Home ఎడిటోరియల్ ‘మహా’తో మారిన రాజకీయాలు!

‘మహా’తో మారిన రాజకీయాలు!

Maharashtra

 

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రకటించిన నెల తరవాత ఎట్టకేలకు అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఒక కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ప్రస్తుత రాజకీయ పరిస్థితి మారిపోవడమే. ఈ ప్రభుత్వం ఏర్పాటు ఓ విశిష్ట ప్రయోగం. ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ కూడా సంపాదించాయి. మామూలుగా అయితే ఈ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. అయితే అలా జరగలేదు. దానికి కారణం ఆ రెండు పార్టీలకే తెలుసు. చాలా కాలం నుంచి శివసేనకు ప్రత్యర్థులుగా ఉన్న, సైద్ధాంతికంగా విభేదిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొత్త ప్రయోగమే.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఒకే ధర్మానికి ఆధిపత్యంగల రాజకీయాలు నడుపుతోంది. ఈ కొత్త ప్రయోగం ఈ ధోరణికి విరుద్ధమైందే. ఇలా కొత్త ప్రభుత్వంపై నిరాశావాద ధోరణి ప్రదర్శించడం, పచ్చి అవకాశవాదం అని నిందించడం ప్రస్తుత రాజకీయ సందర్భాన్ని విస్మరించడమే అవుతుంది. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తున్న కొందరి భయాందోళనల్లో నిజం లేదని అనలేం కానీ క్రియాశీల రాజకీయాలలో ఆచరణాత్మకత అనివార్యం. ఒక వేళ ఇలాంటి ఆచరణాత్మక విధానం అనుసరించకపోతే ఇతర శక్తులు ఆ స్థానాన్ని ఆక్రమిస్తాయి. అంటే బిజెపి ఏదో ఒక రకంగా అధికారం సంపాదించడానికి అవకాశం వచ్చేది. ఆ పని చేయకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు పక్షాలకూ నష్టం కలిగించేది అన్న విషయాన్ని పక్కన పెట్టినా అణగారిన వర్గాలకు సామాజికంగా విపరీతమైన నష్టం కలిగేది. అందువల్లే ఈ ఎత్తుగడ సవ్యమైందే అనిపిస్తుంది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత ఈ మూడు పక్షాలు మిన్నకుండా ఉండి పోవడానికి బదులు ఎన్.సి.పి. అధ్యక్షుడు శరద్ పవార్ చొరవ తీసుకోవడంవల్ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షానికి తిమ్మిని బమ్మిని చేసే సామర్థ్యం ఉంది కనక ఈ మూడు పార్టీలు సంక్షోభంలో పడిపోయేవి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ స్తబ్ధుగానే, జడంగానే ఉండి పోయింది. అందుకే కాంగ్రెస్ ప్రత్యామ్నాయ రాజకీయ చర్చకు ఎజెండా ప్రతిపాదించలేక పోయింది. రాజకీయ చర్చలను సంపూర్ణంగా అధికార పార్టీ అయిన బిజెపికి వదిలేసింది. బహుశః శరద్ పవార్ సలహా, ప్రోద్బలం మేరకు కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుంది. విస్తృత రాజకీయ లక్ష్యం సాధించడం కోసం ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో తాను చిన్న పాత్ర పోషించడానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ఈ ఎత్తుగడనే అనుసరిస్తే ఏక కేంద్రక రాజకీయాలను, ఒక ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చే బిజెపి ధోరణిని నిలవరించి కాంగ్రెస్ క్రియాశీలంగా మారడానికి అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరడం దీనికి మార్గం సుగమం చేస్తుంది.

వైవిధ్యాన్ని, ఇతరులను సహించే వైఖరిని అనుసరిస్తే అధికార పార్టీలో ఉన్న చీలికలను ఆసరాగా చేసుకుని ఆ పార్టీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయగలమని గ్రహించగలిగితే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ ప్రజాస్వామ్య విలువలకు ఏ మాత్రం కట్టుబడి ఉండడం లేదు. మన దేశంలో వైవిధ్యాలు, విరుద్ధాభిప్రాయాలు, అసమానతలు ఎక్కువ కనకే అధికార పక్షం నిరంకుశ విధానాలను అనుసరించగలుగుతోంది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశత్వం చెలాయించడానికీ పరిమితులు ఉంటాయి. అందుకే గతాన్ని తవ్విపోసి అధికారం నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో అపజయాలూ ఎదురవుతున్నాయి. ఏ దారి అయినా తొక్కి తాము అధికారం నిలబెట్టుకోగలమన్న మితి మీరిన విశ్వాసం కారణంగానే రాత్రికి రాత్రి మాయ చేసి బిజెపి 2019 నవంబర్ 23న ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.

ధన బలంతో, ఒత్తిడి ఉపయోగించి ప్రతిపక్షంలో చీలికలు తీసుకురాగలమన్న ధీమాతో వ్యవహరించగలిగింది. తమకు ఎదురుండదని భావించింది. అయితే ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలతో సంబంధం ఉన్న రాజకీయాలు, బలమైన సామాజిక పునాది, పరిపాలనానుభవం ఉంటే ఈ ఎత్తులను చిత్తు చేసే అవకాశం ఉంటుంది. అధికార పక్షాన్ని నిలవరించడం సాధ్యమే. బిజెపి నాయకత్వానికి అధికారం చేతిలో ఉన్నా గట్టి ప్రయత్నం చేస్తే అధికారం సంపాదించడానికి పాల్పడే కుటిల యత్నాలను భగ్నం చేయవచ్చు.

అధికార పక్షం కుయుక్తులను వమ్ము చేయగలిగిన మూడు పార్టీల కూటమి ఇప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగించగలగాలి. తన చేతల ద్వారా బిజెపిని నిలవరించగలగాలి. అంటే కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేర్చిన విధానాలను అమలు చేయాలి. ఆపదలో ఉన్న సామాన్యులను ఆదుకోవాలి. అన్నింటికీ మించి బిజెపి విసిరే ఉచ్చుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. దీనికి చాలా నేర్పు కావాలి. లేకపోతే ప్రత్యామ్నాయం చూపుతామన్న లక్ష్యం నెరవేరదు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తమ భావజాలానికి, రాజకీయ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధమైన పక్షంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినందువల్ల ఈ రెండు పక్షాలు సిద్ధాంతాలు స్పష్టంగా ఉండాలి. అంటే ‘ఎత్తుగడలలో వెసులుబాటు, సిద్ధాంతం విషయంలో దృఢత్వం’ ప్రదర్శించగలగాలి. అప్పుడే ఈ ప్రయోగం సఫలం అవుతుంది.

Politics that changed with the Maharashtra