Home కరీంనగర్ పన్నెండు గంటల్లో చోరి కేసును చేధించిన పోలీసులు

పన్నెండు గంటల్లో చోరి కేసును చేధించిన పోలీసులు

 Robbers

 

కరీంనగర్ : చోరి జరిగిన కేవలం 12 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. ఇరువురు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం రోజు కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ రూరల్ ఎ.సి.పి  టి.ఉషారాణి వివరాలను తెలియజేశారు. ఆమె కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన కురగాయాల రమేష్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరి జరిగింది. ఇంట్లోని వారంతా సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళగా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన కుర్ర శ్రీనాథ్ అలియాస్ శ్రీనివాస్, ఎస్.కె.నూర్‌అలీ అలియాస్ శివ అనే ఇరువురు వ్యక్తులు రమేష్ ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోనికి ప్రవేశించి బీరువాలో దాచిన రూ.2.60 లక్షల నగదును అపహరించుకుపోయారు.

రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూసిన రమేష్ కుటుంబసభ్యులకు ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లో చోరి జరిగిందని గమనించి లబోదిబోమంటూ ఇంట్లోకి వెళ్ళి చూసే సరికి బీరువాలో దాచిన నగదు అపహరణకు గురైనట్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు సమచారం అందివ్వడంతో వారు డాగ్‌స్కాడ్, వేలిముద్రల నిపుణులతో వెళ్ళి పరిశీలించారు. వెంటనే ప్రత్యేక బృందం పోలీసులతో విచారణ చేపట్టి కేవలం 12 గంటల వ్యవధిలోనే ఇదే బావుపేట వద్ద కుర్ర శ్రీనాథ్, శివలను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి రూ.66 వేల నగదును పోలీసులు రికవరీ చేశారు. కేసును కేవలం 12 గంటల వ్యవధిలో చేధించిన కరీంనగర్ రూరల్ సిఐ తుల శ్రీనివాస్, ప్రత్యేక పోలీసు బృందం సభ్యులు సుధాకర్, ఆశోక్‌లను ఎసిపి ఉషారాణి అభినందించారు.

ఈ సందర్బంగా ఎ.సి.పి మాట్లాడుతూ.. ఇంట్లో నుండి బయటికి వెళ్ళే సమయంలో ఇంట్లోని డబ్బులు గాని బంగారు అభరణాలు గాని ఇతర విలువైన వస్తువులను బ్యాంకులో దాచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇంటికి సంబంధించిన తాళాలు అందుబాటులో ఉంచకుండా వెంట తీసుకువెళ్ళాలని అన్నారు. అదేవిధంగా ఈ కేసును చేధించడంలో సిసి కెమెరా పుటేజీలు కీలకపాత్ర పోషించినట్లు ఆమె పేర్కొన్నారు. కాబట్టి సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రజలు తమవంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ రూరల్ సిఐ తుల శ్రీనివాస్‌రావు, కొత్తపల్లి ఎస్.ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Police who Arrested the Robbers