. పోలీసులు మిలిటెంట్లకు చెందిన రెండు ఇళ్లకు సైతం నిప్పు పెట్టారు. దీనికి ప్రతీకారంగానే మిలిటెంట్లు పోలీసుల కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఎన్‌ఐఏ అధికారులు కరుడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ రెండవ కుమారుడ్ని రాష్ట్రంలో అరెస్టు చేసిన రోజునే ఈ కిడ్నాప్‌లు చోటు చేసుకోవడం గమనార్హం