Home తాజా వార్తలు హోలీపై పోలీస్ నిఘా

హోలీపై పోలీస్ నిఘా

HOLI

రెండురోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు
గుంపులుగా వాహనాలపై వెళ్లరాదంటున్న అధికారులు
ఎంలాంటి అవాంఛనీయ సంఘనలు చోటు చేసుకోకుండా ముందుస్తు జాగ్రత్తలు

మన తెలంగాణ/సిటీబ్యూరో : హోలీ పండగను పురష్కరించుకుని నగరం, శివారు ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తల్లో ఉన్నారు. ముఖ్యంగా సున్నితమైన ప్రదేశాలుగా భావిస్తున్న చోటుల్లో పోలీసుల పికెటింగ్‌ను చేపట్టాలని భావిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఉదయం నుండే ముఖ్యంగా ప్రధాన రోడ్లపైనే దృష్టిసారించనున్నారు. ఢిల్లీలో కొందరు యువకులు హోలీ పేరుతో వికృత చేష్టలు చేసినట్టు ప్రచారం సాగుతుండటం, నగర యువత కూడా ఇటీవల విపరీతంగా జోష్‌లకే పెద్దపీట వేయడం నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమైనట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. గుంపులుగా వాహనాలపై వెళ్లరాదని, ప్రజలపై, ప్రజలు అధికంగా చేరే ప్రదేశాలకు చేరి రం గులు చల్లడం, పోయడం వంటి అల్లరి చేయరాదంటూనే నిషేధ ఉత్తర్వులు జారీచేశారు. ప్రధానంగా ఓల్డ్‌సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైబరాబాద్ పరిధిలోని సంపన్న వర్గాలుండే ప్రాంతాల్లోనే అధిక దృష్టిసారిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

మద్యం దుకాణాలపై : హోలీ పండుగని దృష్టిలోపెట్టుకుని పోలీసు అధికార యంత్రాంగం మద్యం దుకాణాలు, బార్లును రెండురోజుల పాటు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరి 28 సా. 6 గం.ల నుండి మార్చి 2వ తేదీ ఉ. 6 గం.ల వరకు మద్యం దుకాణాలను తెరవరాదని ఆదేశించారు. పండగను ఉత్సాహంతో, వినోదపు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ముందుగానే పోలీసులు సూచిస్తున్నారు. బంద్‌గా ఉన్నప్పటికీ కొందరు అక్రమంగా విక్రయాలు జరిపితే కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఈ దుకాణాలపైన పెట్రోలింగ్ పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టినట్టు వెల్లడిస్తున్నారు.
షీటీమ్స్ : మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, వారికి గట్టి భరోసాను కల్పిస్తున్న షీటీమ్స్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. హోలీ సందర్భంగా బస్సుస్టాప్‌లు, బస్‌స్టేషన్‌లు చేరుకునే మహిళలపై పోకిరీలు రంగులు చల్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పోకిరీల ఆటకట్టించేందుకు షీటీమ్ బృందాలు ఆయా ప్రాంతాల్లో నిఘాపెట్టాయి. తరచూ మహిళా నేరాలు చోటుచేసుకుంటున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఉదయం నుండే పోలీసులను పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీని పెంచారు. ద్విచక్రవాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయడం, కేరింతలు పెట్టడం వంటివి చేసేవారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.