Home జాతీయ వార్తలు శరద్ పవార్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ

శరద్ పవార్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ

Political strategist prashant kishor meets sharad

 

రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు

ముంబయి: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాలలో సరికొత్త ఊహాగానాలకు తెరతీసింది. పవార్ అధికారిక నివాసం సిల్వర్ ఓక్‌లో దాదాపు మూడు గంటలపాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం పూర్తి కాగా పవార్ కాని, ప్రశాంత్ కిశోర్ కాని విలేకరుల వద్ద పెదవి విప్పకపోవడం విశేషం. ఇటీవల జరిగిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఘనవిజయం సాధించిన డిఎంకె, టిఎంసిలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ఈ విజయాల తర్వాత ఆయన మొదటిసారి శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఇక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్ ఎన్‌సిపి అధినేతతో భేటీ కావడంపై రాజకీయ వర్గాలలో కొత్త చర్చను లేవనెత్తింది.

కాగా, ఈ సమావేశంలో ఎటువంటి ప్రాధాన్యత లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తేల్చివేశారు. తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా ఉండబోనని ప్రశాంత్ ఇదివరకే ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా&ప్రశాంత్ కిశోర్‌తో చాలా మంది నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించగా పవార్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీలోని అజెండా తనకు తెలియదని ఎన్‌సిపి నాయకుడు ఛగన్ భుజ్‌బల్ చెప్పారు. ప్రశాంత్ కిశోర్‌ను విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా ఆయన అభివర్ణిస్తూ ఆయన సలహాలను పవార్ పరిగణనలోకి తీసుకుంటారని భుజ్‌బల్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు 2019లో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో కూడా ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన విషయం తెలిసిందే.

Political strategist prashant kishor meets sharad pawar