Home తాజా వార్తలు మతాలను అడ్డుపెట్టుకొని ప్రజలను విడగొట్టొద్దు

మతాలను అడ్డుపెట్టుకొని ప్రజలను విడగొట్టొద్దు

Posani shocking comments on kcr over GHMC polls

 

టిఆర్‌ఎస్‌ను గెలిపించడమే అందరి బాధ్యత : పోసాని కృష్ణమురళి
రాజకీయాల కోసం ప్రజలను విడగొట్టొద్దు
అబద్ధాలు మాట్లాడి అరాచకాలు సృష్టించొద్దు
ఆంధ్రవాళ్లను కెసిఆర్ క్షేమంగా చూసుకుంటున్నారు
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించండి
దర్శకుడు ఎన్.శంకర్,నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసి) ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీతో కలిసి విలేకరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. రాజకీయాల కోసం ప్రజలను విడగొట్టే రాజకీయాలు చేయొద్దని బిజెపి నాయకులకు ఆయన సూచించారు. ఓట్ల కోసం మనుషులను మతాల వారీగా, కులాల వారీగా చీల్చొద్దన్నారు. అబద్ధాలు మాట్లాడి అరాచకాలు సృష్టించొద్దన్నారు.

హైదరాబాద్‌కు మతకలహాల చేదు అనుభవం మళ్లీ అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సిఎం కెసిఆర్ ప్రశాంతంగా సాగిందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ప్రజలు బతుకమ్మ, పీర్ల పండుగ కలిసి జరుపుకుంటున్నారన్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి తానీషా ఎలాగైతే తలంబ్రాలు ఇచ్చారో హైదరాబాద్ ప్రజలు అలా స్నేహపూర్వక జీవనాన్ని ఎంచుకున్నారన్నారు. రాజకీయాల కోసం మతాలను అడ్డుపెట్టుకోవద్దని ఆయన హితవు పలికారు.

మొండిగా, అబద్ధాలు మాట్లాడడం సరికాదు
మొండిగా మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదన్నారు. బిజెపి పార్టీ హిందువుల పార్టీని ఆ పార్టీ ఎంపి ప్రకటించారని, తాను హిందువును అయితే వారి పార్టీలో ఉండాలా? అని శంకర్ ప్రశ్నించారు. వేదాలను గౌరవిస్తే గోమాతను పూజిస్తే శవ భాష మాట్లాడుతారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ప్రాజెక్టులను నిర్మించారని, 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. కులవృత్తులు, చేతి వృత్తుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

రూ.5లకే ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు
హైదరాబాద్ నగరంలో 350 వరకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని, అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5లకే ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారన్నారు. అలాగే నగరంలో మహిళలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వందలాది సంఖ్యలో మొబైల్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెట్రో రాదని అందరూ అనుకున్నారని, ఎవరూ ఊహించలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దానిని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛ హైదరాబాద్, హరితహారం ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఐటి సంస్థల్లో ప్రపంచంలోని ఐదు టాప్ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని, తెలంగాణ రాక ముందు ఒకే సంస్థ ఉండేదని శంకర్ గుర్తు చేశారు.

30 ఏళ్లలో తాగునీటి సమస్య లేకుండా
అంతర్జాతీయ సంస్థలు రావడానికి లా అండ్ ఆర్డర్, మానవ వనరులు ఉండడంతో ఇక్కడికి వస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కూడా అమలు చేస్తుందన్నారు. అలాగే హైదరాబాద్ మహానగరానికి రాబోయే 30 ఏళ్లలో తాగునీటి సమస్య లేకుండా సిఎం కెసిఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. ఇంతటి విజన్ ఉన్న నాయకుడిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని హైదరాబాద్ ఓటర్లను ఆయన కోరారు.

సిఎం కెసిఆర్ లాంటి పట్టుదల ఉన్న నాయకుడిని చూడలేదు: పోసాని
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళీ మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని సిఎం కెసిఆర్ లాంటి పట్టుదల ఉన్న నాయకుడిని చూడలేదని పోసాని కృష్ణమురళీ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రవారిని వెళ్లగొడుతారని చాలా మంది భయపడ్డారని, ఇందులో తాను కూడా ఉన్నాన్నారు. ఆంధ్రవారిపై కెసిఆర్‌కు కోపం లేదన్నారు. తెలంగాణ వచ్చాక ఎపి ప్రజలపై ఎలాంటి దాడులు జరగలేదని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్‌కు ఆంధ్రా ప్రజలంటే ఎలాంటి కోపం లేదని, తెలంగాణను దోచుకున్న, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా పెత్తనం చెలాయించిన వారిపైనే సిఎం కెసిఆర్‌కు కోపం అన్నారు.

మన ప్రాంతాన్ని మనం పాలించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి, రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ పోరాడారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ బిడ్డల మాదిరిగానే ఎపి వారిని కెసిఆర్ క్షేమంగా చూస్తున్నారని పోసాని కొనియాడారు. తెలంగాణ ప్రజలు సైతం ఆంధ్రా ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్నారన్నారు. తాను హైదరాబాద్‌లో 13 ఏళ్లుగా ఉంటున్నానని తన ఇంటి చుట్టూ తెలంగాణ వారే ఉన్నారని, తనను ఇన్ని రోజుల్లో ఎవరూ ద్వేషించడం, కోపగించుకోలేదన్నారు. దీనంతటికి కారణం సిఎం కెసిఆర్ పరిపాలనే కారణమన్నారు. నీతిమంతుడైన, నిబద్ధత కలిగిన, ఆదర్శవంతమైన నాయకుడు సిఎం అయితే ప్రజలకు కూడా అవే లక్షణాలు అబ్బుతాయన్నారు.

హైదరాబాద్‌లో మెరుగ్గా శాంతి భద్రతలు
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆంధ్రా నాయకులు తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, నీళ్లు ఉండవని మాట్లాడారన్నారు. ఎప్పుడైతే తెలంగాణను వీడి ఆంధ్రా నాయకులు వెళ్లిన అనంతరం తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వెలుగుల్లో ధగధగ మెరిసిపోయిందన్నారు. దీనికి కారణం సిఎం కెసిఆర్ కారణమన్నారు. విద్యుత్ విషయంలోనూ ఆయన వ్యవహరించిన తీరు బాగుందన్నారు. కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో తాగు, సాగునీటి సమస్యలు ఉండేవని, సిఎం కెసిఆర్ వచ్చాక ఆ సమస్యలు చాలావరకు పరిష్కారం అయ్యాయయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో నిర్మించారన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టు కట్టారో చూపాలన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు చాలా బాగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎప్పుడూ రానంత స్థాయిలో వరదలు వచ్చాయని, అందుకే ప్రజలు ఇబ్బందిపడ్డారని పోసాని పేర్కొన్నారు. ఆ స్థాయిలో వరదలు వస్తే వందమంది కెసిఆర్‌లు ఉన్నా ఏమీ చేయలేరన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన మద్ధతు టిఆర్‌ఎస్‌కే ఉంటుందన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Posani shocking comments on kcr over GHMC polls