Home ఎడిటోరియల్ సంపాదకీయం: ప్రాణాలు తీస్తున్న గుంతలరోడ్లు

సంపాదకీయం: ప్రాణాలు తీస్తున్న గుంతలరోడ్లు

Sampadakeeyam-Logoహైదరాబాద్ మహానగరంలో సెప్టెంబర్ నెల భారీవర్షాలకు రూపురేఖలు మారి గుంతలు పడిన రోడ్లు ప్రయాణీకులపాలిట నరకప్రాయంగా కొనసాగు తున్నాయి. శుక్రవారంనాడు కూకట్‌పల్లి వై జంక్షన్‌లో జరిగిన ప్రమాదం ఒక ఉన్నత విద్యావంతుని ప్రాణం బలితీసుకుంది. స్నేహితుని మోటారు బైక్‌పై వెనుక కూర్చున్న ఎంటెక్ పట్టభద్రుడు బోర అరుణ్ కుమార్, బండి నడుపుతున్న సోమశేఖర్ సడన్‌బ్రేక్ వేయటంతో ఎగిరి రోడ్డుమీద పడ్డాడు. తల మందుభాగం రోడ్డుకు కొట్టుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డుపై పెద్దగుంత ఈ ప్రమాదానికి కారణం. ముందు వెళుతున్న మోటారు సైక్లిస్ట్ ముందున్న గుంత కారణంగా బైక్ వేగాన్ని తగ్గించటంతో వెనుకనే వస్తున్న బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ బైక్‌ని గుద్దుకోకుడా సడన్‌బ్రేక్ వేశాడు. అరుణ కుమార్‌ది వర్షాలకాలంనుంచి మూడవ రోడ్డు ప్రమాద మరణం. సెప్టెంబర్ లో జరిగిన ప్రమాదంలో – మన్మథరావు, సంధ్య దంపతులు స్కూటర్‌పై ఎర్రగడ్డనుంచి జీడిమెట్ల తిరిగివస్తుండగా, గుంతను తప్పించే ప్రయత్నంలో స్కూటర్ జారిపడటంతో సంధ్య రోడ్డుపై పడిపోయింది. సంధ్యపైగా ఆర్‌టిసి బస్సు వెళ్లగా గాయపడిన ఆమె అనంతరం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. దీంతో మన్మథరావు కుటుంబంలో విషాదం నెలకొంది. మాదాపూర్‌లో జరిగిన మరో ఘటనలో – సిహెచ్.చాణక్యరెడ్డి అనే ఐబిఎం ఉద్యోగి తన బైక్ గుంతల్లో కుదుపులకు గురి కావడంతో అదుపు కోల్పోయి రోడ్డుపై పడగా, ఒక కారు అతనిపైగా వెళ్లటంతో మరణించాడు.

గతుకుల రోడ్లపై ప్రయాణంవల్ల రోజూ బ్రేక్‌డౌన్ అవుతున్న ఆర్‌టిసి బస్సులు, దెబ్బతింటున్న కార్లు, బైక్‌లు ఎన్నో. వాహనాల మందగమనం, చిన్న-పెద్ద ట్రాఫిక్‌జామ్ లు నిత్యకృత్యాలు. ఎండ వాతావరణాన్ని ఉపయోగించుకుని యుద్ధప్రాతిపదికపై రోడ్లు నిర్మిస్తామని (కొన్నిచోట్ల నిర్మిస్తున్నారు కూడా) జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించినా, వారి ప్రయత్నం అవసరంలో ఆవగింజలా ఉంది. జరూర్‌గా గుంతలు పూడ్చే కార్యక్రమం కన్నా శాశ్వత ప్రాతిపదికపై పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినట్లున్నారు. అందువల్ల చాలాప్రాంతాల్లో గుంతలు ఇబ్బందికరంగా కొనసాగు తున్నాయి. అంతేగాక వివిధ సంస్థల మధ్య సమన్వయం కూడా ఉండవలసినంత స్థాయిలో కనిపించదు. జాతీయ రహదారులు (ఎన్‌హెచ్), పారిశ్రామిక ప్రాంత స్థానిక సంస్థలు (ఐఎఎల్‌ఎ), హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్, రహదారులు-భవనాల శాఖ, హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ), తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ కంపెనీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటిసరఫరా, మురుగునీటి పారుదలబోర్డు – ఈ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనేగాని రోడ్ల పునరుద్ధరణ పనులు సక్రమంగా జరగవు. ఈ సంస్థలు, శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మేయర్ బొంతు రామ్మోహన్‌రెడ్డి రహదారుల విచారకర స్థితిపట్ల ప్రజల బాధలను, ఆగ్రహాన్ని వారి దృష్టికితెచ్చి యుద్ధప్రాతిపదికపై పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

జిహెచ్‌ఎంసి పరిధిలో జాతీయ రహదారుల సంస్థ కింద 88 కిలోమీటర్ల రోడ్లుండగా రూ. 11కోట్లతో 20కి.మీ. పునరుద్ధరణ చేబట్టామని, ఎల్‌బినగర్ నుంచి మియాపూర్ వరకు రూ.44 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు ఢిల్లీ పంపామని, నిధులు మంజూరు కాగానే పనులు చేబడతామని ఎన్‌హెచ్ ఎస్‌ఇ వెల్లడించారు. కాబట్టి నగరంలో రోడ్ల పునరుద్ధరణ కు కొద్దిమాసాలు పడుతుందని విదితమవుతున్నది. ఈలోపు గుంతలు పూడ్చే పనులను జిహెచ్‌ఎంసి తాత్కాలిక ప్రాతిపదికపై చేబట్టి సత్వరం పూర్తిచేయనిదే నగర ప్రజలకు కనీస ఉపశమనం చేకూరదు. జిహెచ్‌ఎంసి ఏటా నగర రోడ్ల అభివృద్ధి – నిర్వహణకు రూ.400 కోట్లు వెచ్చిస్తున్న ప్పటికీ కొద్దిపాటి వర్షాలకు సైతం రోడ్లు దెబ్బతింటున్నాయంటే నాణ్యతను గాలికొది లేశారని, అవినీతి తాండవిస్తున్నదని తేటతెల్లమవుతున్నది. ఈసారి దాదాపు మూడు వారాల పాటు దఫదఫాలుగా భారీ వర్షాలు కురవటంవల్ల రోడ్ల అధ్వాన్నస్థితిని ఊహించు కోవచ్చు. తెలంగాణ జనాభాలో నాల్గవవంతు నివసించే నగరం, విశ్వనగరాలకు దీటుగా అభివృద్ధి చేయటం లక్షంగా పెట్టుకున్న మహానగరం రోడ్లను మెరుగైన టెక్నాలజీతో పటిష్టంగా నిర్మించటం ఎంతైనా అవసరం. బృహత్ ప్రణాళికలు కాగితాలను దాటి ఆచరణలోకి రావాలి.