Home తాజా వార్తలు భూ వివాదాల్లో ‘పోలీసు’ జోక్యం

భూ వివాదాల్లో ‘పోలీసు’ జోక్యం

telangana policeబాధితులకు పోలీసు బాసుల భరోసా, అవినీతి పోలీసులకు అటాచ్‌మెంట్ ట్రీట్‌మెంట్

హైదరాబాద్ : అడ్డదారిలో ఆర్జించేందుకు పోలీసులు భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న వైనంపై పోలీసు బాసులు సీరియస్‌గా చర్యలు చేపడుతున్నారు. పోలీసు బాధితుల బాధలపై విచారణ చేపట్టి సదరు పోలీసులకు అటాచ్‌మెంట్ ట్రీట్‌మెంట ఇవ్వడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. తాజాగా వికారాబాద్ డిఎస్‌పి శిరీష రాఘవేంద్రను డిజిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి. డిఎస్‌పి శిరీష ఓ ప్రైవేట్ భూ వివాదంలో తలదూర్చడంలో బాధితులు నేరుగా డిజిపి మహేందర్‌రెడ్డిని కలిశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు డిఎస్‌పిపై చర్యలకు ఉపక్రమించారు. అదేవిధంగా వికారాబాద్ సిఐని పోలీసు ఉన్నతాధికారులు అధికారులు ఎస్‌పి కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం విదితమే.

వికారాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐ సీతయ్య పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడంతో అతన్ని ఎస్‌పి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కూకట్‌పల్లి సిఐ జానయ్య ఒక భూ వివాదంలో తనదైన శైలిలోని ప్రదర్శించడంతో బాధితులు నేరుగా డిసిపి వెంకటేశ్వరరావు, సిపి సజ్జనార్‌ను కలిశారు. ఎన్‌ఆర్‌ఐ జయరాం హత్యకేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడంలో నల్లకుంట్ల సిఐ శ్రీనివాసులు, ఇబ్రహీంపట్నం ఎసిబి మల్లారెడ్డిలు పూర్తిస్థాయిలో సహకరించినట్లు విచారణలో తేలడంతో వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు 11 మంది పోలీసు అధికారులు టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలిన విషయం తెలిసిందే.

అయితే ఆయా పోలీసుల పాత్ర ఇప్పటికీ విచారణ సాగుతోంది. హత్య జరిగిన వెంటనే రాకేష్‌రెడ్డి నలుగురు డిఎస్‌పి, నలుగురు సిఐలతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులను ఫోన్‌లో సంప్రదించి సలహాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం భారీ వేతనాలు ఇస్తున్నా అడ్డదారులు తొక్కుతూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు అర్రులు చాస్తున్నారని పోలీసు బాస్‌లు సీరియస్ అవుతున్నారు. పోలీస్ శాఖలో నీతినిజాయితీకి పెద్ద పీట వేయాలన్నా ఉన్నత సంకల్పాన్ని తూట్లు పొడుస్తున్నారు. లంచాలకు అలవాటు పడ్డ పోలీసుల కాసుల లీలలు వెలుగులోకి వచ్చిన వెంటనే ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో రియల్టర్లకు, రౌడీషీటర్ల అడుగులకు మడుగులొత్తిన పోలీసులపై దర్యాప్తు సాగుతున్న విషయం తెలిసిందే. రౌడీలతో పోలీసులు కుమ్మక్కై భారీ ఎత్తున భూదందాలు నిర్వహిస్తున్న వైనం నానాటికి వెలుగు చూస్తూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా హోంగార్డులకు నెలకు రూ.22వేల పై చిలుకు వేతనాలు ప్రభుత్వం ఇస్తున్న విషయం విదితమే. అలాగే ఎస్సైలకు, ఇన్స్‌స్పెక్టర్లకు సైతం భారీగా అధిక మొత్తాలను వేతనాలుగా అందుకుంటున్నారు.

అవినీతిని అరికట్టడం శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి కొందరు ఖాకీలు తమ కక్కుర్తి బుద్దితో నీరుగారుస్తుండటంపై పోలీసు ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిచేత్తో శాంతిభద్రలు కాపాడాల్సిన పోలీసులు లంచాల కోసం చేతులు చాచి ఆర్ధిస్తుండడం విచారకరం. కేసుల మాఫీ, కేసు తీవ్రతను తగ్గిస్తానంటూ మహేశ్వరం ఎస్సై ఓ దొంగను లంచం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఒక వాహనం విషయంలో రాయదుర్గం ఎస్సై శశిధర్ కేవలం రూ.2వేల కోసం చేతులు చాచి ఎసిబికి చిక్కిన విషయం తెలిసిందే. అలాగే హుమాయున్, మీర్ చౌక్, చిలకలగూడ, పంజగుట్ట, జూబ్లీహిల్స్ తదితర పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలు స్వల్ప మొత్తాలకు కక్కుర్తి పడి ఎసిబి వలలో చిక్కారు. వారెంట్లు, పాత కేసులను లోక్ అదాలత్‌లలో కొట్టివేయిస్తామంటూ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసే కొందరు కోర్టు కానిస్టేబుళ్లు ఇబ్బడి ముబ్బడిగా లంచాలు ఆర్జిస్తున్నారు.

ఏడేళ్లలోపు శిక్షపడే కేసులకు స్టేషన్ బేయిల్ ఇవ్వవచ్చు అనే సుప్రీం ఆదేశాలు పోలీసులకు వరంగా మారింది. కేసులు నమోదు చేసిన వారే స్టేషన్ బేయిల్ల పట్ల డబ్బులకు ఆశపడుతున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ చేసిన ఓ ఇన్స్‌స్పెక్టర్లలో ఒకరు గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని భూవివాదాలను పరిష్కరిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్ ద్వారానే ఆ ఇన్స్‌స్పెక్టర్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులు, నిందితులు ఇద్దరి నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతడికి ఓ ఉన్నతాధికారి అండదండలు ఉన్నట్లు తెలిసింది.ఇన్స్‌స్పెక్టర్ ఆగడాలు వేగలేక పలువురు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడంతో బదిలీ వేటువేశారు.

 

Police interference in land disputes