Wednesday, November 13, 2024

పేద దేశాలకు టీకా అందేనా?

- Advertisement -
- Advertisement -

Poor countries purchase Corona vaccine

కొత్త సంవత్సరం 2021లోకి అడుగుపెట్టి ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయాయి. సాధారణంగా ప్రతి దేశంలో ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో ఆర్థికవేత్తలు అధ్యయనం చేసి నివేదికలు తయారు చేసి విడుదల చేస్తుంటారు. అలాగే ఈ ఏడాది అగ్ర రాజ్యాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అనే నివేదికలు విడుదలయ్యాయి. వాటిని ఒక సారి పరిశీలిద్దాం.
కరోనా పుణ్యమా అని ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థికంగా చితికిపోయాయి. 2020 సంవత్సరం ప్రపంచ చరిత్రలో మానని గాయంగా మిగిలిపోయింది. కరోనా విపత్తు నుంచి ప్రస్తుతం ప్రపంచం మాత్రం ఇంకా బయటపడలేకపోతోంది. తాజా కొత్త రకం వైరస్ కరోనా స్ట్రెయిన్ పలు దేశాలకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు దీనికి విరుగుడుగా కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనడానికి శక్తి వంచన లేకుండా రాత్రి, పగలు అని చూడకుండా శాస్త్రవేత్తలు కష్టపడి వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ప్రపంచంలోని అన్నీ దేశాలకు సమానంగా అందుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుంది. సంపన్న దేశాలకు మాత్రం అడక్కుండానే లభిస్తే, పేద దేశాలు మాత్రం కళ్లు కాయలు కాచేలా వేచి చూడాల్సిందే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) మాత్రం వ్యాక్సిన్ అన్నీ దేశాలకు సమానంగా అందేలా చూస్తామని తరచూ ప్రకటనలు గుప్పిస్తోంది. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుట్రెస్ కూడా ఇలాంటి ప్రకటనలే గుప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే మానవాళి శ్రేయస్సు దృష్ట్యా అందరికీ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. డబ్ల్యుహెచ్‌ఒ ఉన్నతాధికారులు పెద్ద పెద్ద హామీ లు గుప్పించినా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందనేది మాత్రం అనుమానమే. ది ఎకనమిస్ట్ ఎడిటర్ టామ్ స్టాండేజ్ కూడా ఈ ఏడాది వ్యాక్సిన్ కోసం పలు దేశాల మధ్య యుద్ధం తప్పదని జోస్యం చెప్పారు.
అయితే కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి అంతర్జాతీయంగా అన్నీ దేశాల మధ్య ఐకమత్యం కొరవడింది. అన్నీ దేశాలు దీన్ని ఓ సవాలుగా తీసుకొని కట్టడి చేస్తేనే ప్రపంచ దేశాలు ఆర్థికంగా, సామాజికంగా బతికి బట్టకట్టే అవకాశాలున్నాయి. సంపన్న దేశాలు లేదా బలమైన దేశాలు అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించి వ్యాక్సిన్‌ను తమ తమ దేశాలకు తరలించుకుపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పేద దేశాలు మాత్రం ఈ రేసులో వెనుకబడ్డం ఖాయం.
అగ్ర రాజ్యాల మధ్య సంధి కుదిరేనా?
ఈ ఏడాది మల్టీ లేటరలిజం అంటే యుఎన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఒ), అలాగే మల్టీ పోలారేటి ఉదాహరణకు అమెరికా, చైనాలను చెప్పుకోవచ్చు. ఇరు దేశాలు సంపన్న దేశాలు. ఆర్థికంగా పరంగాను, మిలిటరీ పరంగాను సమ ఉజ్జీగా పోటీపడుతున్నాయి. ఈ దశాబ్దంలో వీరి ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్న చర్చ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ చట్టాలను కాలదన్ని ఇప్పటికే వీరు అనైతిక సిద్ధాంతాలను అమలు చేస్తున్నారు. తాజా అమెరికాలో అధికారం మార్పిడి అయి ట్రంప్ స్థానంలో జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నందు వల్ల పరిస్థితులు కొంత సానుకూలంగా కనిపిస్తున్నాయి. బైడెన్ ఇప్పటికే తాను పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరుతానని ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం. అలాగే డబ్ల్యుహెచ్‌ఒతో పాటు ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ప్రకటించారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రపంచానికి ఉపశమనం కలిగించే అంశాలు.
