Friday, March 29, 2024

ఆ తల, చేతులు శ్రద్ధావేనా ?

- Advertisement -
- Advertisement -
పోలీసులకు సవాల్‌గా మారిన సాక్షాధారాల సేకరణ

న్యూఢిల్లీ : శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన వివరాలతో మృతురాలి శరీర భాగాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లోనే గతంలో దొరికిన గుర్తు తెలియని మృతదేహాలు, శరీర భాగాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కాగా.. శ్రద్ధా హత్య జరిగిన కొద్ది రోజులకే తూర్పు ఢిల్లీలో ఓ చోట కుళ్లి పోయిన స్థితిలో తల, చేతులు లభించినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ విషయం తాజాగా బయటికొచ్చింది. మే 18న ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా హత్యకు గురైంది. ఈ ప్రాంతానికి కొద్ది దూరం లోనే ఉన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ ఏడాది జూన్‌లో కొన్ని గుర్తు తెలియని శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. పాండవ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని రామ్‌లీలా మైదానానికి సమీపంలో చెత్తకుప్పలో కుళ్లి పోయిన స్థితిలో ఉన్న మనిషి తలను చేతులను పోలీసులు, ఫోరెన్సిక్ బృందం గుర్తించారు. అక్కడ పడేయడానికి ముందు ఆ శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపర్చినట్టు అప్పటి ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.

అవి ఒకే మృతదేహానికి చెందినవి అయి ఉంటాయని అప్పట్లో పోలీసులు భావించినా, వాటిని ఎవరు పడేశారా అని తెలుసుకోడానికి సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఈ కేసులో ఎలాంటి పురోగతి లభించక పోవడంతో తదుపరి దర్యాప్తు కోసం కేసును దక్షిణ ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. శ్రద్ధా హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ అవయవాలను గుర్తించడంతో ఇప్పుడు పోలీసులు ఆ కేసుపై దృష్టి పెట్టారు. తూర్పు ఢిల్లీలో లభ్యమైన తల, చేతుల భాగాలను డిఎన్‌ఎ పరీక్షలకు పంపించారు. అవి శ్రద్ధావేనా ? కాదా? అన్నది ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

కాగా, హత్య అనంతరం ఆమెను గుర్తించడానికి వీల్లేకుండా తల భాగాన్ని కాల్చేసిన తర్వాత పారేసినట్టు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది.శ్రద్ధాను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికిన తర్వాత వాటిని ఢిల్లీ లోని పలుచోట్ల విసిరేసినట్టు నిందితుడు అఫ్తాబ్ పోలీసుల విచారణలో అంగీకరించిన విషయం తెలిసిందే. ఎక్కువగా మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేసినట్టు చెప్పడంతో నిందితుడిని తీసుకుని అక్కడ వెతకగా, ఇప్పటివరకు 10 కి పైగా ఛిద్రమైన భాగాలు దొరికాయి.

అయితే అవి శ్రద్ధావేనా ? లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో ఇప్పటివరకు శ్రద్ధా తలను పోలీసులు గుర్తించలేదు. దీంతోపాటు ఆమెను చంపినట్టుగా భావిస్తున్న ఆయుధం, ఆమె దుస్తులను కనుగొనలేదు. హత్య జరిగిన నెలలు కావడంతో ఆమె శరీర భాగాలు ఇప్పటికే కుళ్లి పోవడమో లేదా వీధి శునకాలు తినేయడమో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ కేసు నిరూపణకు సాక్షాధారాల సేకరణ పోలీసులకు సవాల్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News