Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఏజెన్సీలో పోలీస్ పహారా

ఏజెన్సీలో పోలీస్ పహారా

PLSH

ఆరు రోజులుగా కొనసాగుతున్న పహారా
శాంతి కమిటీల ఏర్పాటుతో భద్రతల పరిరక్షణ
గిరిసీమలో ఐజి, కమిషనర్, ఎస్‌పిల మకాం

సిర్పూర్(యు): గతంలోఎన్నడూలేని విధంగా గిరిజన ప్రాంతం పోలీసు పహారాలో కొనసాగుతోంది. రాత్రింబవళ్లు కంటికి నిద్రలేకుండా శాంతి భద్రతల కోసం గ్రామాల్లోనే ప్రత్యేక పోలీసు బలగాలు మకాం పెట్టడంతో క్రమంగా పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఏజెన్సీలో గత 56 రోజులుగాకొనసాతున్న ఆందోళనలు, ఉద్యమాలు ఒక ఎత్తు కాగా, 5 రోజుల కిందట జరిగిన ఒక సంఘటనతో పరిస్థితి చేజారడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పోలీసులను మోహరించింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసు అధికారులు కూడా గిరిజన ప్రాంతాలను సందర్శించడమే కాకుండా ఐజి స్థాయి పోలీసు అధికారులు, రామగుండం కమిషనర్, జిల్లా ఎస్‌పిలు కూడా పల్లెల్లో మకాం పెట్టారు. ఈ నెల 15న జరిగిన ఆందోళనల నేపథ్యంలో జైనూర్ సర్కిల్ పరిధిలోని లింగాపూర్, సిర్పూర్(యు), జైనూర్ మండలాల్లో 144 సెక్షన్ విధించారు.
మూడు రోజులు మార్కెట్ బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడగా, మంగళవారం నుంచి పరిస్థితులు కాస్త మెరుగుపడగా,బుధవారం కొన్నిచోట్ల కార్యకలాపాలు యధావిధిగా కొనసాగిసట్లు తెలుస్తోంది.
అన్నీ తామై ముందుకెళ్తున్న పోలీసులు
ఏజెన్సీలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో పోలీసుశాఖ అన్నీ తామై ముందుకెళ్తోంది. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెల కొల్పేందుకు వరుస పర్యటనలు జరుపుతున్నారు. ఉదయం లేచినది మొదలుకొని రాత్రివరకు పల్లెల్లోనే సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా మారారు. గ్రామ పటేళ్లు, యవజన సంఘాలు, గిరిజన సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నారు. వారం పది రోజులుగా జనజీవనం స్తంభించిన నేపథ్యంలో పోలీసుశాఖ పూర్వ వైభవానికి నడుం బిగించింది.
జిల్లా అధికారుల వరుస సమీక్షలు
పరిస్థితులను చక్కబెట్టేందుకు పోలీసు శాఖతోపాటు ఆసిఫాబాద్ నూతన కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, రామగుండం కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్, జిల్లా ఎస్‌పి కల్మేష్వర్ హింగనవార్, జాయింట్ కలెక్టర్ తదితర అధికారులు మూడు మండలాల్లో ప్రత్యేక శాంతి కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. జనం పడుతున్న ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని శాంతియుత వాతావరణంలో తమతమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. సిర్పూర్(యు) మండల కేంద్రంలో ఈ మేరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి శాంతికమిటీల మార్గదర్శక సూత్రాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఇరువర్గాలతో వేర్వేరుగా సమావేశాలను ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. నెల రోజులుగా మూతపడిన పాఠశాలలు తిరిగి పనిచేసేలా చూడాలని, అలాగే గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న అభద్రత రూపుమాపి శాంతియుత పరిస్థితుల నెలకొల్పేందుకు కమిటీలు సహకరించాని కోరారు. జిల్లా పోలీసుశాఖ ఆధర్యంలో జైనూర్, లింగాపూర్ , సిర్పూర్(యు) మండలాల్లో గిరిజనులతో ప్రతేక సమావేశాలు నిర్వహించి గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ చేపట్టారు. శాంతికి అందరు సహకరించాలని ఇరువర్గాల వారితో ప్రతిజ్ఞ చేయించారు.
ఆందోళనల నేపథ్యంలోబస్సులు తిరగకపోగా ఆరు రోజులుగా ఇంటర్‌నెట్ సేవలు సైతం స్తంభించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పాఠశాలల్లో హాజరు శాతం పూర్తిగా తగ్గిపోయింది. వివిధ నిత్యవసరాల నిమిత్తం మండల కేంద్రాలకు వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థ ఇతర పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అంతర్జాల సేవలు నిలిచిపోగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచి దస్త్రాలు ముందుకు సాగడంలేదు. మొత్తానికి పోలీసు అధికారుల పటిష్టమైన చర్యలకు మరో రెండు రోజుల్లో పరిస్థితులు చక్కబడితే కార్యకలాపాలు యధావిధిగా కొనాసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.