అలాగే అమెరికా, చైనాలు అత్యంత సంపన్న దేశాలు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడితే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంత మంది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ట్రంప్ మాదిరిగా బైడెన్ దూకుడు ప్రదర్శించకుండా చైనాతో స్నేహపూర్వక సంబంధాలు కోసం ప్రయత్నిస్తారని అంచనా వేస్తుండగా, మరి కొందరు మాత్రం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ముదిరి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయని జోస్యం చెబుతున్నారు. అమెరికాకు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఇరు దేశాల మధ్య తైవాన్ పైనే ఉద్రిక్తతలు నెలకొంటాయని చెబుతున్నాయి. మరి కొంద రు మాత్రం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నాయి. మొత్తానికి ట్రంప్ మాదిరిగా బైడెన్ దూకుడుగా పోకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాయి.ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధంతో పాటు టెక్నాలజీ వార్ మాత్రం సద్దుమణిగే పరిస్థితి కనబడ్డం లేదు.
అమెరికా మార్కెట్లో ఐటి రంగంలో చైనా తన సత్తా చాటుతోంది. చైనీస్ టెలికం కంపెనీలు ప్రపంచం మొత్తం దూసుకుపోతున్నాయి. 5 జీ టెక్నాలజీలో అందరి కంటే ముందుంది. చైనా టెక్నాలజీ ని అడ్డుకొనేందుకు ట్రంప్ శతవిధాల ప్రయత్నించారు. అయితే బైడెన్ శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారని, డిప్లొమాటిక్ స్కిల్స్ రాయబార కార్యకలాపాలు నెరిపే నైపుణ్యం కొరవడిందని, ది ఎకనమిస్ట్ తేల్చి చెప్పింది. యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు 14 దేశాల ఆసియా పసిఫిక్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో బైడెన్ విఫలయమ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తేల్చిచెప్పింది. కాబట్టి చైనాకు బైడెన్ గట్టి పోటీ ఇవ్వలేరనే వాదన ఉంది.
ఆర్థిక వ్యవస్థలు గాడినపడేనా?
కరోనా దెబ్బకు ప్రపంచంలోని అన్నీ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ ఏడాది అన్నీ దేశాలు తమ శక్తివంచన లేకుండా కృషి చేసి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తాయి. అయితే కొత్త వైరస్ స్ట్రెయిన్ వల్ల దాని ప్రభావం పలు దేశాలపై ఉంటుంది. ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా పలు సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధ్ది చెందుతున్న దేశాలు మాత్రం గడ్డు పరిస్థితి చవిచూడాల్సి ఉంటుంది.ధనిక దేశాలు ఇచ్చిన రుణాలపై కొంత మేరకు మాఫీలు చేసినా పేద దేశాలకు మాత్రం రుణభారం కుంగదీస్తుంది. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం పలు దేశాలు మరింత పేదరికంలోకి మగ్గిపోవాల్సి వస్తుందని తెలిపింది. వారిని పేదరికం నుంచి పైకి తేవడానికి ధనిక దేశాలు చొరవ చూపాల్సి వస్తుంది. మొత్తానికి ధనిక, పేద దేశాల మధ్య వ్యత్యాసం మరింత పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా
అంతర్జాతీయ ద్రవ్యినిధి (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం ఈ ఏడాది ఆర్థిక అసమతుల్యం పెరిగిపోతుందని, ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థ గాడినపడ్డానికి ఆయా దేశాలు ఎంత శరవేగంగా కరోనాను కట్టడి చేస్తే అంత త్వరగా ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది. మిగిలిన దేశాల పరిస్థితులు ఎలా ఉన్నా చైనా మాత్రం ఆర్థికంగా శరవేగంగా పుంజుకుని తిరిగి ప్రపంచ వ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అంచనా వేసింది.
దీంతో పాటు ఈ ఏడాది అందరిని ఇబ్బంది పెట్టే అంశం సైబర్ సెక్యూరిటీ రిస్కు. ఈ అంశం వ్యాపారస్థులతో పాటు ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తుంది. యూరో ఏషియా నివేదిక ప్రకారం ఈ ఏడాది సైబర్ సెక్యూరిటీ రిస్కు ఉంటుందని తేల్చి చెప్పింది. గ్లోబల్ లీడర్‌షిప్ కొరత కూడా దానికి జత కావడంతో ఈ ఏడాది కొన్ని ఇబ్బందులతో పాటు కొన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది.

-లక్కాకుల కృష్ణమోహన్
9705472099

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News