Home మంచిర్యాల వివాదాస్పదమవుతున్న పోలీస్ బాస్‌ల తీరు

వివాదాస్పదమవుతున్న పోలీస్ బాస్‌ల తీరు

డిసిపి కార్యాలయం ఎదుట శ్రీవాణి బంధువుల ధర్నా
ఆత్మహత్యలు జరుగుతున్నా మారని తీరు
పోలీసుల వేధింపులతోనే సింగరేణి కార్మికుని ఆత్మహత్య
మరో కేసులో యువతి ఆత్మహత్యాయత్నం
ఎసిపి బెదిరింపులే కారణమని యువతి సూసైడ్ నోట్
పలు వివాదాల్లో తలదూరుస్తున్న పోలీసు అధికారులు
సిఎంకు ఫిర్యాదు చేసినా జరగని ప్రక్షాళన

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసు పేరుతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుండగా జిల్లాలో పోలీసుల తీరు  వివాదాస్పదంగా మారుతోంది. 

            Police

మంచిర్యాల ప్రతినిధి: రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసు పేరుతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుండగా జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. గత నెల రోజులుగా పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు పలు కేసుల్లో వివాదాస్పదంగా మారారు. పోలీసుల వైఖరిపై కొందరు బాధితులు స్వయంగా సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల వైఖరిలో మార్పులు కనిపించడం లేదు. పోలీసుల వేధింపులు, బెదిరింపులను భరించలేక ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించు కోకపోవడంతో సంఘటనలు పునరావృతమవుతున్నాయి.

బెల్లంపల్లి ఎసిపి సతీష్‌పై చర్యలు తీసుకోవాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి శ్రీవాణి కుటుంబీకులు శుక్రవారం మంచిర్యాల డిసిపి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నకిలీ విత్తనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రేమపెళ్లి వ్యవహారాల్లో తలదూర్చిన పోలీస్‌బాస్‌లు వివాదాస్పదంగా మారగా వారి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇందులో ఎసిపి స్థాయి అధికారులు ఉండగా ప్రభుత్వం వారిపై క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. పోలీస్ బాస్‌ల తీరును ప్రజాప్రతినిధులు సైతం తప్పుపడుతూ స్వయంగా సిఎంకి ఫిర్యాదు చేస్తున్నారు.

జిల్లాల్లో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటనలు కలకలం రేపుతున్నాయి. జైపూర్ మండలం, రామరావుపేట గ్రామానికి చెందిన జంబి రాజయ్య అనే సింగరేణి కార్మికుడు అదే గ్రామానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి పశువుల వ్యవహారంలో గొడవ పడ్డాడు. దీంతో దుర్గయ్య భార్య లక్ష్మి తనపై అత్యాచార యత్నానికి పాల్పడినాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా జైపూర్ ఎసిపి కవిత ఎలాంటి విచారణ చేయకుండానే కనీసం రాజయ్య వృద్ధుడని చూడకుండా అత్యాచారయత్నం కేసు నమోదు చేశారు.

రాజయ్యను జైలుకు వెళ్తావని బెదిరించడంతో మానసికంగా భయాందోళనకు గురైన రాజయ్య, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎంఎల్‌ఎ నల్లాల ఓదెలు పోలీసుల వైఖరిని తప్పుపడుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

రాత్రికి రాత్రే విచారణ జరపకుండా వృద్ధునిపై అత్యాచారయత్నం కేసు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. మందమర్రి పట్టణానికి చెందిన శ్రీవాణి కులాంతర వివాహం సంఘటనలో ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెల్లంపల్లి ఎసిపి సతీష్, తాజాగా యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం పోలీసుశాఖ మెడకు చుట్టుకునే విధంగా మారింది. సాగర్ అనే యువకునితో కులాంతర వివాహం చేసుకున్న శ్రీవాణి కాపురం పది రోజులు కూడా నిలువలేదు. భర్త సాగర్ తనను బలవంతంగా బెదిరించి పెళ్లి చేసుకున్నాడని, అతనితోపాటు అతని మిత్రులు అసభ్యకరమైన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో మనస్తాపం చెందిన యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

ఈ మేరకు సదరు యువతి తన చావుకు బెల్లంపల్లి ఎసిపి సతీష్ కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఎసిపి తన పట్ల అసభ్యకరంగా మాట్లాడి సాగర్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నాడని పేర్కొన్నారు. అంతే కాకుండా పోలీస్ అధికారులు నకిలీ విత్తనాల వ్యవహారంలో వ్యాపారుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారని, రియల్ వ్యాపారాల్లో తలదూర్చి లక్షలాది రూపాయలు మామూళ్లుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ బాస్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. జిల్లాలో పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారం దిన దినానికి మరింత వివాదాస్పదంగా మారుతోంది.