Home ఎడిటోరియల్ బిజెపికి, మోడీకి కీలక ఎన్నికలు

బిజెపికి, మోడీకి కీలక ఎన్నికలు

Poll campaign in UP set for tech-tonic shift

 

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మినహా బిజెపికి ప్రజాకర్షణ గల బలమైన నాయకులు మరే రాష్ట్రంలో లేరు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఆదిత్యనాథ్ సామర్ధ్యంతో బిజెపి తిరిగి గెలుపొందిందనే సంకేతం వెలువడితే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వానికి పోటీదారునిగా మారతారని భయం నెలకొంది. ఆదిత్యనాథ్ ప్రాధాన్యతను జాతీయ స్థాయిలో తగ్గించడం కోసమే ఆయన కోరుకున్న విధంగా అయోధ్య లేదా మధురల నుండి కాకుండా ఆయన స్వస్థలం గోరఖ్‌పూర్ నుండే పోటీ చేయించాలని నిర్ణయించడం గమనార్హం. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ వంటి చిన్న చిన్న రాష్ట్రాల ఎన్నికలు జాతీయ స్థాయి రాజకీయ బలాబలాలపై ఎటువంటి ప్రభావం చూపలేవు.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సుస్థిరతపై ఎటువంటి ప్రభావం చూపవు. అయితే ప్రభుత్వం మనుగడకు, ఒక రాజకీయ పార్టీగా బిజెపి భవిష్యత్ కు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదింట నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. కనీసం ఆ నాలుగు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి రావడమే కాకుండా, ఇప్పటికన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకోవడం ఆ పార్టీకి అత్యవసరం. ముఖ్యంగా దేశంలోకెల్లా జనాభాలో, నియోజకవర్గాలలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఫలితాలు నిర్ణయాత్మకం కానున్నాయి. ఎటువంటి ప్రతికూల ఫలితాలు వెలువడినా ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజాదరణ తగ్గిపోతుందనే సంకేతం వెలువడటమే కాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికలపై కూడా ప్రతికూల ప్రభావం చూపి అవకాశం ఉంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మినహా బిజెపికి ప్రజాకర్షణ గల బలమైన నాయకులు మరే రాష్ట్రంలో లేరు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఆదిత్యనాథ్ సామర్ధ్యంతో బిజెపి తిరిగి గెలుపొందిందనే సంకేతం వెలువడితే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వానికి పోటీదారునిగా మారతారని భయం నెలకొంది.

ఆదిత్యనాథ్ ప్రాధాన్యతను జాతీయ స్థాయిలో తగ్గించడం కోసమే ఆయన కోరుకున్న విధంగా అయోధ్య లేదా మధురల నుండి కాకుండా ఆయన స్వస్థలం గోరఖ్‌పూర్ నుండే పోటీ చేయించాలని నిర్ణయించడం గమనార్హం. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ వంటి చిన్న చిన్న రాష్ట్రాల ఎన్నికలు జాతీయ స్థాయి రాజకీయ బలాబలాలపై ఎటువంటి ప్రభావం చూపలేవు. అయితే ఈ రాష్ట్రాలలో బిజెపిలో అంతర్గతంగా కుమ్ములాటలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాటి ఫలితంగా రెండు రాష్ట్రాలలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష శిబిరంలో ఆ పార్టీ ప్రాధాన్యత కొంచెమైనా పెరుగుతుంది. ఆ ప్రభావంతో డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్న కీలకమైన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బిజెపిని ఓడించడం పట్ల కాంగ్రెస్ దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు కీలకం కావడంతోనే గత ఆరు నెలలుగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం వ్యూహంతోనే ఈ రాష్ట్రాలలో వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్‌ల పేరుతో పర్యటనలు చేస్తున్నారు. రాజకీయంగా ఈ ఎన్నికలు మరో రెండు అంశాలపై ప్రభావితం చేయనున్నాయి. ఆగస్టులో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత రాజ్యసభకు ఈ సంవత్సరం 74 స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి.

నిన్నటి వరకు బిజెపి కోరిన అన్ని బిల్లులకు మద్దతు ఇస్తూ వచ్చిన టిఆర్‌ఎస్, వైసిపి వంటి పార్టీలు ఇప్పుడు పార్లమెంట్‌లో తాము బిజెపికి వ్యతిరేకం అనే సంకేతం తమ ఓటర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. బిజెపి మిత్రపక్షాల బలం కూడా తగ్గబోతున్నది. ప్రస్తుతం 245 మంది మొత్తం సభ్యులలో 93 మంది సభ్యులతో రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా బిజెపి ఉంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో ఇప్పుడున్న బలమే కొనసాగినా రెండు, మూడు సీట్లకన్నా ఆ పార్టీ బలం పెరగదు. 2024 లోక్‌సభ ఎన్నికలలోగా రాజ్యసభలో బిజెపికి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. అందుకనే ఇప్పుడున్న స్థానాలనైనా కాపాడుకోవడం చాలా అవసరం. ఎంఎల్‌ఎల సంఖ్య తగ్గితే అత్యధిక మందిని రాజ్యసభకు పంపుతున్న ఉత్తరప్రదేశ్ నుండి బిజెపి సంఖ్యాబలం తగ్గిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంట్ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల ఎంఎల్‌ఎలు కూడా ఓటు వేస్తారు. సొంత బలంపై తమ అభ్యర్థిని గెలిపించుకోవడం చాలా కీలకం కానున్నది. గత ఎన్నికలలో మద్దతు ఇచ్చిన టిఆర్‌ఎస్ వంటి పార్టీలు ఈసారి మద్దతు ఇవ్వడం అనుమానాస్పదమే. పైగా అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో ఉంది. మరో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మిత్రపక్షం అన్నాడిఎంకె అధికారాన్ని కోల్పోయి, డిఎంకె మంచి ఆధిక్యతతో ఉంది.

