Home తాజా వార్తలు భాగ్యనగరం బయటకు

భాగ్యనగరం బయటకు

factory

భాగ్యనగరం బయటకు కాలుష్య పరిశ్రమలు 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గల పారిశ్రామిక వాడలను శివార్లకు తరలించే ప్రణాళిక 

ముందుగా కాటేదాన్‌లోని
వెయ్యికిపైగా పరిశ్రమలు
వికారాబాద్, జహీరాబాద్‌కు
అలాగే జీడిమెట్ల,
కుత్బుల్లాపూర్ యూనిట్లూ
మరికొన్ని ముచ్చర్లకు
టిఎస్‌ఐఐసి సన్నాహాలు
తగిన చోట్ల స్థలాల గుర్తింపు

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న సనత్‌నగర్, బాలానగర్, ఫతేనగర్, జీడిమెట్ల, బొల్లారం, కాటేదాన్, చర్లపల్లి, చౌటుప్పల్ తదితర పారిశ్రామిక వాడలను శివారు ప్రాంతాలకు తరలించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. ఒకప్పుడు ఇవి శివారు పారిశ్రామిక వాడలుగానే ఉన్నప్పటికీ వాటి కి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కార్మికులు తాత్కాలిక నివాసాలు వేసుకోవడం, అవి ఇప్పుడు కాలనీలుగా మారిపోవడంతో ఆ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం బారిన పడుతున్నారు. దీంతో వాయు కాలుష్యమే కాకుండా భూగర్భ జలాలు కూడా కాలుష్యం కావడంతో కార్మికు లు, స్థానికులు అనారోగ్యం పాలవుతుండడం వల్ల ఆ పరిశ్రమలను శివారు ప్రాంతాలకు తరలించడమే తగిన పరిష్కారమని భావించిన ప్రభుత్వం ముచ్చర్ల, వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించాలని ఆలోచిస్తోంది. కొన్ని పరిశ్రమలను తక్షణమే నగరం నుంచి తరలించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కాటేదాన్‌లోని వెయ్యికి పైగా కంపెనీలతో పాటు జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో ఉన్న పరిశ్రమలను మొదటగా తరలించాలని నిర్ణయం తీసుకుంది.
నగరం మధ్యలోకి పరిశ్రమలు…
శరవేగంగా మారుతున్న పట్టణీకరణతో ఒకప్పుడు నగర శివారు ప్రాంతాల్లో ఉండే పరిశ్రమలు ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేశాయి. దీంతో సనత్‌నగర్, బాలానగర్, ఫతేనగర్, జీడిమెట్ల, బొల్లారం, కాటేదాన్, చర్లపల్లి ప్రాంతాల్లో వేలాది కంపెనీల నుంచి కాలుష్యం పెద్ద మొత్తంలో వెలువడుతోంది. జీడిమెట్ల తరువాత సురారం నుంచి మొదలుకొని గండిమైసమ్మ దుండిగల్ వరకు నగరం విస్తరిస్తూనే ఉంది. అదేవిధంగా ఒకప్పుడు పాతబస్తీ అవతల ఉండే కాటేదాన్ దాటి నగరం శంషాబాద్ వరకు విస్తరించింది. నగరం నలువైపులా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. పరిశ్రమల మూలంగా వాయు, జల కాలుష్యం విపరీతంగా పెరిగి పరిశ్రమల్లో పనిచేసే వారితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారు రోగాల బారిన పడుతున్నారు.
తరలింపునకు టీఎస్‌ఐఐసీ సన్నాహాలు : కాలుష్యకారక పరిశ్రమలను దశలవారీగా తరలించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) సన్నాహాలు చేస్తోంది. కాటేదాన్‌లోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సైతం గుర్తించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఆ తరువాత మరికొన్ని పరిశ్రమలను సైతం ముచ్చెర్ల ఫార్మాసిటీకి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్, తదితర ప్రాంతాల్లోని మరో వెయ్యి బల్క్ డ్రగ్ ఫార్మా పరిశ్రమలను కూడా ముచ్చెర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే పరిశ్రమల తరలింపును కొన్ని చోట్ల స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.పరిశ్రమలను తరలిస్తే ప్రతీరోజు పనుల కోసం రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా ఉంటుందని వారు వాపోతున్నారు. పిల్ల ల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయని, కొత్త వాతావరణంలో కొత్త ఇబ్బందులు వస్తాయనివ్యాఖ్యానించారు.
జిఒ 111 పరిధిలో కాటేదాన్ ప్రాంతం…
ప్రస్తుతం కాటేదాన్‌లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో పాటు ప్లాస్టిక్, రబ్బర్, స్టీలు, విడిభాగాలు తదితర కాలు ష్య కారక పరిశ్రమలు ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో స్థానికంగా ఉన్న నూర్‌మహ్మద్ కుంట కాలుష్య కాసారమయ్యింది. జీవో నెం. 111 పరిధిలో ఈ ప్రాంతం ఉండడంతో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు సైతం కాలుష్యంవిస్తరించింది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ రసాయనాలను డంపింగ్ చేయడంతో చెరువులు కలుషితమవుతున్నాయి. వీటి ప్రభావంతో ఆయా చెరువుల అలుగుల్లో బండరాళ్ల రంగు మారిపోయిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దీంతోపాటు కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల మధ్య మరో చెరువు కూడా కలుషిత జలాలో నిండిపోయాయి. కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్లలో ఇప్పటికే కొన్ని చెరువులు కాలుష్యం బారిన పడడంతో చుట్టుపక్కల నివసించే వారు రోగాలతో సతమతమవుతున్నారు. ఇందులో ప్రధానంగా ముళ్లకత్వ చెరువు, ఆల్విన్ కాలనీ ‘పరికి చెరువు’ ఉన్నాయి. ఓల్డ్ బోయిన్ పల్లి హస్మత్‌పేటలోని బోయిని చెరువు కూడా ఇందులో చేరింది. చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన కొన్ని కంపెనీల వారు వ్యర్థ రసాయనాలను ఇక్కడకు లారీల్లో తీసుకొచ్చి డంపిండ్ చేయడంతో చెరువులోకి భారీగా రసాయనాలు వచ్చి చేరుతున్నాయి. అలా చెరువు అలుగు నుంచి కాలు ష్య జలభూతం కూకట్‌పల్లి నియోజకవర్గం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఇలా పరిశ్రమలు నడిచే ప్రతి ప్రాం తంలో స్థానికులు నిత్యం ఏదో ఒక సమస్యతో ఇబ్బందు లు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం ఎన్ని రోజుల్లో అమలవుతుందో వేచి చూడాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు.