Home ఎడిటోరియల్ సంపాదకీయం: ‘ఫేస్’ కోల్పోయిన ‘ఫేస్‌బుక్’

సంపాదకీయం: ‘ఫేస్’ కోల్పోయిన ‘ఫేస్‌బుక్’

sampadakeyam

ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులంటారు. ఎందుకంటే ఓటర్లు తమ  విచక్షణనుపయోగించి తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే సిద్ధాంతాలు వెనక్కుపోయి ధనబలం, కండబలం, కుల, మత ప్రభావాలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ టెక్నాలజీ మరో ముప్పుగా తయారైనట్లు ప్రస్తుతం తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన ‘ఫేస్‌బుక్’ నుంచి పెద్ద ఎత్తున వ్యక్తుల సమాచార లూటీ ఉదంతం వెల్లడిస్తున్నది. అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా 200కోట్లమంది వినియోగదారులను సంపాదించిన ఫేస్‌బుక్ అతిపెద్ద మీడియా’గా ప్రాచుర్యం పొందింది. వారంతా తమ వ్యక్తిగత సమాచారాన్ని తమ ఫేస్‌బుక్ అక్కౌంట్లలో పొందుపరిచారు. ఖాతా తెరవటానికి తప్ప దాని ఇతరత్రా ప్రయోజనాలేమిటో అత్యధికులకు తెలియదు. తమకు తోచిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై పోస్టింగ్‌లు పెట్టటం, మిత్రుల్ని సంపాదించుకోవటం వంటి ప్రయోజనాలే వారికి తెలుసు. కొన్ని సమస్యలపై ప్రజలను చైతన్యపరచటానికి, ఆందోళనల కొరకు ప్రజల సమీకరణకు ఈ మీడియా ఉపయోగపడుతున్నది.

అయితే టెక్నాలజీ రెండంచుల పదునుగల కత్తి అని మరోసారి రుజువైంది. వ్యక్తుల సమాచారాన్ని విశ్లేషించి, వారి అభిరుచులనుబట్టి ప్రచార, ప్రలోభ పద్ధతులు రూపొందించి, తాము కాంట్రాక్టు తీసుకున్న పార్టీలకు లేక అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే సంస్థలు పనిచేస్తున్నాయని వెల్లడైంది. బ్రిటిష్ కంపెనీ ఎస్‌సిఎల్ గ్రూపుకు అమెరికాలో అనుబంధ సంస్థ కేంబ్రిడ్జి ఎనలిటికా(సిఎ). అది ఫేస్‌బుక్ నుంచి 5కోట్ల మంది అమెరికన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలత సృష్టించేందుకు పనిచేసినట్లు వెల్లడైంది. సిఎకు ఇటువంటి ప్రచార నిర్వహణలో పాతికేళ్ల అనుభవముందట. అమెరికాలోనేగాక థాయిలాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సైంట్ కిట్స్, నెవిస్, దక్షిణాఫ్రికా, కెన్యా, మలేసియా, ఇండోనేషియా, ఇటలీ, కొలంబో, భారత్‌ల్లో తమ క్లెంట్‌లవరకు రాజకీయ ప్రచారం నిర్వహించినట్లు దాని వెబ్‌సైట్ తెలుపుతున్నది. స్వేచ్ఛాయుత సమాచార వేదిక ఫేస్‌బుక్, ఇందులో ఎవరి జోక్యం ఉండదంటూ దాన్ని అధునాతన ప్రసార మాధ్యమంగా ప్రచారంలోకి తెచ్చిన దాని అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ తమ సర్వర్‌లనుంచి వ్యక్తుల సమాచార చౌర్యంపై అమాయకత్వం నటిస్తున్నాడు.

అది ఎవరి కొరకో, దేనికొరకో పనిచేస్తున్నదని ఇప్పుడు విదితమైంది. బ్రిటన్, అమెరికాలు సిఎ వివాదంపై దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది అమెరికన్ జర్నలిస్టులే. కస్టమర్లుగా కేంబ్రిడ్జి అనలిటికా సిఇఒ అలెగ్జాండర్ నిక్స్ (ఇప్పుడు సస్పెండ్ అయినారు)ను కలిసిన జర్నలిస్టులతో అతడు తమ కంపెనీ ఎలా సమాచారం సంపాదించిందో, ట్రంప్‌కు అనుకూలంగా ఎలా ఉపయోగించిందో గొప్పగా చెప్పుకున్నారు. ఆ సిడి విడుదల కల్లోలం సృష్టించింది. ప్రజాస్వామ్యంపై దాడిలో ఫేస్‌బుక్ పాత్ర ఉండడం మరో పెద్ద కుంభకోణం. సిఇఒ జుకెర్‌బర్గ్‌ను ప్రశ్నించటానికి పలువురు విలేకరులు సిలికాన్ వ్యాలీలోని ఫేస్‌బుక్ కేంద్ర కార్యాలయానికి వెళ్లగా వారిని కలవకుండా వెనక్కు పంపారు. ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా లు అవి చెప్పుకుంటున్నట్లు తటస్థ వేదికలు కావని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు, ఎవరి ప్రయోజనాల కొరకో దాన్ని ప్రభావితం చేసేందుకు పనిముట్లుగా పనిచేస్తున్నట్లు విదితమవుతున్నది.

ఈ కుంభకోణం ప్రభావం మనదేశంలో ప్రతిధ్వనించింది. సిఎ సేవలను ఉపయోగించుకున్నట్లు బిజెపి, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. సమాచార మంత్రిగా వాస్తవాలను దర్యాప్తు చేయించాల్సిన రవిశంకర్ ప్రసాద్ బిజెపి నాయకుడిలాగా కాంగ్రెస్‌పై దాడికి దిగారు. అయితే 2010బీహార్ ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షం జెడి(యు)ఎస్‌సిఎల్ అనుబంధ సంస్థ ఒబిఐ సేవలు ఉపయోగించుకున్నట్లు, 2014 ఎన్నికల్లో, అనేక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్ ప్రత్యారోపణ చేసింది. 2009 ఎన్నికల్లో రాజ్‌నాథ్‌సింగ్ ఉపయోగించుకున్నారట! ఒబిఐ అధిపతి బిజెపి మిత్రపక్షం జెడియు ఎంపి కెసి త్యాగి కుమారుడు అమ్రిష్ త్యాగి. అందువల్ల తప్పుత్రోవ పట్టించే నిందలు మానుకుని ప్రజలకు వాస్తవం తెలిసేలా భారత్‌లో అటువంటి చొరబాట్లపై సమగ్ర దర్యాప్తు ఆదేశించాలి.