చివరకు కేంద్రంలో ఎవ్వరు అధికారంలో ఉంటే వారికి మద్దతు ఇస్తూ వస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహితం ఇప్పుడు స్వతంత్ర వైఖరి అవలంబించించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత బలం లేని పక్షంలో రాష్ట్రపతి ఎన్నికలలో మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, కె చంద్రశేఖరరావు, నవీన్ పట్నాయక్ వంటి నేతలు అభ్యర్థిని ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. ఈ పార్టీల మద్దతు కూడదీసుకోగల అభ్యర్థిని బిజెపి ఎంపిక చేయాల్సి ఉంటుం ది. అటువంటి ‘సర్దుబాటు’ పరిస్థితులను ప్రధాని మోడీ ఎదుర్కోవడం ఇబ్బందికరమే కాగలదు. బిజెపిలో పలు వర్గాలు నరేంద్ర మోడీకి రాజకీయ వారసుడిగా భావిస్తున్న యోగి ఆదిత్యనాథ్ రాజకీయ భవిష్యత్‌కు సహితం ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఆ రాష్ట్రంలో బిజెపి నుండి ఇతర పార్టీలలో చేరుతున్న వారంతా ఆయన ‘ఏకపక్ష ధోరణులు’ పైననే ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. కళ్యాణ్ సింగ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో స్థానికంగా కీలక నేతగా బిజెపిలో మారింది ఆయనే కావడం గమనార్హం. నాలుగు నెలలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం ఉత్తరాఖండ్‌లో బిజెపిలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు వెల్లడిచేస్తున్నది. మొత్తం 70 సీట్లు ఉండగా, 60 సీట్లు గెల్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని ఏమేరకు నెగ్గుకు రాగలదని చూడవలసిందే.

ఇక మణిపూర్‌లో గెలుపొందడం ఇటీవల ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి సాధిస్తున్న రాజకీయ ఆధిపత్యానికి కొనసాగింపు కాగలదు. ఇక్కడ కాంగ్రెస్ సహితం చెప్పుకోదగిన పోటీ ఇవ్వలేక పోతున్నది. గోవాలో మనోహర్ పారికర్ మరణం తర్వాత బిజెపికి బలమైన నాయకత్వం లేకుండా పోయింది. పైగా ఆ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చిన క్రైస్తవులలో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. అయితే ప్రతిపక్షాలలో చీలిక ఏర్పడటమే తమ కు బలంగా మారగలదని బిజెపి భావిస్తున్నది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు గండికొట్టగలవని విశ్వసిస్తున్నారు. అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎన్నికల అనంతరం నూతన రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అటువంటప్పుడు బిజెపి ఒంటరి కాగలదు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఎప్పుడూ బిజెపి బలమైన రాజకీయ పక్షం కాదు. సుదీర్ఘ కాలం అకాలీదళ్ తో పొత్తు ఉండడంతో పట్టణ ప్రాంతాలలో కొన్ని సీట్లు గెల్చుకొంటూ వస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ నుండి బైటకు వచ్చి, ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ మద్దతుపై ఆశలు పెట్టుకుంది. అయితే అమరిందర్ సింగ్ కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి రాకుండా చేయడానికి ఉపయోగపడతారు తప్ప సొంతంగా అధికారంలోకి కష్టం కాగలవని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆప్ అక్కడ ఎన్నికల బరిలో ముందంజలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఆప్, కాంగ్రెస్ లలో ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా బిజెపికి ఒనగూరే ప్రయోజనం లేదు. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలం పుంజుకోకుండా చేయడం కోసం చివరి క్షణం లో బిజెపి శ్రేణులు సహితం కెప్టెన్ అమరిందర్ సింగ్‌కు కాకుండా ఆప్ అభ్యర్థులకు క్షేత్ర స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సరిహద్దు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బిజెపి తక్షణ రాజకీయ లక్ష్యంగా కనిపిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో క్షేత్ర స్థాయిలో చెప్పుకోదగిన బలం లేకపోవడంతో ఎన్ని వనరులను సమీకరించినా ‘వీధి పోరాట యోధురాలు’గా పేరొందిన మమతా బెనెర్జీని తిరిగి అధికారంలోకి రాకుండా బిజెపి అడ్డుకోలేకపోయింది. అయినా జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చెప్పుకోదగిన ఇబ్బందులు కలిగించలేదు. పైగా మమతా బెనర్జీ జాతీయ నాయకత్వంపై దృష్టితో గోవా, మణిపూర్‌లలో పెద్ద ఎత్తున అభ్యర్థులను నిలబెడుతూ కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మమతా ప్రయత్నాలు అన్ని పరోక్షంగా బిజెపికి ప్రయోజనం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ లలో కాంగ్రెస్ ఏమాత్రం కోలుకున్నా జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే అవకాశం కలిగిస్తుంది. తద్వారా బిజెపికి పెద్ద సవాల్ విసరగల సామర్ధ్యాన్ని ఆ పార్టీ పెంచుకొనే అవకాశం ఉంది. అందుకనే కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేయడం చాలా అవసరం. ఒక విధంగా కరోనా కారణంగా ఎన్నికల ప్రచారం, ర్యాలీలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడం కూడా బిజెపికి కలసి వచ్చే అవకాశంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ రాష్ట్రాలలో ఓటర్ల వద్దకు వెళ్ళగలిగింది. విస్తృతమైన సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొంది. ఈ విషయంలో మరే పార్టీ కూడా బిజెపికి సామీప్యంలో కూడా లేదు.

                                                                             – చలసాని నరేంద్ర, 9849569050

Poll campaign in Uttar Pradesh set for tech-tonic shift